నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 6:44PM by PIB Hyderabad
గోవాలో నిర్వహించిన గనులు, బొగ్గు రంగ సంస్కరణలపై 4వ గనులశాఖ మంత్రుల సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత బొగ్గు, గనుల రంగాలు గణనీయమైన పరివర్తనకు లోనయ్యాయని ఆయన పేర్కొన్నారు. నిరంతర సంస్కరణల ద్వారా ఈ రంగాల్లో పారదర్శకత, సామర్థ్యం, వృత్తిపరమైన నైపుణ్యం పెరిగాయని, జాతీయ ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రతకు ఈ రంగాల సహకారం మరింత బలోపేతమైందని వివరించారు.
బొగ్గు రంగ ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తూ.. దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు వనరులను గరిష్ఠంగా వినియోగించుకునేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ (వాయువీకరణ) ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని శ్రీ జీ కిషన్ రెడ్డి చెప్పారు. దేశీయ బొగ్గు ఆర్థిక విలువను వెలికితీయడం, పారిశ్రామిక రంగంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో దీనికి ఉన్న సామర్థ్యాన్ని వివరించారు.
మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ.. దేశీయంగా అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్, శుద్ధి, రీసైక్లింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, దేశ వ్యూహాత్మక, ఆర్థిక పటిష్టతను పెంపొందించేందుకు స్వావలంబనతో కూడిన ఖనిజ వ్యవస్థను అభివృద్ధి చేయడం అత్యవసరమని అన్నారు.
సాంకేతికత పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రను ప్రస్తావిస్తూ.. అన్వేషణ, గనుల నిర్వహణ, ఖనిజాల వెలికితీత ప్రక్రియల్లో కృత్రిమ మేధ, డిజిటలీకరణ, అధునాతన సాంకేతిక పరిష్కారాలను విస్తృతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాంకేతికత ఆధారిత విధానాలు బొగ్గు, గనుల రంగాల్లో ఉత్పాదకత, కార్యకలాపాల సామర్థ్యం, సుస్థిరతను మెరుగుపరుస్తాయని తెలిపారు.
వేలం వేసిన గనులను త్వరితగతిన కార్యకలాపాల్లోకి తీసుకురావాలని, కొత్త గనుల బ్లాకుల వేలాన్ని వేగవంతం చేయాలని, అన్వేషణ కార్యకలాపాలను విస్తరించాలని, సాంకేతికత ఆధారిత విధానాలను అవలంబించాలని రాష్ట్రాలను కేంద్ర మంత్రి కోరారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఖనిజ వనరుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. గనుల రంగ సంస్కరణల వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతమయ్యాయని, పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాలు, ఆదాయ సమీకరణ పెరిగాయని వివరించారు. అదే సమయంలో గనుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి కూడా ఈ సంస్కరణలు దోహదపడ్డాయని తెలిపారు.
సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని తెలియజేస్తూ.. దేశంలోని ఖనిజ, బొగ్గు వనరుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి, గనుల వ్యవస్థను బలోపేతం చేయడానికి, సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం అవసరమని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సమష్టి కృషి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో భారత గనులు, బొగ్గు రంగాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు గణనీయంగా దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే మాట్లాడుతూ.. దేశ ఆర్థిక ప్రగతి, పారిశ్రామిక అభివృద్ధి, ఇంధన భద్రతకు గనుల రంగం కీలకమైన ఆధారమని పేర్కొన్నారు. పారదర్శక వేలం ప్రక్రియలు, పెట్టుబడులను ప్రోత్సహించడం, కొత్త ఉపాధి అవకాశాల కల్పన, గనుల కార్యకలాపాలను వేగవంతం చేయడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విస్తృత సంస్కరణలను ఆయన వివరించారు.
సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గనుల పునరుద్ధరణ, గనుల ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. అభివృద్ధితో పాటు పర్యావరణ, సామాజిక ప్రయోజనాలను కాపాడేందుకు గనుల కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచే తవ్వకాల అనంతర పునరావాస ప్రణాళికలు, స్థానిక ప్రజలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాల కల్పనను కార్యాచరణలో భాగం చేయాలని సూచించారు.
సురక్షితమైన, ఆధునిక మైనింగ్ సాంకేతికతలను ప్రోత్సహిస్తూనే బొగ్గు ఉత్పత్తిని పెంచడం, బొగ్గు గ్యాసిఫికేషన్, బొగ్గు వినియోగంలో నూతన ఆవిష్కరణలు, ప్రారంభ దశ రవాణా అనుసంధానం వంటి కార్యక్రమాలపై కూడా ఆయన దృష్టి సారించారు. గనుల రంగంలో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారానికి రాష్ట్రాలు తమ అనుభవాలను, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ.. భారత బొగ్గు రంగం సాధించిన గణనీయమైన పురోగతిని వివరించారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో, ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
వరుసగా రెండో ఏడాది కూడా దేశీయ బొగ్గు ఉత్పత్తి ఒక బిలియన్ టన్నులను దాటిందని ఆయన తెలిపారు. ఇంధన స్వావలంబన దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో, దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఇదొక కీలక విజయమని పేర్కొన్నారు.
బొగ్గు రంగాన్ని మరింత పోటీతత్వంతో కూడినదిగా, పారదర్శకంగా, సమర్థవంతంగా, పెట్టుబడులకు అనుకూలంగా మార్చేందుకు నిరంతర నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని శ్రీ విక్రమ్ దేవ్ దత్ చెప్పారు. వాణిజ్య బొగ్గు తవ్వకాలు, సవరించిన శక్తి విధానం, కోల్ సేతు వంటి కీలక కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించాలని, ప్రక్రియలను సరళతరం చేయాలని, బొగ్గు గనుల కార్యకలాపాలను వేగంగా ప్రారంభించాలని ఆయన సూచించారు.
విలువ ఆధారిత ఉత్పత్తుల కల్పన, పారిశ్రామిక వైవిధ్యీకరణ, ఉపాధి అవకాశాల సృష్టికి బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలోని అపార సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రాలు పెట్టుబడులకు చురుకుగా సహకరించాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడాలని, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కోరారు.
సాంకేతికత, డిజిటలీకరణ, సుస్థిర మైనింగ్ విధానాలు, సమర్థవంతమైన రవాణా వ్యవస్థల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, దేశంలోని బొగ్గు, ఖనిజ వనరుల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత బలమైన సమన్వయం అవసరమని కార్యదర్శి పేర్కొన్నారు.
బొగ్గు రంగంలో తదుపరి దశ వృద్ధి కేవలం తవ్వకాలకే పరిమితం కాకుండా, అదనపు విలువను సృష్టించే దిశగా సాగాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్రాల ఆదాయాల పెరుగుదలకు, ఉపాధి కల్పనకు దోహదపడే చోదకశక్తిగా ఈ రంగాన్ని తీర్చిదిద్దుతూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు తోడ్పడాలని పేర్కొన్నారు.
సదస్సులో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్ బొగ్గు రంగంలో ఇటీవల చేపట్టిన సంస్కరణలు, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర, రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న కీలక సవాళ్లు, ఆశిస్తున్న సహకారం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. ఈ సంస్కరణలు విధానాలను ఎలా సరళతరం చేస్తున్నాయి, పారదర్శకతను ఎలా పెంచుతున్నాయి, పెట్టుబడులకు ఎలా అనుకూలత కల్పిస్తున్నాయి, ఈ రంగంలోని భాగస్వాములకు మరింత వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఎలా సృష్టిస్తున్నాయో ఆమె తన ప్రజెంటేషన్‌లో వివరించారు. ఉద్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు సంస్కరణల వేగాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత బలమైన సహకారం అవసరమని కూడా ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాలు మరింత సమర్థవంతమైన, పోటీతత్వంతో కూడిన, సుస్థిరమైన బొగ్గు రంగానికి మార్గం సుగమం చేస్తున్నాయని, తద్వారా దేశ ఇంధన భద్రతకు, ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ 2026 నవంబర్ 5, 6 తేదీల్లో గోవాలో నాలుగో గనుల శాఖ మంత్రుల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల గనులశాఖ మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గనుల రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై పరస్పర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ రంగంలో సాధించిన పురోగతి, అందుబాటులో ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చలు జరిగాయి. అదే సమయంలో రాష్ట్రాలు తమ అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలు, అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునేలా ప్రోత్సహించారు.
నాలుగో గనుల శాఖ మంత్రుల సదస్సులో జరిగిన చర్చలు దేశ బొగ్గు రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతర సంస్కరణలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో కూడిన కృషి ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేశాయి.
బొగ్గు గ్యాసిఫికేషన్ను వేగవంతం చేయడం, వాణిజ్య బొగ్గు తవ్వకాలను ప్రోత్సహించడం, అధునాతన సాంకేతికతలను వినియోగించడం, పెట్టుబడులకు అనుకూలత కల్పించడం, సుస్థిరమైన మైనింగ్ విధానాలను అమలు చేయడంపై దృష్టి సారిస్తూ.. దేశీయ బొగ్గు వనరుల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. అదనపు విలువ సృష్టి, కార్యకలాపాల సామర్థ్యం పెంపు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, సహకార సమాఖ్యవాదానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పారిశ్రామిక వృద్ధి, ఇంధన భద్రత, ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధికి కీలక చోదకశక్తిగా భారత బొగ్గు రంగాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి.