మలయాళ చలనచిత్ర సీమలో ‘ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ హీరో’గా సుప్రసిద్ధుడైన నటుడు ప్రేమ్ నజీర్ చిరస్మరణీయ వారసత్వం నుంచి నవతరం దర్శకుల వినూత్న కథాకథనాల దాకా గోవాలో నిర్వహించే 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఆ భాషా చిత్రాల సుసంపన్నతను, వైవిధ్యాన్ని ప్రపంచం ముందుంచుతోంది.
ఈ మేరకు మలయాళ సినిమా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా దిగ్గజ నటుడు ప్రేమ్ నజీర్ నటించిన ‘తులాభారం’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. భారతీయ చలనచిత్ర రంగ ప్రముఖుల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. తద్వారా భారత చలనచిత్ర రంగ చరిత్రపై చెరగని ముద్ర వేసిన చిత్రాలను, నటనా వైదుష్యాన్ని మరోసారి వీక్షించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది.
సమకాలీన మలయాళ సినిమాకు ప్రాతినిధ్యం వహిస్తూ- అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్వం మాయ’ చిత్రం ‘'ఇండియన్ పనోరమా’' విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఇది నివిన్ పౌలీ, అజు వర్గీస్, రియా షిబు, ప్రీతి ముకుందన్ వంటి ప్రసిద్ధ కళాకారులు నటించిన అలౌకిక డ్రామా. ఇందులో నాస్తికుడైన ఒక సంగీత విద్వాంసుడు (ప్రభేందు) ఒక యువతి ఆత్మతో విలక్షణ బంధం ఏర్పరచుకుంటాడు. ఈ క్రమంలో విశ్వాసం, ప్రేమ, ఆత్మశోధనతో కూడిన అతడిలోని భావోద్వేగాలను ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
దీంతోపాటు ‘ఇండియన్ పనోరమా’ కింద ‘న్యూ హొరైజన్’ విభాగంలో శ్రుతి శరణ్యం దర్శకత్వం వహించిన ‘ఒట్టాంజావాళ్మరం’, శ్రీహరి హరిదాస్ దర్శకత్వం వహించిన ‘అజయంతే మరణం: ఒరు కేస్ స్టడీ’ మలయాళ చిత్రాలకూ స్థానం లభించింది. సందీప్ ఫ్రాన్సిస్ దర్శకత్వంలో రూపొందిన 11 నిమిషాల లఘు చిత్రం ‘స్విచ్ ఆఫ్’ కూడా ఈ ఉత్సవాల్లో ప్రదర్శితమవుతుంది. అలాగే, కేరళం దర్శకుడు సంజాద్ రూపొందించిన ‘హాఫ్’ చిత్రాన్ని ‘గాలా ప్రీమియర్స్’ విభాగంలో ప్రదర్శిస్తారు. మలయాళ సినిమా ప్రత్యేకత చాటే విభిన్న ఇతివృత్తాలు, కథాకథనాలను ఈ చిత్రాలన్నీ ప్రతిబింబిస్తాయి.
ఈ ఉత్సవంలో భాగంగా సాగే ప్రత్యేక సమావేశాలు, చర్చాగోష్ఠులలో మలయాళ సినీ ప్రముఖులు కూడా ప్రధాన పాత్ర పోషించనున్నారు. దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ ‘ది ఎపిక్ జానర్స్– మైథాలజీస్, సూపర్ హీరోస్ అండ్ న్యూ వరల్డ్స్’ పేరిట నిర్వహించే ‘ఇన్ కాన్వర్జేషన్’ గోష్టిలో పాల్గొంటారు. నేటి సినిమాలలో ఇతిహాస కథన శైలిలో వస్తున్న మార్పులను ఈ సందర్భంగా విశ్లేషిస్తారు. భారత సంగీత దిగ్గజాలు ఆశా భోంస్లే, ఎస్.జానకిలకు నివాళి అర్పించే ‘సంస్మరణ గోష్ఠి’కి ‘మధుర గాయని’ ప్రముఖ బహుహాషా సినీ నేపథ్య గాయని కె.ఎస్.చిత్ర నాయకత్వం వహిస్తారు.
గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకూ ‘సరిహద్దుల అతీత కథా వేదిక’ ఇతవృత్తంగా భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ప్రపంచవ్యాప్త చలనచిత్రాలు, దర్శకులు, సినిమా అభిమానులను ఈ ఉత్సవం ఒకే వేదికపైకి తెస్తుంది. తద్వారా సాంస్కృతిక ఆదానప్రదానానికి తోడ్పడటమే కాకుండా సినిమా అనే సార్వత్రిక భాషను ఘనంగా ఆవిష్కరిస్తుంది.
****