నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 5:31PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇండో-పసిఫిక్ రీజినల్ డైలాగ్' (ఐపీఆర్డీ) - 2026 సదస్సునుద్దేశించి కేంద్ర శాస్త్ర - సాంకేతిక, భూవిజ్ఞాన శాఖల మంత్రి (స్వతంత్ర బాధ్యత), పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. స్వదేశీ సామర్థ్యాలు, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో... సముద్ర సంబంధిత పరిశోధనలు, అన్వేషణ రంగంలో అంతర్జాతీయంగా ముందంజలో నిలవడమే భారత్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో భారత శాస్త్రీయ ప్రయోగాలు, పరిశోధనలు కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా... వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలను ఒకే తాటిపైకి తెస్తూ 'మిషన్-మోడ్' విధానంలో సాగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సముద్ర విజ్ఞానం, అంతరిక్ష సాంకేతికత, అణు విజ్ఞానం, భూగర్భ శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి కీలక రంగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయడం వల్లే భారత నౌకా వాణిజ్య, డీప్-ఓషన్ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన కొనియాడారు.
లోతైన సముద్రంలో అన్వేషణల విషయంగా భారత్ స్వదేశీ సామర్థ్యాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో 5,000 నుంచి 6,000 మీటర్ల లోతులో ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యాన్ని చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సాధించిందని కేంద్ర మంత్రి తెలిపారు. హై-రిజల్యూషన్ ద్వారా హైడ్రోథర్మల్ సల్ఫైడ్ నిక్షేపాలను అన్వేషించే 'ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరర్' గురించీ ఆయన ప్రస్తావించారు. వీటిలో ఇప్పటికే పలు నిక్షేపాలను గుర్తించినట్లు డాక్టర్ జితేంద్రసింగ్ వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండుసార్లు 'డీప్ ఓషన్ మిషన్' గురించి ప్రస్తావించడం... సముద్ర వనరులకు దేశంలో లభిస్తున్న అత్యున్నత స్థాయి ప్రాధాన్యతను, భారత భవిష్యత్తులో వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యాన్నీ ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
‘సముద్రయాన్' మిషన్ గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ... ముగ్గురు సముద్ర పరిశోధకులను (ఆక్వానాట్స్) సముద్రంలో 5,000 నుంచి 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేలా 'మత్స్య' జలంతర్గామిని రూపొందించినట్లు తెలిపారు. భారత తొలి మానవసహిత డీప్-సీ మిషన్ ద్వారా 2028 నాటికి 6,000 మీటర్ల లోతుకు చేరుకునే దిశగా దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు. ఇది స్వదేశీ డీప్-ఓషన్ అన్వేషణ కార్యక్రమ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
భారత మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ... ప్రస్తుతం డీప్-సీ అన్వేషణ, అంతరిక్ష పరిశోధనల అద్భుత సమ్మేళనం దిశగా దేశం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఒక భారతీయ పరిశోధకుడు సముద్ర గర్భంలో దాదాపు 6,000 మీటర్ల లోతుకు ప్రయాణిస్తుండగా, అదే సమయంలో మరో భారతీయుడు అంతరిక్షంలోకి పయనించాలనేది తమ దృక్పథమని డాక్టర్ జితేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఇది నానాటికీ మెరుగవుతున్న దేశ శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
భారత సముద్ర పరిశోధనకు అంతరిక్ష ఆధారిత సామర్థ్యాల మద్దతు అంతకంతకూ పెరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సముద్రపు రంగు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, గాలి దిశలను పరిశీలించడం ద్వారా సముద్ర సంబంధిత పరిశోధనలకు ప్రత్యేక ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సామర్థ్యాలు సముద్ర పరిశీలన పరిధిని విస్తరిస్తున్నాయనీ... పవన, సౌరశక్తితో సహా సముద్రాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరుల భవిష్యత్ అన్వేషణకూ ఇవి తోడ్పడగలవని కేంద్ర మంత్రి తెలిపారు.
సమగ్ర ప్రభుత్వ, సమగ్ర శాస్త్రీయ సమన్వయ విధానం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... భారత సముద్ర సంబంధిత కార్యక్రమాలకు వివిధ శాస్త్రీయ సంస్థలు, విభాగాలు అందించిన సహకారాన్ని కేంద్ర మంత్రి వివరించారు. భాభా అణు పరిశోధనా కేంద్రం సహకారంతో కల్పక్కంలో ఏర్పాటు చేసిన డీశాలినేషన్ ప్లాంట్, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ద్వారా అభివృద్ధి చేసిన లక్షద్వీప్‌లోని అల్ప ఉష్ణోగ్రత డీశాలినేషన్ సదుపాయం సహా... సముద్రపు నీటిని శుద్ధి చేయడంలో అణు సాంకేతికత పాత్రనూ ఆయన ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ... తీరప్రాంత, ద్వీప ప్రాంతాల్లో తాగునీటి కొరతను తీర్చడంతో పాటు దేశీయ అవసరాలను పరిష్కరించడానికి వివిధ శాస్త్రీయ రంగాలు, సాంకేతికతలు ఎలా కలిసి పనిచేయవచ్చో ఈ కార్యక్రమాలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు.
దేశాలు ఏర్పరుచుకున్న రాజకీయ సరిహద్దులకు అతీతతమైన సముద్రాలు... సముద్ర పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో అంతర్జాతీయ సహకారం అంతే కీలకమైనవని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సముద్ర కాలుష్యం, సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పుల వంటి సమస్యల ప్రభావం ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా అన్ని దేశాల పరిధిలోకి విస్తరిస్తుందనీ... అందుకే ప్రపంచ దేశాల ఉమ్మడి శాస్త్రీయ ప్రయత్నాలు అత్యంత ఆవశ్యకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనలు, పరిశోధనా సౌకర్యాలను పరస్పరం వినియోగించుకోవాలని... డేటా భాగస్వామ్యం ఆధారంగా అంతర్జాతీయ వ్యూహాలు, భాగస్వామ్యాలను కొనసాగించాలనీ కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. 'ఒకే సముద్రం, ఉమ్మడి పరిజ్ఞానం, సమాన శ్రేయస్సు' అనే సూత్రం భారత్ విధానానికి మూలమని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భిన్నమైన చరిత్రలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు ఈ సహకారాన్ని మరింత పటిష్ఠం చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయని డాక్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు.
ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కొన్ని కీలక ప్రాధాన్యాలను కేంద్ర మంత్రి వివరించారు. పరిశీలనపరమైన లోపాలను సరిచేయడం... తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ముందస్తు అంచనాలను మెరుగుపరచడం... తీరప్రాంతాలు, ద్వీపాల కోసం ప్రాంతీయ వాతావరణ సేవల భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం... బాధ్యతాయుతమైన, అందరికీ అందుబాటులో ఉండే సముద్ర సాంకేతికతలను ప్రోత్సహించడం... డీప్-ఓషన్ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం... సముద్ర వనరుల పరిరక్షణను, వాటి సమాన వినియోగాన్ని పటిష్ఠం చేయడం వంటివి ఈ ప్రాధాన్యాల్లోభాగంగా ఉన్నాయి.
పరిశోధన, ఆవిష్కరణల కోసం నిధులు సమకూర్చాల్సిన ప్రాధాన్యతను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో పరిశోధనలను వేగవంతం చేయడానికి, పరిశోధనాభివృద్ధి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడానికి 'అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' (ఏఎన్ఆర్ఎఫ్) ఏర్పాటును, రూ. 1 లక్ష కోట్ల రూపాయల భారీ 'పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల' (ఆర్డీఐ) నిధి ప్రకటననూ కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ ఆర్డీఐ నిధి ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాములకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా 50:50 ఈక్విటీ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది సరికొత్త పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ భాగస్వాములను, పెట్టుబడిదారులను ఎంతగానో ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సరికొత్త రంగాలను అభివృద్ధి చేయడానికి, భారత సాంకేతిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ విభాగాలు, శాస్త్రీయ సంస్థలు, ప్రైవేట్ భాగస్వాములు, పెట్టుబడిదారులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఉమ్మడిగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
'వికసిత్ భారత్ 2047' జాతీయ దార్శనికతతో సముద్ర అన్వేషణను ముడిపెడుతూ... దేశ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక విలువను పెంచే సరికొత్త వనరులను గుర్తించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనిలో అత్యధిక భాగం ఇంకా అన్వేషించని లేదా తక్కువగా అన్వేషించిన వనరుల్లోనే దాగి ఉందన్నారు. ఇందులో డీప్-ఓషన్ దేశానికి అతిపెద్ద అవకాశాన్ని అందిస్తోందని డాక్టర్ జితేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు.
సదస్సులో పాల్గొన్న వారితో జరిగిన సంభాషణల సందర్భంగా... అణుశక్తితో పనిచేసే నౌకల సామర్థ్యం, సముద్ర రవాణాలో హరిత ఇంధనం భవిష్యత్తుపై వ్యక్తమైన ప్రశ్నలకు డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. 'శాంతి' చట్టం కింద ఇటీవల అణుశక్తి రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించడం భారత్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 'డీప్-ఓషన్ మిషన్' ద్వారా సముద్రాల నుంచి సోలార్ ప్యానెళ్లు, సముద్రపు గాలులు, ఉష్ణోగ్రత, శక్తి ప్రవణతల ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వివిధ అవకాశాలనూ అన్వేషిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సముద్రాలకూ విస్తరించాలన్న సూచనపై స్పందిస్తూ... ప్రభుత్వం ఇప్పటికే వార్షిక సముద్ర పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల సందర్భంగా ఇది ప్రారంభమైందని గుర్తుచేస్తూ... అప్పటి నుంచే ఈ కార్యక్రమం తీరప్రాంత జిల్లా యంత్రాంగాలు, భారత నౌకాదళం, భారత తీరరక్షక దళం, స్వచ్ఛంద సంస్థలు, ఇతర భాగస్వాములను కలుపుకొని ఒక వార్షిక ప్రయత్నంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. సముద్ర కాలుష్య నివారణ ప్రయత్నాలు ఒక దేశానికే పరిమితం కాకూడదనీ... పరిశుభ్రమైన సముద్రాల కోసం చేసే ఈ ప్రయత్నాలు విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తాయని డాక్టర్ జితేంద్రసింగ్ స్పష్టం చేశారు.
ప్రపంచ సముద్ర రంగ పరిశోధన, అన్వేషణలో భారత్ పాత్రను బలోపేతం చేయడంలో... మెరుగవుతున్న స్వదేశీ సామర్థ్యాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా పంచుకోవడం వంటివి కీలకమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వికసిత్ భారత్ 2047 జాతీయ దార్శనికతకు దోహదపడుతూ... సముద్ర వనరులను శాంతియుతంగా, సుస్థిరంగా, సమానంగా వినియోగించుకునే దిశగా భాగస్వాములందరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
***