నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 9:44PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటీఎఫ్)2026ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేడు ప్రారంభించారు. భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలు) ద్వారా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉనికిని విస్తరించుకోవాలని భారత వ్యాపార సంస్థలు, తయారీదారులు, ఎగుమతిదారులు, చేతివృత్తుల కళాకారులు, పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని మార్కెట్లు భారత వస్తువులు, సేవలకు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఈ అవకాశాలను అందిపుచ్చుకుని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
సభను ఉద్దేశించి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. 2026 అక్టోబర్‌లో భారత్ దాదాపు 90 బిలియన్ డాలర్ల ఎగుమతులతో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిని నమోదు చేసిందని తెలిపారు. ఇందులో సుమారు 50 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులు, 40 బిలియన్ డాలర్ల సేవల ఎగుమతులు ఉన్నాయని వివరించారు. దీన్ని చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. ప్రస్తుత సంవత్సరంలో ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ పురోగమిస్తోందని పేర్కొన్నారు. అక్టోబర్ వరకు తొలి ఏడు నెలల్లో ఎగుమతులు 570 బిలియన్ డాలర్లకు చేరాయని, ఇది అపూర్వమైన విజయమని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా రెండు యుద్ధాలు కొనసాగుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా అనిశ్చితి, ఒడుదొడుకులు నెలకొన్నప్పటికీ, ప్రపంచ వాణిజ్య వృద్ధి దాదాపు 3.5 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేస్తున్నప్పటికీ.. ప్రస్తుత సంవత్సరంలో భారత్ అంతర్జాతీయ వాణిజ్యం 15 నుంచి 16 శాతం వృద్ధి సాధిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలం, ఎగుమతిదారుల్లో ఉన్న విశ్వాసం, ప్రపంచ సవాళ్లను దృఢ సంకల్పంతో, ఆత్మగౌరవంతో ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత్ పనితీరు ప్రతిబింబిస్తోందని అన్నారు.
ఐఐటీఎఫ్ భారత్‌లోని అయిదు కోణాలను ప్రతిబింబిస్తోందని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అవి దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, 140 కోట్ల మంది భారతీయుల నుంచి ఉత్పన్నమవుతున్న డిమాండు, దేశ గొప్ప వైవిధ్యమని వివరించారు. ఈ వాణిజ్య ప్రదర్శన గతంలో ప్రధానంగా ఢిల్లీకి మాత్రమే పరిమితమైన కార్యక్రమం నుంచి పరిణామం చెంది, దేశంలోని రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు, ఉత్పత్తులు, సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రదర్శనగా ఎదిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది వాణిజ్య ప్రదర్శనలో ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ప్రత్యేకతలను ప్రదర్శిస్తున్నాయని మంత్రి తెలిపారు. 3,500 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 11 దేశాల భాగస్వామ్యం ఈ ప్రదర్శనలో ఉందని పేర్కొన్నారు. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పెవిలియన్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కళలు, హస్తకళలు, చేనేత, ఆహార ఉత్పత్తుల రంగాల్లో భారత్ బలాన్ని ఈ పెవిలియన్ చాటిచెప్పనుందని వివరించారు.
‘హాల్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్’లో 600 అంకుర సంస్థలు వాటి ఆవిష్కరణలను ప్రదర్శించనుండటం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఐఐటీఎఫ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా సందర్శకులు మొత్తం ప్రదర్శనకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ప్రదర్శన ప్రాంగణంలో సులభంగా దారి తెలుసుకోవడంతో పాటు, తమకు ఆసక్తి ఉన్న ఎగ్జిబిటర్లను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. భారత్ మండపం అంతటా విస్తరించిన ఈ ప్రదర్శనను పూర్తిగా సందర్శించాలంటే రెండు నుంచి మూడు రోజులు కేటాయించాల్సి ఉంటుందని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
భారత్ మండపం విస్తరణలో తదుపరి దశను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ విస్తరణతో ఎగ్జిబిటర్లకు అందుబాటులో ఉన్న ప్రదర్శన స్థలం దాదాపు రెట్టింపు కానుందని తెలిపారు. ఐఐటీఎఫ్ సహా ఇటీవల నిర్వహించిన ప్రదర్శనలు విజయవంతం కావడం, ప్రస్తుతం గణనీయంగా విస్తరించిన సదుపాయాలు సైతం పెరుగుతున్న డిమాండుకు సరిపోవడం లేదని నిరూపించిందని ఆయన అన్నారు.
ఇకపై ఐఐటీఎఫ్‌ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీఓ) రంగాలవారీగా, బహుముఖ అంశాలతో కూడిన పలు అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ఈ ప్రదర్శనల ద్వారా భారత వస్తువులు, సేవలు, అంకుర సంస్థలు తమ సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు, ఇతర అంతర్జాతీయ మార్కెట్లతో వ్యాపార సంబంధాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. ముఖ్యంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల మార్కెట్లలో ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యాపార సంస్థలు, ఎగ్జిబిటర్లు చురుగ్గా పాల్గొని, అంతర్జాతీయ వేదికపై భారత్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
నాణ్యత, సుస్థిరత ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. భారత్ ప్రధానంగా నాణ్యత, సుస్థిరత అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి అన్నారు. ‘జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్’ (లోపాలు లేని ఉత్పత్తులు.. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం లేని తయారీ) సూత్రాన్ని అనుసరించడం ద్వారా దేశవ్యాప్తంగా సమానమైన, సమ్మిళిత వృద్ధిని సాధించవచ్చని తెలిపారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులన్నీ అత్యున్నత నాణ్యతను ప్రతిబింబిస్తూ, అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేయాలని అన్నారు.
తయారీ, సేవల రంగాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించడంతో పాటు సుస్థిర పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. సర్క్యూలర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, సహజ ఉత్పత్తుల వినియోగం, జీవవిచ్ఛిన్నమయ్యే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆర్థిక వృద్ధిని సాధించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకునే పోటీలో భారత్ ప్రపంచ స్థాయిలో విజయం సాధించడంతో పాటు ప్రజల సౌభాగ్యాన్ని పెంపొందించగలదని పేర్కొన్నారు.
దేశీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న బలాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్‌తో పాటు నవరాత్రి, దసరా, ధంతేరస్ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా బలమైన వ్యాపార కార్యకలాపాలు చోటుచేసుకున్నాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దుకాణాలు గణనీయమైన వినియోగదారుల డిమాండును చవిచూశాయని, వ్యాపార కార్యకలాపాలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయని చెప్పారు. అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లు ఇప్పటికే ఆ నెలలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయని, నవంబర్‌లోనూ రికార్డు స్థాయి వసూళ్లు నమోదవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలు భారత్ వృద్ధి ప్రస్థానంలోని బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి వర్గం దేశ పురోగతికి తనవంతు తోడ్పాటునందిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. రైతులు, మత్స్యకారులు, కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), తయారీదారులు, సేవల రంగ సంస్థలు, కళాకారులు, చేతివృత్తుల వారు, చేనేత, హస్తకళల ఉత్పత్తిదారులు.. ఇలా అన్ని వర్గాల్లోనూ వృద్ధి, విశ్వాసం కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక కిరాణా దుకాణాల నుంచి ఈ-కామర్స్ సంస్థల వరకు, చేతివృత్తుల కళాకారుల నుంచి పెద్ద బ్రాండ్ల వరకు ప్రతి ఒక్కరూ విస్తరిస్తున్న ఆర్థిక అవకాశాల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
భారత యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ల వైపు మరింతగా అడుగులు వేస్తున్నాయని, ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకుంటూ ఉజ్వల భవిష్యత్తు దిశగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎగుమతులకు కొత్తగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను ఉదాహరణలతో వివరిస్తూ.. గతంలో ఎగుమతులు దాదాపుగా లేని అరుణాచల్ ప్రదేశ్ నుంచి కివీ పండ్ల ఎగుమతులు, కులూ నుంచి సింధూరి దానిమ్మ పండ్లు దుబాయ్‌కు చేరడాన్ని ప్రస్తావించారు. ఐఐటీఎఫ్‌లో పాల్గొంటున్న ఎగ్జిబిటర్లు, వ్యాపార సంస్థలు ఎగుమతి సామర్థ్యం ఉన్న ఉత్పత్తులను గుర్తించి, భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలు) ద్వారా లభిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని, వాటిని చేరుకునేందుకు భారత వ్యాపార సంస్థలే చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.
మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, వైద్యం, నైపుణ్యాలు, ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు మరిన్ని అవకాశాలను ఆశిస్తున్న యువ జనాభా భారత్ వృద్ధికి ప్రధాన శక్తిగా నిలుస్తోందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. గత 12 ఏళ్లలో దాదాపు 50 కోట్ల మంది ప్రజలను తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో సాధించిన విజయంపై సంతృప్తితో పాటు ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు పెరిగాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కొంటోందని.. వాణిజ్యం, ఆర్థిక వృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిందని ఆయన అన్నారు. నిర్ణయాత్మక నాయకత్వం, దేశ ఆర్థిక బలం పెరుగుతుండటమే ఈ విశ్వాసానికి కారణమని పేర్కొన్నారు.
భారత్ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప సాధనలో దేశ యువ జనాభా, విస్తరిస్తున్న వ్యాపార సంస్థలు, పెరుగుతున్న ఎగుమతి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
అభివృద్ధి సాధించే క్రమంలో భారత వారసత్వం, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని కూడా కేంద్ర మంత్రి వివరించారు. ఈ ఏడాది ఐఐటీఎఫ్ ఇతివృత్తం భారత ప్రస్థానాన్ని సముచితంగా ప్రతిబింబిస్తోందని, వారసత్వానికి గౌరవం లేని అభివృద్ధి అసంపూర్ణమని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలను ప్రస్తావిస్తూ.. సంపద, శ్రేయస్సు సాధించిన దేశాలు తమ సంప్రదాయాలు, వారసత్వం, సంస్కృతిని కూడా పరిరక్షించి, ప్రోత్సహించి, విస్తృతంగా ప్రచారం చేశాయని పేర్కొన్నారు.
నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ సముదాయంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’ ఏర్పాటుకు ఇటీవల ఆమోదం లభించిన విషయాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అనేక వేల సంవత్సరాలుగా ప్రపంచానికి భారత్ అందించిన వైవిధ్యం, సుదీర్ఘ చరిత్ర, విశిష్ట సేవలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయాల్సిన ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించారని తెలిపారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 30 శాతానికి పైగా ఉండేదని గుర్తుచేస్తూ.. దేశ గతాన్ని అర్థం చేసుకుని, గుర్తించడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్ తనకు తగిన స్థానాన్ని తిరిగి పొందడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని సాధించగలమని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ సముదాయంలో నిర్మిస్తున్న ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’ దేశ చరిత్ర, సంప్రదాయాలు, ప్రపంచానికి భారత్ అందించిన సేవలను ప్రదర్శిస్తుందని, భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా దేశ యువతకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
45వ ఐఐటీఎఫ్ సాధారణ స్థాయి మెరుగుదలలను అధిగమించి, వికసిత్ భారత్ 2047 దార్శనికత దిశగా కీలక ముందడుగు వేసిందని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని, భారత వస్తువులు, సేవలు, కళలు, సంస్కృతిని ప్రోత్సహించేలా ప్రపంచానికి భారత్ తనను తాను పరిచయం చేసుకునే విధానంలోనూ, అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలను పెంపొందించుకునే క్రమంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీఓ), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే కార్యక్రమాలు.. సమష్టి ప్రభుత్వ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని అన్నారు.
చివరగా 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2026ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశ ఆర్థిక ప్రగతి, ప్రపంచంతో భారత్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే ప్రయాణంలో చురుగ్గా భాగస్వాములు కావాలని అన్ని వర్గాలకు పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
***