నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 8:10PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి మడగాస్కర్‌కు మొదటిసారి బిస్కెట్ల ఎగుమతికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అగ్రికల్చరల్, ప్రాసెస్‌డ్ ఫూడ్ ప్రాడక్ట్‌స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ.. ‘అపెడా’) మార్గాన్ని సుగమం చేసింది. దీంతో, వారణాసి ప్రాంత ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు, భారతదేశంలో శుద్ధిపరిచిన ఆహార ఉత్పాదనలను ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉంచే దిశగా ఒక కీలకమైన అడుగును కూడా వేసినట్లయింది.
‘అపెడా’ ఆధ్వర్యంలో భారత్, మడగాస్కర్ మధ్య ఉత్పాదనల మొత్తం వాణిజ్యం సుమారు రూ.990 కోట్లుగా నమోదైంది. ఉత్తరప్రదేశ్ అందించిన ఈ సహకారం మడగాస్కర్‌కు రాష్ట్ర వ్యవసాయ, శుద్ధిపరిచిన ఆహార పదార్థాల ఎగుమతిని మరింత పెంపొందింప చేసుకునేందుకు అనేక అవకాశాలు ఉన్న సంగతిని సూచిస్తోంది. ఎగుమతి సరకును వారణాసి నుంచి మహారాష్ట్రలోని నావ సేవ (జేఎన్‌పీటీ) వరకు రోడ్డు మార్గంలో, తరువాత మడగాస్కర్.. తామాతావే ఓడరేవు వరకు సముద్ర మార్గంలో చేరవేశారు.
భారతదేశం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.3,642 కోట్లు తృణ ధాన్య ఆధారిత బిస్కెట్ల ఎగుమతులు జరిగాయి. ఇదే కాలంలో మడగాస్కర్‌కు భారత్ నుంచి ఎగుమతి చేసిన బిస్కెట్ల విలువ సుమారు రూ.7.60 కోట్లు. ఇది ఈ మార్కెట్లో విస్తరణకు ఉన్న మరిన్ని అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తోంది.
వారణాసి నుంచి బిస్కెట్లను తొలిసారి ఎగుమతి చేయడం ఆ ప్రాంత ఆహార శుద్ధి రంగానికి లభించిన ఒక కీలక విజయం. అంతేకాదు, ఉత్తరప్రదేశ్‌లో శుద్ధి చేసిన ఆహార ఉత్పాదనల క్లస్టర్లకు ఎగుమతి సామర్థ్యం పెరుగుతున్న విషయాన్ని కూడా ఇది చాటి చెబుతోంది. ఈ కార్యక్రమంతో ప్రాంతీయ తయారీదారు సంస్థలకు ఇకమీద కొత్త అవకాశాలు చేజిక్కే అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయ మార్కెట్లోనూ రాష్ట్ర భాగస్వామ్యం బలోపేతం కాగలదని భావిస్తున్నారు.
మొదటి ఎగుమతి కన్‌సైన్‌మెంటును ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తయారీదారు, ఎగుమతిదారు సంస్థ మెస్సర్స్ శ్రీ తిరుపతి బాలాజీ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్ చేపడుతోంది. ఈ కార్యక్రమం ఈ ప్రాంత ఆహార శుద్ధి పరిశ్రమను అంతర్జాతీయ మార్కెట్లతో జతపరచడమే కాక, స్థానికంగా రూపొందించే ఉత్పాదనలకు ఓ కొత్త ఎగుమతి అవకాశాన్ని అందించే దిశలో కీలకమైన ముందడుగును వేయడానికి తోడ్పడినట్లు కూడా చెప్పవచ్చును.
వివిధ ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా ఎగుమతిదారులకు ‘అపెడా’ మద్దతును అందిస్తూవస్తోంది. ఈ కార్యక్రమాలలో.. ‘ఆహార్-2026’, ‘గల్ఫ్‌ఫూడ్-2026’ వంటి ప్రసిద్ధ దేశీయ, అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్స్‌లో (వాణిజ్య మేళాలు) భాగస్వామ్యానికి మార్గాన్ని సుగమం చేయడం కొన్ని. ఈ వేదికలు వారణాసి ప్రాంతంలో తయారు చేసిన ఉత్పాదనలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పెంపొందించడమే కాకుండా మార్కెట్ లభ్యతను, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల అవకాశాలను కల్పించడంలో కూడా దోహదం చేశాయి.
మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పాటును అందించి, ఎగుమతిదారు సంస్థలను ప్రోత్సహించి, అంతర్జాతీయ వాణిజ్య మేళాలలో పాల్గొనేటట్లు చేయడం, ప్రపంచ స్థాయి వాణిజ్య సంబంధాలకు దోహదం చేయడం వరకూ.. భారత వ్యవసాయ, శుద్ధిపరిచిన ఆహార పదార్థాల ఎగుమతికి ‘అపెడా’ నిరంతర ప్రాతిపదికన సాయపడుతోంది. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో శుద్ధిచేసిన ఆహార ఉత్పాదనలకు అంతర్జాతీయ స్థాయి ఉనికిని పటిష్టపరుస్తాయి. అలాగే, ప్రాంతీయ ఎగుమతిదారు సంస్థలకు కొత్త కొత్త మార్కెట్లను అన్వేషించడంలోను, ఎగుమతి అవసరాలను విస్తరించుకోవడంలోను మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.
***