నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ తూర్పు సముద్ర వాణిజ్య ముఖద్వారంగా తీర్చిదిద్దాలి: కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

ఓడరేవుల అభివృద్ధి, నౌకా నిర్మాణ క్లస్టర్ ఏర్పాటులో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ నౌకా నిర్మాణ సంస్థలు, పెట్టుబడిదారులకు ఆహ్వానం

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 4:47PM by PIB Vijayawada

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల సముద్ర వాణిజ్య, రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత తూర్పు, మధ్య ప్రాంతాల ప్రధాన ముఖద్వారంగా మలచాలనే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. విశాఖపట్నంలో నేడు జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో ఆయన ముఖ్యోపన్యాసం చేశారు.

పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసించారు. 1990వ దశకంలోనే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి, హైదరాబాద్‌ను ప్రధాన సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అదే విధంగా 21వ శతాబ్దంలో సముద్ర రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక అవకాశాలు ఉన్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వ్యూహాత్మక అనుకూలతలను వివరిస్తూ, బంగాళాఖాతం వెంబడి సుమారు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం రాష్ట్రానికి ప్రధాన బలమని సర్బానంద్ వ్యాఖ్యానించారు. భారత్‌ను తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో పాటు విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతంతో అనుసంధానించే కీలక అంతర్జాతీయ నౌకాయాన మార్గాలకు రాష్ట్రం సమీపంలో ఉందని తెలిపారు.

విశాఖపట్నం పోర్టు సాధిస్తున్న ప్రగతిని కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించిందని, దాదాపు 10 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. వరుసగా నాలుగో ఏడాది కూడా నిరంతర వృద్ధిని కొనసాగించిందని వెల్లడించారు. పోర్టు సామర్థ్యాన్ని మరింత విస్తరించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా విశాఖపట్నం పోర్టులో దాదాపు రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగర్‌మాల, మారిటైమ్ ఇండియా విజన్-2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 కార్యక్రమాల ద్వారా దేశంలో సముద్ర రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల కింద సుమారు రూ.80 లక్షల కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాతీయ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉందని చెప్పారు.

రాష్ట్రంలో నాలుగు ప్రధాన గ్రీన్‌ఫీల్డ్ పోర్టులైన మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ ఎస్‌సీజే పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పోర్టులు పూర్తయితే రాష్ట్రంలో సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

దుగరాజపట్నంలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ నౌకా నిర్మాణ క్లస్టర్ గురించి ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించిందని తెలిపారు. సుమారు రూ.30,000 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని, ఏటా 1.2 మిలియన్ గ్రాస్ టన్నేజీ నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ నౌకా నిర్మాణ సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, పరికరాల తయారీదారులు, పోర్టు నిర్వాహకులు, పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని మంత్రి ఆహ్వానించారు.

రాష్ట్రం కోసం మూడు కీలక లక్ష్యాలను మంత్రి వివరించారు.

  1. వికసిత్ భారత్-2047 కోసం రూపొందించిన సప్తధార రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా, ఓడరేవుల ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం.
  2. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల నౌకా నిర్మాణ, నౌకల మరమ్మతుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడం.
  3. ఆసియా, తూర్పు ఆసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు అనుసంధానంగా భారత్‌కు తూర్పు సముద్ర వాణిజ్య ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడం.

ఈ లక్ష్యాలను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మధ్య సన్నిహిత భాగస్వామ్యం అవసరమని మంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేశ సముద్ర రంగ భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని, వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు గణనీయమైన తోడ్పాటును అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2335544) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Assamese