కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నెట్‌వర్క్ అనుభవ్ వేదికను ప్రారంభించిన భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్)

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 4:21PM by PIB Hyderabad

భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) నేడు ‘నెట్‌వర్క్‌ అనుభవ్‌ వేదిక’ను ప్రారంభించింది.  ఇది వినియోగదారులు నిర్వహించిన నెట్‌వర్క్‌ పరీక్షల డేటా, ట్రాయ్‌ స్వతంత్రంగా చేపట్టిన డ్రైవ్‌ టెస్ట్‌ డేటా కోసం రూపొందించిన భౌగోళిక సమాచార, విశ్లేషణాత్మక డ్యాష్‌బోర్డ్‌. ‘డీఎన్‌డీ’ వెబ్‌ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారుల పరీక్షల డేటాలో ట్రాయ్‌కు చెందిన మైస్పీడ్‌, మైకాల్‌ యాప్‌ల ద్వారా నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఉంటాయి. ఈ వేదిక ద్వారా వినియోగదారులు, సేవలందించే సంస్థలు, ట్రాయ్‌కు వివిధ నెట్‌వర్క్‌ పారామీటర్లపై విశ్లేషణాత్మక సమాచారం అందుబాటులోకి వస్తుంది.

భౌగోళిక సమాచార మ్యాప్‌ల ముఖ్య లక్షణాలు

భౌగోళిక సమాచార మ్యాప్‌ల ద్వారా వినియోగదారులు ఈ కింది సదుపాయాలను పొందవచ్చు.

1.      సెల్యులార్‌ లేదా ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌గా వర్గీకరించిన పరీక్షల ఫలితాలను వీక్షించవచ్చు. వాటిని సేవలందించే సంస్థలు, సాంకేతికతల వారీగా కూడా పరిశీలించవచ్చు. డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగాలు సహా వివిధ పారామీటర్ల ఆధారంగా ఫలితాలను తెలుసుకోవచ్చు.

2.      వినియోగదారులు స్వయంగా నిర్వహించిన నెట్‌వర్క్‌ పరీక్షల వివరాలు ఏయే ప్రాంతాల్లో నమోదయ్యాయి, వాటి పంపిణీ ఎలా ఉందో తెలుసుకునేందుకు మ్యాప్‌ను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ, జూమ్‌ చేసి పరిశీలించవచ్చు.

3.      ప్రదర్శించిన ఫలితాలను అర్థం చేసుకునేందుకు ఫిల్టర్లు, లెజెండ్లు, అనుబంధ పట్టికలు, డౌన్‌లోడ్‌ చేసుకునే నివేదికలను ఉపయోగించవచ్చు.

ఒక నిర్దిష్ట ప్రాంతంలో వినియోగదారులు నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఈ వేదిక పర్సెంటైల్‌ విలువలను అందిస్తుంది.

పీ50 (మధ్యస్థ వేగం): నమోదైన పరీక్షల్లో సగం పరీక్షల్లో ఈ విలువకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ వేగం నమోదైంది.

పీ80 (మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌): నమోదైన పరీక్షల్లో 80 శాతం పరీక్షల్లో ఈ విలువకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ వేగం నమోదైంది.

పీ90 (ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌): నమోదైన పరీక్షల్లో 90 శాతం పరీక్షల్లో ఈ విలువకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ వేగం నమోదైంది.

వినియోగదారులు నిర్వహించిన పరీక్షల ఆధారంగా లభించే ఈ గణాంకాలు, ప్రామాణిక పద్ధతిలో నెట్‌వర్క్‌ నాణ్యతను సమగ్రంగా అంచనా వేసిన ఫలితాలను సూచించవు. అయితే, వివిధ ప్రాంతాల్లో ఇతర వినియోగదారులకు ఎదురైన నెట్‌వర్క్‌ అనుభవం గురించి ఇవి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. వివిధ ప్రాంతాల్లో స్వతంత్రంగా నిర్వహించిన డ్రైవ్‌ టెస్ట్‌ల ఫలితాలను భౌగోళికంగా పరిశీలించేందుకు కూడా ఈ మ్యాప్‌లు వీలు కల్పిస్తాయి. ఈ డేటా సమాహారాలు, వాటి భౌగోళిక దృశ్యీకరణ ద్వారా ఇతర వినియోగదారుల నెట్‌వర్క్‌ అనుభవం, స్వతంత్ర డ్రైవ్‌ టెస్ట్‌ల ఫలితాలపై విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుంది.

వినియోగదారులకు సాధికారత

వినియోగదారులు స్పామ్‌ సందేశాలపై ఫిర్యాదు చేయడంతో పాటు ఇంటర్నెట్‌ వేగాన్ని పరీక్షించవచ్చు. ట్రాయ్‌ యాప్‌లు, వెబ్‌ ఇంటర్‌ఫేస్‌, స్వతంత్ర డ్రైవ్‌ టెస్ట్‌ల ద్వారా సేకరించిన సమగ్ర ఫలితాలు నెట్‌వర్క్‌ అనుభవ్‌ డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇతర వినియోగదారులు నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రాంతాల వారీగా వీక్షించవచ్చు.

టీఎస్‌పీలు, ట్రాయ్‌కు విశ్లేషణాత్మక సమాచారం

సురక్షిత ఇంటర్‌ఫేస్‌ ద్వారా టెలికాం సేవల సంస్థలు వినియోగదారులు నిర్వహించిన కాల్‌ నాణ్యత, నెట్‌వర్క్‌ కవరేజ్‌, ఇంటర్నెట్‌ పరీక్షలకు సంబంధించిన డేటాను వీక్షించవచ్చు. ప్రాంతం, తేదీ, సమయం, సాంకేతిక పారామీటర్ల విలువలతో కూడిన ఈ సమాచారాన్ని ఉపయోగించి, మరింత విశ్లేషణ అవసరమైన భౌగోళిక ప్రాంతాలను సంస్థలు గుర్తించవచ్చు. తద్వారా నెట్‌వర్క్‌ పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టవచ్చు.

వినియోగదారుల నెట్‌వర్క్‌ అనుభవాన్ని ఆధారాలతో పర్యవేక్షించేందుకు, నెట్‌వర్క్‌ పనితీరును మెరుగుపరిచేందుకు ట్రాయ్‌ ఈ సమగ్ర సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

మైస్పీడ్ ఎస్‌డీకే

ట్రాయ్‌ అందించే మైస్పీడ్‌ ఎస్‌డీకే ద్వారా అర్హత కలిగిన థర్డ్‌ పార్టీ యాప్‌లు కనెక్టివిటీని కొలిచే సదుపాయాలను తమ యాప్‌లలో అనుసంధానించుకోవచ్చు. ఈ అనుసంధానం విస్తృతమైతే, మరింత మంది వినియోగదారులు పాల్గొనే అవకాశం ఏర్పడటంతో పాటు, వాస్తవ పరిస్థితుల్లో నిర్వహించే నెట్‌వర్క్‌ పరీక్షల సంఖ్య పెరిగి, ఈ వేదికకు మరింత సమాచారం అందుతుంది.

డీఎన్‌డీ సేవలు

అనుభవ్‌ వేదిక ద్వారా ఇప్పుడు డీఎన్‌డీ సేవలను వెబ్ ఇంటర్‌ఫేస్‌ ద్వారా కూడా పొందవచ్చు. వాణిజ్య సమాచారాన్ని స్వీకరించడంపై తమ అభిరుచులను నమోదు చేయడం, అవాంఛిత వాణిజ్య సమాచారానికి సంబంధించిన ఫిర్యాదులను సమర్పించడం, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, మొత్తం ఫిర్యాదుల వివరాలను, సేవలందించే సంస్థల వారీగా ఫిర్యాదుల సమాచారాన్ని వీక్షించడం వంటి సదుపాయాలను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.

ఈ సందర్భంగా  ట్రాయ్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లహోటి మాట్లాడుతూ..

‘‘నెట్‌వర్క్‌ అనుభవ్‌ వేదిక ద్వారా వినియోగదారులు, ట్రాయ్‌ నిర్వహించిన నెట్‌వర్క్‌ పరీక్షల ఫలితాల్లో మరింత పారదర్శకత ఏర్పడుతుంది. ప్రాంతాల వారీగా, సేవలందించే సంస్థల వారీగా పరీక్షల ఫలితాలను విశ్లేషించుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా వినియోగదారులకు సాధికారత లభిస్తుంది. నెట్‌వర్క్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు టెలికాం సేవల సంస్థలకు ఇది దోహదపడుతుంది. నెట్‌వర్క్‌ మెరుగుదల కోసం ట్రాయ్‌ చేస్తున్న ప్రయత్నాలకు మరింత బలాన్నిస్తుంది’’ అని తెలిపారు.

ట్రాయ్‌ మైస్పీడ్‌, మైకాల్‌ యాప్‌ల ద్వారా వినియోగదారులు క్రమం తప్పకుండా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మరింత మంది పాల్గొంటే ఈ వేదికలోని సమాచారం పరిధి, వినియోగం పెరుగుతాయని పేర్కొన్నారు.

వేదికను సందర్శించేందుకు 

నెట్‌వర్క్‌ అనుభవ్‌ వేదిక: https://anubhav.trai.gov.in

మరిన్ని వివరాల కోసం ఐటీ సలహాదారు శ్రీమతి అర్చనా అహ్లావత్‌ను సంప్రదించవచ్చు..

ఈ-మెయిల్‌: advisorit@trai.gov.in

***


(రిలీజ్ ఐడి: 2332689) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada