శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీవవైవిధ్యానికి గిరిజన సమాజాలే రక్షకులుగా ఉన్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్


శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగం

భారతీయ శాస్త్రీయ పురోగతిని గిరిజన పరిజ్ఞానం, స్టెమ్ శిక్షణ తీర్చిదిద్దుతాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

గిరిజన ఆర్థిక వ్యవస్థలను అందుబాటు ధరల్లో ఉన్న, స్థానికులకు అనువైన సాంకేతికతలు బలోపేతం చేస్తాయి: కేంద్ర మంత్రి

గిరిజన సాధికారత కోసం ఎస్‌టీఐపై సాంకేతిక సంపుటి, బుక్‌లెట్ ఆవిష్కరణ

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 4:52PM by PIB Hyderabad

భారతదేశ శాస్త్రీయ, ఆవిష్కరణల ప్రయాణంలో గిరిజన వర్గాలు భాగస్వాములుగా, నాయకులుగా ఉండాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగాల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పిలుపునిచ్చారు.

భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్టీ) పరిధిలోని ఎస్ఈఈడీ విభాగం, నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ (ఎన్ఈ‌సీటీఏఆర్) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా గిరిజన సాధికారత కోసం సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలపై టెక్నాలజీ సంపుటిని, బుక్‌లెట్‌ను విడుదల చేశారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఆదర్శమూర్తుల్లో భగవాన్ బిర్సా ముండా ఒకరని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆయన గిరిజన వర్గాల ధైర్యం, ఆత్మగౌరవం, ఆకాంక్షలకు ప్రతీక అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి దిశగా సాగే ప్రయత్నాలకు ఆయన జీవితం, సేవలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మంత్రి తెలిపారు.

అడవులు, నదులు, పర్వతాలతో మమేకమై జీవనం సాగిస్తున్న గిరిజన సమాజాలను జీవవైవిధ్య సంరక్షకులుగా మంత్రి అభివర్ణించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గిరిజన విజ్ఞానం, ఆచారాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని, అదే సమయంలో డిజిటల్ విద్య, స్టెమ్ శిక్షణకు సంబంధించిన భారతదేశ ప్రయాణంలో నాయకత్వం వహించేలా గిరిజన యువతకు సహాయపడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో జీవనోపాధి కల్పనకు, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి నైపుణ్యాలు, మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానాల మద్దతుతో కూడిన సాంకేతిక ఆధారిత సంస్థలు అవసరమని మంత్రి అన్నారు.

వికసిత్ భారత్–2047 దార్శనికతను సాధించడానికి గిరిజన వర్గాలకు... ముఖ్యంగా మారుమూల, భౌగోళికపరమైన సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సాధికారత కల్పించడం అవసరం అని మంత్రి అన్నారు.

స్థానిక పరిస్థితులకు అనువైన, తక్కువ ఖర్చుతో లభించే, సులభంగా నిర్వహించగల సాంకేతిక పరిజ్ఞానాల ఆవశ్యకత గురించి కేంద్ర మంత్రి వివరించారు. సికిల్ సెల్ అనీమియా గురించి మాట్లాడుతూ సీఎస్ఐఆర్–ఐజీఐబీ, న్యూఢిల్లీలోని ఎయిమ్స్, హైదారాబాద్‌లోని సీఎస్ఐఆర్–ఐఐసీటీ, ముంబయిలోని ఎన్ఐఐ, ఇతర సంస్థలు భాగమైన బహుళ సంస్థాగత సీఆర్ఐఎస్పీఆర్–సీఏఎస్9 జన్యు చికిత్స ప్రయత్నం గురించి డాక్టర్ సింగ్ ప్రస్తావించారు.

షెడ్యూల్డ్ తెగల వర్గాలకు అండగా నిలిచేందుకు గత కొన్నేళ్లుగా ప్రొఫెసర్ ఉమేష్ వి. వాఘ్మారేతో పాటు శాస్త్ర సాంకేతిక విభాగం గణనీయమైన కృషి చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన 75,000 మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చిన 124 కొత్త ప్రాజెక్టుల గురించి, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 ప్రత్యేక సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఎస్‌టీఐ) హబ్‌ల గురించి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో పదకొండు ఎస్సీ, ఎస్టీ సెల్స్ కూడా ఏర్పాటు చేశారు. సహజ వనరుల నిర్వహణ కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ తెగలకు చెందిన 20,000 మందికి పైగా సభ్యులు లబ్ధి పొందారు.

షెడ్యూల్డ్ తెగలకు చెందిన కనీసం ఒక వ్యవస్థాపకుడు ఉన్న అంకురసంస్థలను ప్రోత్సహించేందుకు నిధి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టీబీఐ) హబ్‌ల ఏర్పాటు కోసం డీఎస్‌టీ ప్రతిపాదనలను కూడా ఆహ్వానించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ వర్గాల్లో వెలుగులోకి తీసుకురావాల్సిన అపారమైన ప్రతిభ ఉందన్నారు. వారు దాతృత్వాన్ని కాకుండా న్యాయంగా తమకు దక్కాల్సిన అవకాశాలను మాత్రమే కోరుకుంటున్నారని డాక్టర్ సింగ్ అన్నారు. ఇన్‌స్పైర్-మానక్ కార్యక్రమంలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు 21,087 మంది పాల్గొన్నారని వెల్లడించారు. ఈ పురస్కార గ్రహీతల్లో ఎక్కువ మంది వారే ఉన్నారని తెలియజేశారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి, జాతీయ అభివృద్ధికి దోహదపడిన ఇతర గిరిజన నాయకులను స్మరించుకోవడానికి, గిరిజన వర్గాల సహకారాన్ని గుర్తించే సందర్భమే జనజాతీయ గౌరవ్ దివస్ అని డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్ ఉమేష్ వి. వాఘ్మారే అన్నారు. దేశ సుస్థిరాభివృద్ధికి సమాజంలోని అన్ని విభాగాలతో పాటు గిరిజన వర్గాలతో కలిసి పనిచేయడం చాలా అవసరమని ఆయన అన్నారు.

భారతదేశపు బలమైన పరిశోధనా వ్యవస్థను, టెక్నాలజీలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించగల దేశ సామర్థ్యాన్ని భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్ వివరించారు. రుటాగ్, గ్రామీణ స్మార్ట్ విలేజ్ సెంటర్ల గురించి తెలియజేస్తూ... జీవనోపాధిని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే సాంకేతికత ఆధారిత సంస్థలకు గిరిజన వర్గాలు, మహిళలు, స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నాయకత్వం వహించగలరని అన్నారు

ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో గిరిజన వర్గాలకు లబ్ధి చేకూరేలా డీఎస్‌టీ, ఎన్ఈసీటీఏఆర్ తోడ్పాటుతో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు, చర్యలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డీఎస్‌టీ, ఇతర సంస్థలు, భాగస్వాములను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. అలాగే, భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక పురోగతి వల్ల కలిగే ప్రయోజనాలను దేశంలోని ప్రతి మూలకూ, సమాజంలోని ప్రతి వర్గానికీ చేరేలా చూడాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

***


(రిలీజ్ ఐడి: 2337794) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil