నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 4:50PM by PIB Hyderabad
“మారుతున్న ప్రపంచంలో ఆహారం, దాణా, పశుగ్రాసం, ఇంధనం, సుస్థిరత కోసం మొక్కజొన్న విప్లవం” (ఎం4ఎఫ్ఎస్) అనే ఇతివృత్తంతో తొలి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు హైదరాబాద్‌లోని జేడీ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం ప్రారంభమైంది. మొక్కజొన్న పరిశోధన, ఉత్పాదకత, విలువ గొలుసు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వ్యూహాలపై చర్చించేందుకు శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, వ్యవసాయ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకొచ్చింది.

అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్లు, మెరుగైన పోషక నాణ్యత, వనరుల సమర్థ వినియోగం, యాంత్రీకరణ, పటిష్టమైన విత్తన వ్యవస్థలు, ఆహారం, దాణా, పశుగ్రాసం, ఇంధన భద్రతలో మొక్కజొన్నకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సదస్సు ప్రముఖంగా ప్రస్తావించింది.
సదస్సులో డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం. ఎల్. జాట్ ప్రసంగిస్తూ... గత దశాబ్దంలో దేశంలో మొక్కజొన్న ఉత్పాదకత గణనీయంగా పెరిగి, ఉత్పత్తి సుమారు 55 మిలియన్ టన్నులకు చేరిందని అన్నారు. ఈ మేరకు కృషి చేసిన మొక్కజొన్న పరిశోధకులను అభినందించారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన పంట నిర్వహణ, వనరుల సమర్థ వినియోగం ద్వారా ఉత్పాదకతను మరో 1.5 రెట్లు పెంచడంతోపాటు, రాబోయే దశాబ్దంలో ఉత్పత్తిని 75 మిలియన్ టన్నులకు పెంచాలని పిలుపునిచ్చారు.

ఆహారం, దాణా, పశుగ్రాసం, ఇంధనం అనే సంప్రదాయ 4ఎఫ్ దృక్పథాన్ని, రైతులను కేంద్రంగా చేర్చి 5ఎఫ్‌గా విస్తరించాలని డాక్టర్ జాట్ నొక్కిచెప్పారు. పరిశోధన, వ్యవసాయ విస్తరణ ఫలితాలు సాగు లాభదాయకతను పెంచి, జీవనోపాధులను మెరుగుపరచాలని అన్నారు. ముఖ్యంగా పంట నిర్వహణకు సంబంధించి ఏర్పడే దిగుబడి అంతరాలను తగ్గించేందుకు సిస్టమ్స్-సైన్స్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఇతర ముఖ్యమైన పంటలకు, ప్రత్యేకించి నూనెగింజలు, పప్పుధాన్యాలకు భంగం కలగకుండా వివిధ పంట కాలాలు, వ్యవసాయ పర్యావరణ మండలాల్లో మొక్కజొన్న సాగుపై వ్యూహాత్మకంగా దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ హైబ్రిడ్ విత్తనాలు, అందుబాటు ధరల్లో లభించేందుకు పటిష్టమైన విత్తన వ్యవస్థ అవసరమని కూడా స్పష్టం చేశారు.
ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్స్) డాక్టర్ డీ. కే. యాదవ్ మాట్లాడుతూ... ఆహార, పోషక, ఇంధన భద్రతకు మొక్కజొన్నను ముఖ్యమైన పంటగా అభివర్ణించారు. గత ఐదేళ్లలో 329 మొక్కజొన్న హైబ్రిడ్ల అభివృద్ధితో సహా పరిశోధన, వ్యవసాయ విస్తరణలో సాధించిన పురోగతిని గుర్తుచేశారు. ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ మేజ్‌ను (ఏఐసీఆర్పీ ఆన్ మేజ్) బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అధిక దిగుబడి, మెరుగైన పోషక నాణ్యత, జీవ, నిర్జీవ కారకాల ఒత్తిళ్లను తట్టుకునే గుణాలున్న రకాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలన్నారు. సాగు ఉత్పాదకాల సమర్థ వినియోగం, యాంత్రీకరణ, సామర్థ్యాల పెంపు, ప్రభుత్వ రంగ హైబ్రిడ్ విత్తనోత్పత్తిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇథనాల్‌కు ముడిపదార్థంగా మొక్కజొన్న సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సహకారం అవసరమని కూడా వివరించారు.
సీఐఎంఎంవైటీతో అనుబంధం ఉన్న ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త, ప్రపంచ ఆహార పురస్కార గ్రహీత పద్మశ్రీ డాక్టర్ ఎస్. వాసల్ మాట్లాడుతూ... రైతుల అవసరాలకు తగిన మెరుగైన రకాలు, హైబ్రిడ్లను వేగంగా అభివృద్ధి చేసేందుకు సరళమైన, తక్కువ ఖర్చుతో ఫలితాలనిచ్చే పద్ధతులను అనుసరించాలని సూచించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఏఆర్ఈ మాజీ కార్యకదర్శి, ఐసీఏఆర్ మాజీ డీజీ, పద్మభూషణ్ డాక్టర్ ఆర్. ఎస్. పరోడా మాట్లాడుతూ... వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా పరిశోధన ప్రాధాన్యాలను నిర్దేశించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అధునాతన రకాల అభివృద్ధి సాంకేతికతలను మరింతగా వినియోగించడం, జన్యు వనరులను క్రమబద్ధంగా సంరక్షించి ఉపయోగించడం, మొక్కజొన్న విలువ గొలుసులను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆహారం, దాణాకు ఉపయోగించే మొక్కజొన్న భద్రత, నాణ్యతకు భరోసా కల్పించేందుకు అఫ్లాటాక్సిన్‌ను సమర్థంగా నియంత్రించాలన్నారు.

అంతకుముందు మేజ్ టెక్నాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంటీఏఐ) అధ్యక్షుడు డాక్టర్ హెచ్. ఎస్. జాట్ ప్రముఖులకు స్వాగతం పలికి, భారత వ్యవసాయ పరివర్తనలో మొక్కజొన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని వివరించారు. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల మధ్య మరింత బలమైన సహకారం అవసరమని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పలు శాస్త్రీయ ప్రచురణలను విడుదల చేశారు. మొక్కజొన్న పరిశోధన, అభివృద్ధికి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు పురస్కారాలను అందజేశారు.
దిగుబడి అంతరాలను తగ్గించడం, విత్తనాల అందుబాటును మెరుగుపరచడం, రకాల అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం, పోషక నాణ్యతను పెంచడం, సుస్థిర మొక్కజొన్న విలువ గొలుసులను అభివృద్ధి చేసేందుకు సహకారంతో కూడిన రైతు కేంద్రిత పరిశోధన ప్రాధాన్యాన్ని సదస్సు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో 2026 నవంబర్ 2–4 తేదీల్లో జరుగుతున్న ఈ సదస్సు... భారత్‌లో ఉత్పాదకత, లాభదాయకత, సుస్థిరతతో కూడిన మొక్కజొన్న రంగానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులకు వేదికను అందిస్తోంది.
***