శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
14 NOV 2026 6:11PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్రవిజ్ఞాన-సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ప్రవాస భారతీయులతో కలసి ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయులు, విద్యార్థులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు విభిన్న సామాజిక వర్గాలవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన శాస్త్ర-సాంకేతిక పరిశోధన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భారత శాస్త్రవిజ్ఞాన సామర్థ్యం, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ప్రపంచ శాస్త్రవిజ్ఞాన ప్రగతికి భారత్ విస్తృత సహకారంపై దేశంలో ఇనుమడిస్తున్న విశ్వాసం ఈ కార్యక్రమంలో ప్రతిబింబించింది.
భారత శాస్త్రవిజ్ఞాన, ఆరోగ్య సంరక్షణ రంగాలు శరవేగంగా పురోగమించడంపై కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులు సహా ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తి వ్యక్తమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో శాస్త్రవిజ్ఞాన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానంలో దేశం సాధించిన పురోగతిని వారందరూ ప్రశంసించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట నానాటికీ పెరుగుతుండటం సహా మధుమేహం వంటి కీలక ప్రజారోగ్య సవాళ్ల పరిష్కారంలో ప్రభుత్వ నిబద్ధతపై తాము గర్విస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు పేర్కొన్నారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రోమ్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రముఖ మధుమేహ చికిత్స నిపుణుడైన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి నిర్వహణ భారం పెరుగుదలను నివారించేందుకు అనుసరించాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ మేరకు జీవనశైలి మార్పులు, ఆరోగ్యకర ఆహారపుటలవాట్లు, శారీరక శ్రమ, ఊబకాయ నియంత్రణ ప్రాథమికంగా అత్యావశ్యకమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతరంలో మధుమేహ నివారణపై ప్రతి ఒక్కరూ మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
మధుమేహం రెండో రకం (డయాబెటిస్ మెలిటస్) చికిత్సలో అనేక కొత్త రకాల మందులు అందుబాటులోకి వచ్చినా, జీవనశైలి మార్పులు, ఊబకాయ నియంత్రణే దీని నివారణకు ప్రాథమిక మంత్రమని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్ఫుటం చేశారు.
‘మధుమేహంపై సత్వర కార్యాచరణ’ నినాదాన్ని ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవ ఇతివృత్తంగా నిర్ణయించడాన్ని ఆయన ప్రస్తావించారు. సమాజంలో మధుమేహ వ్యాప్తి వేగాన్ని అరికట్టేందుకు అవసరమైన నిర్వహణ వ్యూహాల సంపూర్ణ స్ఫూర్తిని ఈ నినాదం ప్రతిబింబిస్తుందని మంత్రి వివరించారు. మధుమేహ నిర్వహణ భారం పెరుగుదలను తగ్గించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో వ్యాధి ముందస్తు గుర్తింపు, సకాలంలో చర్యలు చేపట్టడం, అనంతరం ఔషధ-ఔషధేతర చర్యలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి కఠిన నియంత్రణ ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
మధుమేహం బారినపడే వారి వయస్సు తీరులో మార్పుపై డాక్టర్ జితేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. లోగడ మధ్య వయస్కులు, వృద్ధులతో ఈ వ్యాధి ఎక్కువగా ముడిపడి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు జీవితంలో అత్యంత కీలకమైన యవ్వన దశలోనే యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. చిన్న వయస్సులోనే మధుమేహం బారినపడటం వ్యక్తిలో వృత్తిపరమైన ఉత్పాదకత, జీవన నాణ్యతలపై దుష్ప్రభావం చూపుతుందని చెప్పారు. దీని బారినపడిన తర్వాత మూత్రపిండాలు, కళ్లు, గుండె వంటి కీలక అవయవాలకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని నిరోధించాలంటే సుదీర్ఘకాలం పాటు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణపై నిరంతర శ్రద్ధ అవశ్యమని స్పష్టం చేశారు.
ఊబకాయం, మధుమేహం, డిస్లిపిడెమియా, అధిక రక్తపోటు, గుండె జబ్బుల మధ్య సన్నిహిత జీవక్రియా సంబంధాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అవినాభావ సంబంధంగల ఈ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా బాలల్లో ఊబకాయ నివారణ-నియంత్రణ అవసరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదేపదే ప్రస్ఫుటం చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
మధుమేహం సహా జీవక్రియా సంబంధ రుగ్మతలకు ఒక స్వతంత్ర ప్రమాద కారకం స్థూలకాయమని, ప్రత్యేకించి భారతీయులు దీనిబారిన పడే అవకాశాలు అధికమని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో నివారణపరమైన ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
జీవక్రియ సంబంధ రుగ్మతలు, జీవనశైలి సంబంధ వ్యాధుల నిర్వహణ కోసం 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర-సంపూర్ణ విధానాన్ని కూడా మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు గురించి గుర్తుచేశారు. అలాగే, ఆరోగ్య శ్రేయో కేంద్రాల ఏర్పాటు, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. సమాజంలో మధుమేహ భారం తగ్గించడంలో ఇవన్నీ వివిధ రకాలుగా తోడ్పడతాయని ఆయన అన్నారు.
మధుమేహం కోసం సామూహిక స్క్రీనింగ్ ఏర్పాట్లు, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తేవడం, ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నత చికిత్స అందుబాటు వంటి కార్యక్రమాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యాధి ముందస్తు గుర్తింపు, చికిత్స అందుబాటును మరింత బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకున్న చర్యలను కూడా ఆయన వివరించారు.
ఆహార క్రమశిక్షణ, శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ, మధుమేహ నివారణ- నిర్వహణలో ఇవి అత్యావశ్యక అంశాలని మంత్రి అన్నారు. శారీరక, మానసిక ఒత్తిడి కూడా శ్రద్ధ వహించాల్సిన దోహదకారక అంశాలని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో మధుమేహంతో జీవించే వారి సంఖ్య అధికంగా ఉన్నందువల్ల ఈ వ్యాధి నిర్వహణలో దేశానికి గణనీయ అనుభవం ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ నిపుణులు తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇతర దేశాల నిపుణులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. అలాగే, ఈ సవాలును ఎదుర్కోవడంలో విస్తృత అంతర్జాతీయ కృషికి తోడ్పడగల స్థితిలో వారంతా ఉన్నారని తెలిపారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవ సందేశం కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం కాదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ముఖ్యంగా యువతలో వ్యాధి నివారణ, ముందస్తు నిర్ధారణ, నిరంతర నిర్వహణపై మరింతగా దృష్టి సారించాలని పునరుద్ఘాటించారు.
ఇటలీలో ఈ నెల 11 నుంచి 15 వరకూ మంత్రి అధికార పర్యటనలో భాగంగా రోమ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని భారతీయ సమాజ సభ్యులతోనూ ఆయన ముచ్చటించారు.
****