నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 10:19PM by PIB Hyderabad
ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు (ఈపీసీ) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దీనిలో ప్రస్తుతం ఎగుమతుల పరిస్థితిని సమీక్షించడంతో పాటు ప్రపంచ వాణిజ్యంలో నూతన అవకాశాలు, సవాళ్లు, భారతదేశ ఎగుమతుల పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సుంకాల విధానాల్లో మార్పులు, సరఫరా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణలు, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో నూతన నియంత్రణల కారణంగా ప్రపంచ వాణిజ్య రంగంలో వస్తున్న మార్పుల గురించి శ్రీ గోయల్ చర్చించారు. ఈ పరిస్థితుల కారణంగా ఎగుమతిదారులకు సవాళ్లు ఎదురవుతున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా విశ్వసనీయమైన, పోటీతత్వం ఉన్న అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామిగా తన పాత్రను బలోపేతం చేసుకొనే అవకాశాలను కూడా భారత్‌కు అందిస్తున్నాయి.
మారుతున్న అంతర్జాతీయ వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా భారత పరిశ్రమ చురుకుగా, స్పందించేదిగా ఉండాల్సిన అవసరాన్ని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థల్లో భారతదేశ భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం, ఆవిష్కరణలు, వ్యయ పోటీతత్వం, సరఫరా విశ్వసనీయత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడంపై దృష్టి సారించాలని ఎగుమతిదారులకు సూచించారు.
జర్మనీ, నెదర్లాండ్స్ పర్యటనలతో సహా ఇటీవలే తాను చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాల గురించి శ్రీ గోయల్ ప్రస్తావించారు. తయారీ, సరఫరా, పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌పై పెరుగుతున్న ఆసక్తి గురించి వివరించారు. వీటిని భారత పరిశ్రమ, విదేశీ వ్యాపార సంస్థల మధ్య సంప్రదింపుల ద్వారా స్పష్టమైన వ్యాపార ఫలితాలుగా మార్చాలన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపులు జరపాలని, కొనుగోలుదారులను గుర్తించాలని, ఇప్పటికే ఉన్న, నూతనంగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లలో వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని ఈపీసీలను ప్రోత్సహించారు.
భారతదేశం కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక భాగస్వామ్యాల ద్వారా లభిస్తున్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని కూడా మంత్రి వివరించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో మార్కెట్లలో లభించే ప్రాధాన్యం ద్వారా భారతదేశ ఎగుమతుల పెరుగుదలకు, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను మరింత విస్తృతం చేయడానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో భారతీయ సంస్థల భాగస్వామ్యం పెరగడానికి దోహదపడాలని ఆయన స్పష్టం చేశారు. భాగస్వామ్య దేశాల్లో ఎగుమతులకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు రంగాలవారీగా ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించాలని, అలాగే వాణిజ్య ప్రాధాన్యాలు, ప్రమాణాలు, మార్కెట్ అవసరాలపై ఎగుమతిదారుల్లో అవగాహనను మరింత పెంపొందించాలని ఈపీసీలను ప్రోత్సహించారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండు, సరఫరా వ్యవస్థల్లో నూతన అవకాశాలకు తగినట్లుగా ఉత్పత్తులను, విభిన్న రంగాల్లో మార్కెట్ అవకాశాలను విస్తరించే విధానం అవసరాన్ని శ్రీ గోయల్ వివరించారు. ఇప్పటి వరకు ఎగుమతులు చేయని ఉత్పత్తులను, కొత్త మార్కెట్ గమ్యస్థానాలను గుర్తించాలని, మార్కెట్ నిర్దేశిత వ్యూహాలను అభివృద్ధి చేయాలని ఈపీసీలను ప్రోత్సహించారు. ఇప్పటికే నిలదొక్కుకున్న రంగాల్లో పోటీ ప్రయోజనాలను మరింత బలోపేతం చేసుకుంటూనే, నూతన రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఎగుమతులను సులభతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, వాణిజ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఎగుమతి సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి చేపడుతున్న ప్రయత్నాల గురించి మంత్రి వివరించారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ఆర్థిక తోడ్పాటు, మార్కెట్ అవకాశాలు, అంతర్జాతీయ పోటీతత్వానికి సంబంధించిన పరిమితులను పరిష్కరించడానికి ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ఓ ముఖ్యమైన కార్యక్రమమని చెప్పారు.
భారతదేశ ఎగుమతులు రంగంలో ఎంఎస్ఎంఈల సహకారం గురించి శ్రీ గోయల్ వివరించారు. చిన్న తరహా సంస్థలు, అంకురసంస్థలు, కొత్త ఎగుమతిదారులు, వృద్ధి చెందుతున్న ఎగుమతి క్లస్టర్లు, జిల్లాల్లోని వ్యాపారాలకు తమ సేవలను విస్తరించాలని ఈపీసీలకు పిలుపునిచ్చారు. ఈ సంస్థలకు ఆచరణాత్మక చేయూతనివ్వడం, మార్కెట్ సమాచారాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, వీటిని అంతర్జాతీయ మార్కెట్లతో విస్తృతంగా అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎగుమతుల ప్రోత్సాహంలో డేటా ఆధారితమైన, ఫలితాలపై దృష్టి సారించే విధానాన్ని అనుసరించాలని ఈపీసీలను మంత్రి కోరారు. సరైన సమయంలో మార్కెట్ సమాచారాన్ని పొందడం, రంగాలవారీగా అవకాశాలను గుర్తించడం, అంతర్జాతీయ వాణిజ్య ధోరణులను గమనించడం, కార్యకలాపాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈపీసీలు, పారిశ్రామిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) క్షేత్రస్థాయి విభాగాల మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో వివిధ రంగాల వారీగా ఎదురవుతున్న అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు, ఎగుమతుల్లో పోటీ, మార్కెట్ అవకాశాలు, రవాణా సదుపాయాలు, నియంత్రణలు, వాణిజ్య సౌలభ్యం సమస్యల గురించి ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎగుమతిదారుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయి.
పారిశ్రామిక భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. భారతీయ ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడానికి, విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వామిగా దేశ ప్రతిష్టను మరింత పెంచడానికి ఉమ్మడి ప్రయత్నాలు కీలకమని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశ ఎగుమతుల పరిధిని విస్తరించడం, అంతర్జాతీయంగా వస్తున్న సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం, స్థిరమైన, సమగ్రమైన ఎగుమతుల వృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కలిసి పనిచేయాలనే ప్రభుత్వం, ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది.
***