నాడు పోస్టు చేయడమైనది:
14 NOV 2026 6:43PM by PIB Hyderabad
రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై చర్యలను మరింత ముమ్మరం చేస్తూ, అస్సాం రైఫిల్స్‌కు చెందిన 38వ బెటాలియన్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా నిఘా సమాచార ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 నవంబర్ 12న ఒక టిప్పర్ లారీ నుంచి 20 కిలోల మెథాంఫెటమైన్ మాత్రలను (యాబా అని పిలుస్తారు) స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో కచార్ జిల్లాలోని బోర్‌ఖోలా సమీపంలో టాటా టిప్పర్ లారీని డీఆర్ఐ అధికారులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మెకానిక్ సహాయంతో లారీ కుడివైపు ప్యానెల్ లోపలి పైభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరను గుర్తించారు. ఆ ప్యానెల్‌కు కటింగ్, వెల్డింగ్ చేసిన ఆనవాళ్లు ఉండగా, ఎవరికీ అనుమానం రాకుండా దానిపై సిమెంట్, పెయింట్ పూసి చాకచక్యంగా కప్పివేశారు.
ఆ రహస్య అరను తెరిచి చూడగా, 'మెథాంఫేటమిన్' గా అనుమానిస్తున్న గులాబీ - నారింజ రంగులో ఉన్న మాత్రలతో కూడిన 32 ప్యాకెట్లు లభించాయి. ఈ ప్యాకెట్లలో ఒక్కోటి కిలో చొప్పున బరువున్న 17 ఇటుక ఆకారపు ప్యాకెట్లు, ఒక్కోటి 200 గ్రాముల బరువున్న 15 దీర్ఘచతురస్రాకార ప్యాకెట్లు ఉన్నాయి. నమూనాలను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) ఫీల్డ్ డిటెక్షన్ కిట్ ఉపయోగించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, అందులో యాంఫేటమిన్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
మొత్తం 20 కిలోల బరువున్న స్వాధీనం చేసుకున్న మాత్రలతో పాటు, వాటిని తరలిస్తున్న టిప్పర్ లారీని 1985 ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చట్టంలోని నిబంధనల మేరకు లారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.
టిప్పర్ లారీ పక్క ప్యానెల్ లోపల ప్రత్యేకంగా రహస్య అరను ఏర్పాటు చేసి, సాధారణ తనిఖీల్లో గుర్తించకుండా ఉండేందుకు దాని తెరుచుకునే భాగాన్ని సిమెంట్, పెయింట్‌తో కప్పివేసిన వినూత్న అక్రమ రవాణా పద్ధతిని ఈ ఆపరేషన్ వెలుగులోకి తెచ్చింది.
నిఘా సమాచారం ఆధారంగా నిరంతరం చేపడుతున్న ఆపరేషన్లు, వివిధ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలను నిర్వీర్యం చేయడంతో పాటు, నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ సరఫరాను అరికట్టేందుకు డీఆర్ఐ కట్టుబడి ఉంది.
***