నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2026 9:47PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరుగుతున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సదస్సు సన్నాహక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు. పెరుగుతున్న భారతదేశ వాణిజ్య భాగస్వామ్యాలను, విధాన స్థిరత్వాన్ని, పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డిని అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, పౌరుల సమష్టి కృషి ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయవచ్చన్నారు.
ప్రపంచ జీడీపీలో 70 ట్రిలియన్ డాలర్ల ప్రాధాన్య మార్కెట్‌కు అవకాశాలను ఇప్పటికే అమల్లో ఉన్న భారతదేశ వాణిజ్య ఒప్పందాలు అందిస్తున్నాయన్నారు. వాటిలో దశాబ్దం క్రితం ఖరారైన ఒప్పందాల ద్వారా 10 ట్రిలియన్ డాలర్లు, ఇటీవల కుదిరిన తొమ్మిది ఒప్పందాల ద్వారా అదనంగా లభించే 60 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాలు ఉన్నాయన్నారు. మరో ఎనిమిది ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా మరో 15 ట్రిలియన్ డాలర్లు సమకూరతాయని వెల్లడించారు. దీంతో 115 ట్రిలియన్ డాలర్ల ప్రపంచ జీడీపీలో సుమారు 76 శాతం మార్కెట్‌కు ప్రాధాన్య అవకాశాలు భారత్‌కు లభిస్తాయని తెలియజేశారు.
అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి కేవలం 1.9 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ఏడాది ఎగుమతుల్లో ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును, 15 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందన్నారు. అంచనాలను అధిగమించడంలో ఎగుమతిదారులు, పారిశ్రామిక సంఘాలు, వ్యాపార సంస్థల ఉమ్మడి లక్ష్యాన్ని ఈ లక్ష్యం ప్రతిబింబిస్తుందని తెలియజేశారు.
భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి శ్రీ గోయల్ వివరించారు. దశాబ్దం క్రితం ‘‘బలహీమైన అయిదు దేశాల’’ జాబితాలో ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని శ్రీ గోయల్ అన్నారు. గతేడాది సాధించిన 7.7 శాతం, ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించిన 7.8 శాతం వృద్ధి గురించి ప్రస్తావించారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో వృద్ధిరేటు 7శాతానికి పైగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును భారత్ ఆర్థిక వ్యవస్థ కనబరిచిందని ఇటీవలే ఐఎంఎఫ్ వెల్లడించిన అంచనాలను ఆయన ప్రస్తావించారు. అలాగే ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది కూడా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోందని తెలిపారు.
పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అవాంతరాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నాయని మంత్రి తెలియజేశారు. ఇలాంటి సవాళ్ల మధ్య కూడా భారతదేశం స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. గడచిన 35 ఏళ్లలో తొలిసారిగా భారత రేటింగును జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (జేసీఆర్) మెరుగుపరిచిందని తెలిపారు. ఇతర అంతర్జాతీయ రేటింగు సంస్థలు సైతం భారతదేశ క్రెడిట్ రేటింగును మెరుగుపరిచాయని ప్రస్తావించారు.
పెట్టుబడిదారులకు స్థిరమైన విధానాలను, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని, పటిష్ఠమైన సరఫరా వ్యవస్థలతో పాటు వారి ప్రయోజనాలకు చట్టబద్ధమైన పాలన నుంచి రక్షణ లభిస్తుందనే భరోసాను భారత్ అందిస్తోందని మంత్రి చెప్పారు. గడచిన నాలుగున్నరేళ్లలో తొమ్మిది స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలను లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను భారత్ విజయవంతంగా కుదుర్చుకుందని తెలిపారు. దీనివల్ల 38 అభివృద్ధి చెందిన దేశాల్లో భారతీయ వ్యాపారాలకు అనేక అవకాశాలు లభించాయని వెల్లడించారు. భారత పరిశ్రమలకు అవసరమైన అధునాతన పరికరాలు, ఆధునిక సాంకేతికతలు, హైటెక్ పరికరాలు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ), తదితర అనుబంధ సామర్థ్యాలు ఆ దేశాల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
తెలంగాణ చారిత్రక వాణిజ్య సంప్రదాయాల గురించి శ్రీ గోయల్ ప్రస్తావించారు. 1244లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు వేసిన మోటుపల్లి అభయ శాసనాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో వాణిజ్యంలో స్థిరత్వాన్ని, ముందస్తు అంచనాలను ఈ శాసనం ప్రోత్సహించిందన్నారు. దీనిని ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ, నేటి పెట్టుబడిదారులు కూడా విధానాల్లో స్పష్టతను, కొనసాగింపును కోరుకుంటున్నారని ఆయన వివరించారు.
వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించడంలో సమష్టి బాధ్యతకున్న ప్రాధాన్యాన్ని శ్రీ గోయల్ వివరించారు. ఈ దిశగా దేశం సాగించే ప్రయాణానికి 1.4 బిలియన్ల మంది భారతీయుల సమష్టి కృషి, శక్తి అవసరం అన్నారు. నిపుణులైన, అర్హతలు కలిగిన ఆ రాష్ట్ర యువతకు ఉన్న నిబద్ధత, సామర్థ్యాలు... వృద్ధి, అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో తెలంగాణకు తోడ్పడతాయని తెలిపారు.
2047 నాటికి 200 బిలియన్ డాలర్ల నుంచి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
‘‘నా డిక్షనరీలో అసాధ్యం అనే పదమే లేదు’’ అని శ్రీ గోయల్ అన్నారు. లక్ష్యసాధనకు గణనీయమైన రీతిలో సామూహిక కృషి అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, రైతులు, మత్స్యకారులు, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, అంకురసంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, అధికారులు అందరూ తమ వంతు సహకారం అందించాలన్నారు.
ఫార్మాసూటికల్ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ సామర్థ్యాలు, విలువ ఆధారిత వ్యవసాయం, ఆహార శుద్ధి, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ, సేవా రంగాల ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనకు తెలంగాణ తగినంత తోడ్పాటు అందిస్తుందని శ్రీ గోయల్ తెలియజేశారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, రూపకల్పన, ఆవిష్కరణలు అందించే అవకాశాల గురించి వివరించారు. కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్‌లో రాష్ట్రానికి ఉన్న ప్రతిభ కూడా అవకాశాలను అందిస్తుందని తెలియజేశారు.
ఆర్థికాభివృద్ధికి అందించే ప్రతి సహకారమూ ముఖ్యమైనదేనని మంత్రి తెలియజేశారు. భారత్-ఆస్ట్రేలియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఉపయోగించుకుని హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు 2.5 మెట్రిక్ టన్నుల జీఐ-ట్యాగ్ ఉన్న తాండూరు కందిపప్పును ఎగుమతి చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వాణిజ్య ఒప్పందాలు కేవలం పెద్ద పరిశ్రమలకే కాకుండా రైతులకు, చిన్న ఉత్పత్తిదారులకు కూడా ఎలా అవకాశాలను కల్పించగలవో ఈ ఎగుమతులు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం చిన్నదైనా, పెద్దదైనా ప్రతిదీ ఎంతో కీలకమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లడంలో రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, ఇతర భాగస్వాములు పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రారంభించిన లేదా తోడ్పాటు అందిస్తున్న ప్రాజెక్టులను వెల్లడించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి చేసిన శంకుస్థాపనను ప్రస్తావించారు. ఇది ఆటోమొబైల్స్, ఆహార శుద్ధి, యంత్రాలు, విద్యుత్ సామగ్రి రంగాల్లో వినియోగానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక సౌకర్యాలను అందిస్తుందన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును దేశంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తొలి పీఎం మిత్ర పార్కుగా వర్ణించారు. ఇది ‘‘ఫార్మ్ నుంచి ఫైబర్‌కు, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్‌కు, ఫ్యాషన్ నుంచి ఫారిన్‌కు’’ అన్న 5ఎఫ్ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సమన్వయానికి శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగానే తెలంగాణ–2047 లక్ష్యం ఉందన్నారు.
శ్రీ గోయల్ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆరు సూచనలు చేశారు. వస్తు, సేవల రంగాల్లో ఎగమతుల కోసం 50 ప్రధాన ఉత్పత్తులను, ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్‌టీఏ ద్వారా ప్రాధాన్య అవకాశాలను అందించే మార్కెట్లను గుర్తించాలని తెలంగాణకు ప్రతిపాదించారు. ఈ ఒప్పందాల ద్వారా లబ్ధి పొందేలా ఎంఎస్ఎంఈలు, రైతులు, అంకురసంస్థల కోసం ప్రతి జిల్లాలోనూ ఎఫ్‌టీఏ హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేయాలని సూచించారు.
తాండూరు ఎర్ర కందులు, మిర్చి, నిజామాబాద్ పసుపు లాంటి జీఐ–ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు చేర్చాలన్నారు. రైతులు సాధించిన దిగుబడికి సరైన ధరను అందించడానికి ఉత్పత్తి మూలాల గుర్తింపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ అవసరమని స్పష్టం చేశారు.
కీలకమైన ముడి పదార్థాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంపొందించడం, ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణ ఔషధ పరిశ్రమను విలువ ఆధారిత వ్యవస్థలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని శ్రీ గోయల్ సూచించారు. జనరిక్ ఔషధాల పరిధిని దాటి అధిక విలువ ఉన్న బ్రాండెడ్, ఆవిష్కరణాత్మక ఉత్పత్తులు, బయోసిమిలర్లు, బయోటెక్నాలజీపై దృష్టి సారించాలన్నారు.
అంతరిక్షం, ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు, నిర్వహణ–మరమ్మతు–సమగ్ర తనిఖీ (ఎంఆర్వో), రక్షణ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో అవకాశాలను గుర్తించాలన్నారు. కచ్చితమైన ఇంజినీరింగ్, టూలింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని, అధునాతన టెస్టింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సైన్స్, టెక్నాలజీ, తయారీ రంగంలో ప్రపంచంలోనే అగ్ర సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యాలను బలోపేతం చేయడంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వం మధ్య దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా భవిష్యత్తులో పారిశ్రామిక, సాంకేతిక అవసరాలకు తగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయవచ్చన్నారు.
చిన్నచిన్న ఉల్లంఘనలను నేరరహితం చేయడం, నిబంధనల భారాన్ని తగ్గించడం, ప్రక్రియలను సరళీకరించడం, నిర్ణీత గడువులోగా సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వడం ద్వారా వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే సంస్కరణలను వేగవంతం చేయాలని శ్రీ గోయల్ సూచించారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల గురించి వివరించారు. వ్యాపార కార్యకలాపాలతో పాటు పౌరుల జీవనాన్ని సులభతరం చేసి రాష్ట్రంలో జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఇలాంటి చర్యలు చేపట్టే అంశాన్ని తెలంగాణ పరిశీలించాలని కోరారు.
తన ప్రసంగం చివరిలో దీపావళి అందించే సందేశాన్ని వివరించారు. ఒక్కొక్క దీపం నుంచి వెలుగు విస్తరిస్తుందన్నారు. అలాగే ప్రతి పెట్టుబడి, ఎగుమతి, కొత్త ఉద్యోగం, అంకుర సంస్థ తెలంగాణను, మొత్తం దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఉమ్మడి లక్ష్యానికి మరింత చేరువ చేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించి, పెట్టుబడులు పెట్టాలని దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, తెలంగాణతో పాటు దేశ ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
***