నాడు పోస్టు చేయడమైనది:
14 NOV 2026 4:10PM by PIB Hyderabad
భారత్–నేపాల్ మధ్య రైలు అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. నేపాల్‌లోని జనక్‌పూర్‌ధామ్, భారత్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య మధ్య కొత్త వారాంతపు రైలు సర్వీసును ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది.
రామాయణ సంప్రదాయంతో గాఢమైన అనుబంధం కలిగిన రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఈ రైలు సర్వీసు కీలక అనుసంధానంగా నిలవనుంది. సీతామాత జన్మస్థలంగా పూజలందుకుంటున్న జనక్‌పూర్‌ధామ్, ప్రభు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య మధ్య రైలు ప్రయాణ సదుపాయం కల్పించనుంది. ఈ చొరవతో ఇరు దేశాల ప్రయాణికులకు ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది. అదే సమయంలో ఉమ్మడి నాగరికతా వారసత్వం మరింత బలోపేతం కానుంది.
సరిహద్దులు దాటి కీలక ప్రాంతాలకు రైలు అనుసంధానం
సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ వారాంతపు రైలు సర్వీసు.. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య పట్టణాలు, నగరాల మీదుగా జనక్‌పూర్‌ధామ్‌ను అయోధ్య కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానించనుంది.
ఈ రైలుకు ప్రారంభ, చివరి స్టేషన్లతో పాటు జయనగర్, మధుబని, శిషో, సీతామఢి, రక్సౌల్, నర్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ, మనక్‌పూర్, అయోధ్యధామ్ స్టేషన్లలో వాణిజ్యపరమైన హాల్టులు ఉంటాయి.
ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. జనక్‌పూర్‌ధామ్ నుంచి ప్రతి శనివారం, అయోధ్య కంటోన్మెంట్ నుంచి ప్రతి సోమవారం బయలుదేరుతుంది.
పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్ధికి ఊతం
కొత్త రైలు సర్వీసుతో యాత్రికులు, పర్యాటకులు, ఇతర ప్రయాణికులకు సరిహద్దులు దాటి ప్రయాణించడం మరింత సౌకర్యవంతం కానుంది. జనక్‌పూర్, అయోధ్య మధ్య ఆధ్యాత్మిక యాత్రలకు ఇది దోహదపడుతుంది. రామాయణంతో ముడిపడిన పర్యాటక మార్గాల అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు విద్య, వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం ప్రయాణించే వారికి మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తుంది.
రైలు మార్గంలో మెరుగైన అనుసంధానం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పర్యాటక నిర్వాహకులు, ఆతిథ్య రంగ సంస్థలు, స్థానిక వ్యాపారులు, సంప్రదాయ హస్తకళాకారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. బిహార్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు అదనపు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థిక, సామాజిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
భారత్–నేపాల్ స్నేహ సంబంధాలకు మరింత బలం
భారత్, నేపాల్ దేశాల మధ్య శతాబ్దాల చరిత్ర కలిగిన సాంస్కృతిక, చారిత్రక, సామాజిక బంధాలు ఉన్నాయి. మతపరమైన సంప్రదాయాలు, సరిహద్దులు దాటి కొనసాగుతున్న ప్రజల మధ్య సంబంధాలు ఈ భాగస్వామ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. కొత్త రైలు సర్వీసు ద్వారా ప్రజలను మరింత చేరువ చేస్తూ ద్వైపాక్షిక సహకారానికి మరో కోణాన్ని జోడించనున్నారు.
ఈ చొరవతో భారతీయ రైల్వే ప్రయాణికుల రవాణా అనుసంధానాన్ని విస్తరించడంతో పాటు ప్రాంతీయ పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడుతూ, పొరుగు దేశాలైన భారత్, నేపాల్ మధ్య చిరకాల స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.
***