నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఓడరేవులు, నౌకా నిర్మాణానికి భారీ ఊతమిస్తూ అంతర్జాతీయ సముద్ర రవాణా కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంత ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

నాలుగు గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవు ప్రాజెక్టులు, దుగరాజపట్నం వద్ద రూ. 30,000 కోట్ల అంచనా వ్యయంతో నౌకా నిర్మాణ క్లస్టర్‌లను ప్రతిపాదించినట్లు తెలిపిన కేంద్ర మంత్రి

తూర్పు దేశాలకు భారతదేశపు సముద్ర ముఖద్వారంగా ఎదిగే సువర్ణావకాశం నేడు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది: సర్బానంద సోనోవాల్

కృత్రిమ మేధస్సు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్‌ల శక్తితో పనిచేసే స్మార్ట్ ఓడరేవులు సామర్థ్యం, పోటీతత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి: సర్బానంద సోనోవాల్

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 7:28PM by PIB Hyderabad

ఓడరేవుల మౌలిక సదుపాయాలు, నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతు రంగాలకు అందిస్తున్న భారీ ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన సముద్ర రవాణా, లాజిస్టిక్స్ కేంద్రంగా ఎదగడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. నేడు విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. బంగాళాఖాతం వెంట ఉన్న సుమారు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, కీలక అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు అనుసంధానం, ప్రధాన ఆసియా తయారీ-వాణిజ్య ఆర్థిక వ్యవస్థలకు ఉన్న సామీప్యం వంటి రాష్ట్రానికి గల వ్యూహాత్మక అనుకూలతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బలాలు ఆంధ్రప్రదేశ్‌ను ఆసియాన్, తూర్పు ఆసియా, విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు భారతదేశపు ప్రధాన సముద్ర ముఖద్వారంగా నిలబెడతాయని ఆయన పేర్కొన్నారు.

 

రాష్ట్ర సముద్ర రవాణా ఆకాంక్షలను వేగవంతం చేయడానికి అనుకూల పరిస్థితులను కల్పించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన సహకారాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

“హైదరాబాద్ సైబరాబాద్‌గా ఎదిగినట్లే నేడు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు దేశాలకు భారతదేశపు సముద్ర ముఖద్వారంగా మారే సువర్ణావకాశం ఉంది” అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత వృద్ధికి, సముద్ర రవాణా రంగంలో ఉద్భవిస్తున్న అవకాశాలకు మధ్య ఉన్న సారూప్యతను ఆయన ఈ సందర్భంగా సరిపోల్చి చెప్పారు.

 

విశాఖపట్నం ఓడరేవులో రూ. 560 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు బుధవారం నాడు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు ఓడరేవు సామర్థ్యాన్ని మరింత పెంచడానికి, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దోహదపడనున్నాయి.

 

మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్ వద్ద నిర్మాణంలో ఉన్న నాలుగు ప్రధాన గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవు ప్రాజెక్టులతో రాష్ట్ర ఓడరేవుల మౌలిక సదుపాయాలు మరింత విస్తరించనున్నాయి. ఈ ప్రాజెక్టులు సరుకు రవాణా నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయని భావిస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌ విషయంలో నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతులను ప్రధాన అవకాశాలుగా గుర్తించిన శ్రీ సర్బానంద సోనోవాల్.. దుగరాజపట్నం వద్ద ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ నౌకా నిర్మాణ క్లస్టర్ వివరాలను వెల్లడించారు. జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించిందని.. సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ఏటా 1.2 మిలియన్ స్థూల టన్నుల నిర్దేశిత సామర్థ్యంతో దీనిని రూపొందించినట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో ఒక కేంద్ర-రాష్ట్ర ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థను (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ నౌకా నిర్మాణ సంస్థలు, సాంకేతిక కంపెనీలు, పరికరాల తయారీదారులు, సముద్ర రవాణా రంగ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను తమ ప్రాధాన్యతా పెట్టుబడి గమ్యస్థానంగా పరిశీలించాలని ఆయన కోరారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు నౌకా నిర్మాణ దేశాల్లో ఒకటిగా నిలవాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని శ్రీ సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన సామర్థ్యం, సాంకేతికత, పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, ఇతర సముద్ర రవాణా కార్యకలాపాలకు ఆర్థిక సహాయంగా మోదీ ప్రభుత్వం రూ. 70,000 కోట్లను కేటాయించిందని.. తద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని ఆయన వెల్లడించారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తోన్న విస్తృత పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ సముద్ర రవాణా అభివృద్ధి అంతర్భాగమని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాలు రూ. 80 లక్షల కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన సముద్ర ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 

 

స్వదేశీ కంటైనర్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన రూ. 10,000 కోట్ల కంటైనర్ తయారీ పథకం, భారతదేశపు 12,000 కిలోమీటర్ల తీరప్రాంత సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల తీరప్రాంత సరుకు రవాణా ప్రోత్సాహక పథకం వివరాలను కూడా కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలోని వాధవన్ వద్ద రూ. 80,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లోతైన జలాలు కలిగిన, అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన మెగా కంటైనర్ ఓడరేవు దేశ సముద్ర రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే మరో ప్రధాన పురోగతి అని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్వహించిన నాలుగు గ్లోబల్ మారిటైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులు భారతదేశ సముద్ర రవాణా రంగంలో సుమారు రూ. 25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయని ఆయన తెలిపారు.

 

సముద్ర రవాణా అభివృద్ధి తదుపరి దశలో సాంకేతికత పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించిన శ్రీ సర్బానంద సోనోవాల్.. “కృత్రిమ మేధస్సు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్‌ల శక్తితో పనిచేసే స్మార్ట్ ఓడరేవులు సామర్థ్యం, పోటీతత్వాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరివర్తనలో అగ్రగామి పాత్ర పోషించే సువర్ణావకాశం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది” అని పేర్కొన్నారు.

 

ఓడరేవుల అభివృద్ధి, నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతు, క్రూయిజ్ పర్యాటకం, తీరప్రాంత నౌకాయానం, సముద్ర పారిశ్రామికీకరణను వేగవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఆంధ్రప్రదేశ్ విషయంలో మూడు ప్రధాన ఆకాంక్షలను శ్రీ సర్బానంద సోనోవాల్ వివరించారు. ఇందులో ‘వికసిత్ భారత్ 2047 కోసం ప్రధానమంత్రి రూపొందించిన సప్తధార రోడ్‌మ్యాప్ స్ఫూర్తితో ఓడరేవు ఆధారిత అభివృద్ధికి అగ్రగామి గమ్యస్థానంగా ఎదగడం’ మొదటిది కాగా.. ‘ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన నౌకా నిర్మాణ, నౌకల మరమ్మతు కేంద్రంగా ఆవిర్భవించడం’ రెండోది. ‘ఆసియాన్, తూర్పు ఆసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు భారతదేశపు సముద్ర ముఖద్వారంగా నిలవడం’ మూడోది.

విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పటిష్టమైన సముద్ర రవాణాను కలిగి ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నిర్వహించి గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా ఇది నిరంతర వృద్ధిని కొనసాగించింది.

 

‘నూతన ప్రపంచ క్రమానికి దిశానిర్దేశం: వాణిజ్యం | సాంకేతికత | విశ్వాసం | మేధో నాయకత్వం’ అనే ఇతివృత్తంతో నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 జరుగుతోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలలో నూతన అవకాశాలను అన్వేషించడానికి ఈ సదస్సు ప్రభుత్వ నాయకులు, పారిశ్రామిక ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది

***.

 


(రిలీజ్ ఐడి: 2335631) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी