నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ నాయకత్వం.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రం

2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యం దిశగా భారత్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 3:50PM by PIB Vijayawada

విశాఖపట్నంలో నేడు నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర విద్య, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “సుస్థిర భవిష్యత్తుకు భరోసా: ఇంధన భద్రత, స్వచ్ఛ సాంకేతికతలు, ప్రపంచ భాగస్వామ్యం” అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (MoUs) గురించి ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన రంగంలో కుదిరిన 17 అవగాహన ఒప్పందాలు, జారీ చేసిన 3 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.43,871 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 4,700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ పెట్టుబడి నిబద్ధతలు స్వచ్ఛ ఇంధనం, సుస్థిర అభివృద్ధి దిశగా భారత్, ఆంధ్రప్రదేశ్ తమ వాగ్దానాలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.

దేశ ఇంధన భద్రతలో సాధించిన పురోగతిని వివరిస్తూ, 2012లో దేశంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 123 గిగావాట్లుగా ఉండేదని, ఆ సమయంలో చోటుచేసుకున్న భారీ విద్యుత్ గ్రిడ్ వైఫల్యం కారణంగా ఉత్తర భారతదేశం దాదాపు 72 గంటల పాటు అంధకారంలో మునిగిపోయిందని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 270 గిగావాట్లకు చేరినప్పటికీ, ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని తెలిపారు. ఇందులో దాదాపు 33 శాతం విద్యుత్ శిలాజేతర ఇంధన వనరుల నుంచి సమకూరుతోందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను ప్రస్తావించిన కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్‌లోనే 7.86 లక్షల కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇప్పటికే 66 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయని, ఈ పథకం ప్రారంభ లక్ష్యం కోటి కుటుంబాలని వివరించారు. తొలి లక్ష సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు 118 రోజులు పట్టగా, ప్రస్తుతం సగటున కేవలం 6 రోజుల్లోనే ఏర్పాటు పూర్తవుతోందని తెలిపారు. త్వరలో ఈ సమయాన్ని 5 రోజులకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. రైతులు, గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లులు సున్నాకు తగ్గించుకోవడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయం కూడా పొందుతున్నారని పేర్కొన్నారు.

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం సాధించిన పురోగతిని వివరిస్తూ, 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 175 గిగావాట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. దేశ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వనరుల వాటా ప్రస్తుతం సుమారు 55 శాతానికి చేరుకుందని చెప్పారు. దీంతో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 'జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్' విధానాన్ని ప్రస్తావిస్తూ, హరిత ఇంధనం భారత్‌ను ప్రపంచ హరిత తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భారత్, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన, సురక్షితమైన గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాజకీయ స్థిరత్వం, విధానాల కొనసాగింపు, నిర్ణయాలను సమర్థంగా అమలు చేసే సామర్థ్యం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు. వ్యవసాయ పరికరాలు, పంపులకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించడాన్ని మరింత విస్తరించేలా త్వరలో ప్రారంభించనున్న పీఎం-కుసుమ్ 2 పథకాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

చివరగా, భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసే క్రమంలో హరిత ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. హరిత ఇంధనంతో తయారయ్యే భారత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత పోటీతత్వ ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2335939) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Kannada