నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 3:18PM by PIB Vijayawada
విశాఖపట్నంలో నేడు జరిగిన 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్య సదస్సు-2026 ప్రారంభ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, ఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ స్థిరమైన, విశ్వసనీయమైన, సమర్థవంతమైన పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
కార్తీక మాస పవిత్రతను, దీపదానం సంప్రదాయంతో మంత్రి పోల్చారు. మరొక దీపాన్ని వెలిగించడం ద్వారా ఒక దీపం తన వెలుగును కోల్పోదని, ఇదే భాగస్వామ్యానికి సరైన నిర్వచనమని అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ సదస్సు కూడా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వాణిజ్యం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేసే మరో వేదికగా నిలుస్తుందని అభివర్ణించారు.

విశాఖపట్నం సంకల్పబలం, పునరుద్ధరణ సామర్థ్యం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదల, సంకల్పబలాన్ని మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. అక్టోబర్ 28, నవంబర్ 3 తేదీల్లో వరుసగా రెండు తుపాన్లు సంభవించినప్పటికీ, అంతర్జాతీయ ప్రతినిధులు, మంత్రులు, పెట్టుబడిదారులకు స్వాగతం పలికేందుకు విశాఖపట్నం పూర్తిస్థాయిలో సిద్ధమైందని పేర్కొన్నారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
దార్శనికత నుంచి కార్యాచరణ వరకు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక దార్శనికతను మంత్రి ప్రశంసించారు. ఐటీ విప్లవాన్ని ముందుగానే గుర్తించి ప్రోత్సహించిన ఆయన, ప్రస్తుతం కృత్రిమ మేధ, క్వాంటమ్ ఇంజినీరింగ్, డేటా సెంటర్లు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై ముందుచూపుతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రపంచం ఇంకా 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి మాట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే తదుపరి దశకు చేరుకుందని అన్నారు.
పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్క్రో ఖాతా విధానాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. టీమ్ ఇండియా సమన్వయంతో పనిచేస్తోందని, వాణిజ్య ఒప్పందాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంటే, ఆ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఉద్యోగాల కల్పనగా మారుస్తోందని వివరించారు.

ప్రపంచ పెట్టుబడిదారులకు మూడు హామీలు
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రతి పెట్టుబడిదారుడికి భారత్ మూడు స్పష్టమైన హామీలను అందిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు.
1. స్వేచ్ఛాయుత మార్కెట్:
గత నాలుగున్నర సంవత్సరాల్లో 38 దేశాలతో భారత్ తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు లేదా ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసిందని మంత్రి తెలిపారు. ఈ దేశాల మొత్తం ప్రపంచ జీడీపీలో వాటా 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు, సంప్రదింపులు పూర్తయితే ఈ విలువ 85 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, అంటే మొత్తం 115 ట్రిలియన్ డాలర్ల ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగింట మూడు వంతులని వివరించారు.
దీంతో భారతీయ వ్యాపారాలు, ఉత్పత్తులు, సేవలు, నైపుణ్యాలకు, దేశంలోని 2.5 లక్షల స్టార్టప్‌లకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
2. సామర్థ్యం:
విశాఖపట్నంలో ఉక్కు నుంచి సిలికాన్ వరకు, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, తిరుపతిలో స్పేస్ సిటీ, పూడిమడకలో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ వరకు రాష్ట్రం, దేశం భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పరిశోధన, అభివృద్ధి (అర్&డీ) సహకారంతో పాశ్చాత్య దేశాల్లో అయ్యే వ్యయంతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే అంతర్జాతీయ ఆవిష్కర్తలు భారత్‌లో తమ ఉత్పత్తులను రూపొందించి, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో మేధో సంపత్తి హక్కులకు పూర్తి గౌరవం కల్పిస్తామని స్పష్టం చేశారు.
భారత్ సాంకేతిక పరిజ్ఞాన బదిలీని కోరదని, ఇతరుల సాంకేతికతను దొంగిలించదని మంత్రి ఉద్ఘాటించారు.
3. విశ్వసనీయత:
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత అరుదైన వనరు విశ్వాసమేనని మంత్రి పేర్కొన్నారు. బాహుబలి కథను ప్రస్తావిస్తూ, భాగస్వామి వెన్నుపోటు పొడవని నమ్మకాన్ని భారత్ కల్పిస్తుందని అన్నారు.
కోవిడ్ సమయంలో 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లు, మందులు, ఆహార ధాన్యాలను భారత్ అందించిందని గుర్తుచేశారు. ఇది భారత్ విశ్వసనీయతకు నిదర్శనమని పేర్కొన్నారు.
20వ శతాబ్దంలో తక్కువ వ్యయంతో ఉత్పత్తులు అందించడమే పోటీలో కీలకంగా ఉండేదని, 21వ శతాబ్దంలో మాత్రం విశ్వసనీయత ఆధారంగా పోటీ కొనసాగుతుందని మంత్రి అన్నారు. ఇప్పుడు అత్యంత తక్కువ ఖర్చుతో ఎవరు ఉత్పత్తి చేయగలరనేది ప్రశ్న కాదని, ఎవరు సుపరిపాలన, పారదర్శక పాలన, వేగం, విస్తృత స్థాయిలో సేవలను అందించగలరన్నదే ముఖ్యమని వివరించారు.
మూడు వర్గాలకు మంత్రి పిలుపు
కార్తీక మాస పవిత్ర సమయంలో మంత్రి పీయూష్ గోయల్ మూడు కీలక పిలుపులను ఇచ్చారు.
- పెట్టుబడిదారులకు: మీ తదుపరి తయారీ పరిశ్రమ, పరిశోధన-అభివృద్ధి కేంద్రం (ఆర్&డీ), గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ లేదా డిజైన్ కేంద్రం ఏర్పాటుకు భారత్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు.
- పారిశ్రామిక రంగానికి: సుస్థిర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎప్పటికప్పుడు ముందంజలో ఉండాలని సూచించారు.
- భాగస్వామ్య దేశాలకు: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సురక్షితమైన గమ్యస్థానంగా ఉన్న భారత్, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, హోటళ్లు, డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విశాఖపట్నంలో ఏర్పడే భాగస్వామ్యాలు తెలుగు భాషంత మధురంగా ఉండటమే కాకుండా, దీర్ఘకాలిక సౌభాగ్యాన్ని తీసుకువస్తాయని పేర్కొంటూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు 'ప్రపంచానికి నూతన క్రమ మార్గాన్వేషణ: వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, ఆలోచనాత్మక నాయకత్వం' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. దాదాపు 60 దేశాలకు చెందిన విధాన నిర్ణేతలు, మంత్రులు, పారిశ్రామిక ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనీయమైన పెట్టుబడి ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
***