నాడు పోస్టు చేయడమైనది:
14 NOV 2026 5:47PM by PIB Hyderabad
'మై భారత్-జాతీయ సేవా పథకం' (ఎన్ఎస్ఎస్) డైరెక్టరేట్ ద్వారా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 100 వారాల ‘వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషా ముక్త్ యువ’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 9వ వారంలో దేశవ్యాప్తంగా మండల-స్థాయి క్రీడా పోటీలు నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమం 3వ నెలలో ‘బలమైన సమాజాలు, ఆరోగ్యకరమైన యువత’ ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమం... క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమష్టి కృషి, వ్యసన రహిత జీవనశైలిని ప్రోత్సహించేందుకు చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థి వాలంటీర్లు, స్థానిక యువజన సంఘాలు, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 992 కార్యకలాపాలను నిర్వహించగా... ఇందులో 87,481 మంది విద్యార్థి వాలంటీర్లు, స్థానిక యువజన సంఘాల సభ్యులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం కింద 02.08.2026న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ’ ప్రచార కార్యక్రమం... యువతను మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు, ఇతర వ్యసనపూరిత పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ద్వారా వ్యసన రహిత, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకుసాగుతోంది.
బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, జైపూర్, లక్నో, తిరువనంతపురంతో కూడిన 10 ప్రాంతీయ డైరెక్టరేట్ల పరిధిలోని 130కి పైగా సంస్థల నుంచి అందిన క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం... ఈ కార్యక్రమంలో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. వీటిలో 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం, మారథాన్లు, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు తాడు లాగే పోటీ, రుమాల్ ఝపట్, నిమ్మకాయ పరుగు వంటి సంప్రదాయ ఆటల పోటీలనూ నిర్వహించారు. లక్షద్వీప్‌లో తిరువనంతపురం ప్రాంతీయ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ ద్వీప క్రీడల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో లింగ సమానత్వానికీ ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా 42,190 మంది మహిళా క్రీడాకారులు ఈ పోటీలు, అవగాహన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచార సందేశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్రీడా పోటీలతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలనూ అనుసంధానించారు. క్రీడాస్ఫూర్తిని నిలబెడతామని... వ్యసన రహిత జీవనశైలిని గడుపుతామని క్రీడాకారులు, రిఫరీలు, కోచ్‌లు, ప్రేక్షకులు చేసిన 'నషా ముక్త్ సంకల్పం' ప్రతిజ్ఞతో ప్రతి పోటీ ప్రారంభమైంది.
భోపాల్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో మానసిక ఆరోగ్యంపై సమాచార, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) సామగ్రిని పంపిణీ చేశారు. జాతీయ వ్యసన విముక్తి హెల్ప్‌లైన్ (14446) గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, తోటివారి ఒత్తిడి (పీర్ ప్రెజర్), వ్యసనాల నుంచి బయటపడే మార్గాలపై అవగాహన పెంచేందుకు వీధి నాటకాలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలు, నినాదాల రచన పోటీలనూ ఈ కార్యక్రమాలకు అనుబంధంగా నిర్వహించారు.
స్థానిక యంత్రాంగం, నిపుణులూ ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారాన్ని అందించారు. భటిండా, కాసరగోడ్, కోయంబత్తూరులకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, నార్కోటిక్స్ సెల్ అధికారులు, మానసిక వైద్య నిపుణులు, వ్యసన విముక్తి నిపుణులు, పంచాయతీ సర్పంచులు సహా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.