సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘నషా ముక్త్ యువ, వికసిత్ భారత్ క్విజ్’లో పాల్గొన్న 25,607 మంది పౌరులు

ఈ క్విజ్‌లో పాల్గొనేందుకు ఈ నెల 25 వరకు అవకాశం

35.84 కోట్ల మందికి పైగా ప్రజలను చేరుకున్న ప్రచారం

వీరిలో 14.33 కోట్ల మంది యువత, 11.32 కోట్ల మంది మహిళలు

విద్యా సంస్థల్లో 33.57 లక్షలకు పైగా కార్యక్రమాల నిర్వహణ

39.91 లక్షల మందికి చికిత్స, పునరావాసం

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మద్దతుతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 755కు పైగా వ్యసన విముక్తి కేంద్రాలు

నషా ముక్త్ ప్రతిజ్ఞలు తీసుకున్న 46.73 లక్షలకు పైగా మంది ప్రజలు

2 లక్షలకు పైగా నషా ముక్తి మిత్రల నమోదు

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 6:07PM by PIB Hyderabad

ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ యువ, వికసిత్ భారత్ క్విజ్’ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 10 నాటికి ఇందులో పాల్గొన్న వారి సంఖ్య 25,600 దాటింది. మాదకద్రవ్య రహిత భారతావనిని నిర్మించే ఉమ్మడి లక్ష్యం పట్ల ప్రజల్లో... ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆసక్తిని పెరుగుతున్న ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది.

'నషా ముక్త్ భారత్ అభియాన్' (ఎన్ఎమ్‌బీఏ)లో భాగంగా భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ క్విజ్‌ను అక్టోబర్ 26, 2026న ప్రారంభించింది. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం, 'నషా ముక్త్ భారత్'ను నిర్మించే దిశగా పౌరులను, ముఖ్యంగా యువతను చురుగ్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

ఈ క్విజ్ 2026, అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహించబడుతోందని, ఇందులో పౌరులంతా పాల్గొనవచ్చని మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు 'మై భారత్' పోర్టల్ ద్వారా క్విజ్‌లో పాల్గొనవచ్చనీ... తద్వారా ఈ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని ఆయన పేర్కొన్నారు.

పాల్గొనడం కోసం ఈ లింక్ ఉపయోగించండి:

https://mybharat.gov.in/quizzes/yuva/detail/Url9dlIwCinQVSf8lwPB9w/

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 2020, ఆగస్టు 15న ప్రారంభమైంది. నివారణాత్మక విద్య, అవగాహన కల్పన, చికిత్స, పునరావాసం, సమాజ భాగస్వామ్యం ద్వారా మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించే ప్రయత్నాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం అని మంత్రత్వశాఖకు చెందిన అధికారి వివరించారు.

మొదట 272 వెనకబడిన జిల్లాల్లో మొదలైన ఈ కార్యక్రమం... ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రచారం 35.84 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువయ్యిందనీ... ఇందులో 14.33 కోట్ల మంది యువత, 11.32 కోట్ల మంది మహిళలూ ఉన్నారని ఆ అధికారి పేర్కొన్నారు. ఇది ఈ అవగాహన, విస్తరణ కార్యక్రమాల దేశవ్యాప్త పరిధిని ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల్లో 33.57 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ మద్దతుతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 755కు పైగా వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా 39.91 లక్షల మందికి చికిత్స, పునరావాసం కల్పించారు. 'నషా ముక్త్' కోసం తీసుకున్న ప్రతిజ్ఞల సంఖ్య 46.73 లక్షలు దాటిందనీ, 2 లక్షల మందికి పైగా 'నషా ముక్తి మిత్ర'లుగా నమోదు చేసుకున్నారని మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించడం, యువతను చైతన్యం చేయడం, నివారణ కోసం క్రియాశీల రాయబారులుగా మారేలా యువతను ప్రోత్సహించడం ఈ క్విజ్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

దేశాభివృద్ధిలో ఆరోగ్యకరమైన వ్యక్తులు, కుటుంబాలు, సమాజాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ... ఈ కార్యక్రమం 'నషా ముక్త్ భారత్', 'వికసిత్ భారత్' దార్శనికతలను మరింత బలోపేతం చేస్తుందని ఆ అధికారి తెలిపారు.

ఈ క్విజ్‌లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయనీ, దీనిలో పాల్గొనేవారు వీటిని 10 నిమిషాల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని సదరు అధికారి వివరించారు.

క్విజ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, సమర్పించిన ప్రతి అభ్యర్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

క్విజ్ పూర్తి చేసిన అభ్యర్థులు తర్వాత సరైన సమాధానాలను చూసుకోవచ్చని... తద్వారా మాదకద్రవ్యాల వినియోగ నివారణ పట్ల తమ అవగాహనను మెరుగుపరుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ డిజిటల్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, బాధ్యతాయుతమైన ఎంపికలను ప్రోత్సహించడం, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి పౌరులను, ముఖ్యంగా యువతను సమీకరించి, వారి సహకారాన్ని పొందడం మంత్రిత్వ శాఖ లక్ష్యమని ఆ అధికారి తెలిపారు.

‘నషా ముక్త్ యువ, వికసిత్ భారత్ క్విజ్’లో పాల్గొనాలనుకునే వారికి ఈ నెల 25 వరకు అవకాశం కల్పించామన్నారు. ఈ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా మాదకద్రవ్య రహిత భారత్‌ లక్ష్య సాధనలో క్రియాశీల భాగస్వాములయ్యేందుకు పౌరులందరినీ, ముఖ్యంగా యువతనూ మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2334832) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi