శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 2:38PM by PIB Hyderabad
యూరప్‌తో భారత శాస్త్రీయ సంబంధాలను బలోపేతం చేయడం, శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించడమే లక్ష్యంగా మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు ఇటలీకి బయలుదేరారు.
భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర మంత్రి.. అంతరిక్షం, ఏరోస్పేస్, పరిశోధన సహకార రంగాలకు సంబంధించిన ఇటలీ మంత్రులతో చర్చలు జరపనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు, రోమ్‌లో రెండో భారత్-ఇటలీ శాస్త్ర, ఆవిష్కరణల చర్చలు-2026, ట్రియెస్టేలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థల సందర్శన కార్యక్రమాలు జరగనున్నాయి. పరిశోధన, వ్యూహాత్మక సాంకేతికతలు, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు ఈ పర్యటన వేదిక కానుంది.
నవంబర్ 12న రోమ్‌లో జరగనున్న రెండో భారత్-ఇటలీ శాస్త్ర, ఆవిష్కరణల చర్చలు-2026లో ఇరు దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రీయ సంస్థలు, పరిశోధకులు, ఆవిష్కరణ రంగ ప్రతినిధులు, సాంకేతిక ఇంక్యుబేటర్లు పాల్గొననున్నాయి. పరిశోధనలో నాణ్యత, వ్యూహాత్మక సాంకేతికతలు, పరిశోధన ఫలితాలను ఆవిష్కరణలుగా మలచడం, సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, భవిష్యత్తు సహకారం కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వంటి అంశాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది.
ఇటలీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన శాఖ మంత్రి అన్నా మారియా బెర్నినీ, అంతరిక్షం, ఏరోస్పేస్ విధానాల బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి అడోల్ఫో ఉర్సోతో డాక్టర్ జితేంద్ర సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. శాస్త్ర, సాంకేతికత, పరిశోధన, పరస్పర ఆసక్తి కలిగిన వ్యూహాత్మక రంగాల్లో భారత్-ఇటలీ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశాలు దోహదపడనున్నాయి.
నవంబర్ 13న ట్రియెస్టేలో జరిగే మంత్రి పర్యటనలో భాగంగా ఎలెట్రా సింక్రోట్రాన్ కేంద్రం, అబ్దుస్ సలాం అంతర్జాతీయ సైద్ధాంతిక భౌతికశాస్త్ర కేంద్రం (ఐసీటీపీ), అంతర్జాతీయ జన్యు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కేంద్రం (ఐసీజీఈబీ)లను సందర్శించనున్నారు. శాస్త్రీయ పరిశోధనలో సహకారం, పరిశోధన మౌలిక సదుపాయాల భాగస్వామ్యాలు, పరిశోధకుల పరస్పర మార్పిడి అవకాశాలను అన్వేషించేందుకు ఈ సందర్శనలు దోహదపడనున్నాయి.
నవంబర్ 14న రోమ్‌లో ప్రవాస భారతీయులతో కేంద్ర మంత్రి సమావేశం కానున్నారు. అదే రోజు భారత రాయబార కార్యాలయంలో నిర్వహించే ప్రపంచ మధుమేహ దినోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొంటారు.
అంతర్జాతీయ శాస్త్రీయ భాగస్వామ్యాలను విస్తరించడం, పరిశోధన ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా సంస్థలు, సాంకేతిక రంగ వ్యవస్థలతో సంబంధాలను బలోపేతం చేయడంలో భారత్ నిబద్ధతను ఈ ఇటలీ పర్యటన ప్రతిబింబిస్తోంది.
భారత్, ఇటలీ దేశాల మధ్య సంప్రదాయ స్నేహ సంబంధాలు ఉన్నాయి. పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది. డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనతో నూతన, అత్యాధునిక రంగాల్లో ఈ సహకారం మరింత విస్తరించే అవకాశముంది.
ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటలీలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశం కానున్నారు.
నవంబర్ 14న నిర్వహించే ప్రపంచ మధుమేహ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆయన పర్యటనలోని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి.

***