యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్నికలపై అవగాహన పెంపొందించడానికి 14 రాష్ట్రాలు/ యూటీల్లో ‘వికసిత్ భారత్ యువ సంవాద్: నో యువర్ వోట్’ కార్యక్రమాన్ని నిర్వహించిన మై భారత్


ప్రజాస్వామ్య విలువలను నిలబెడతామని, పౌర భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ చేసిన యువత

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 10:20PM by PIB Hyderabad

ఈ రోజు వికసిత్ భారత్ యువ సంవాద్: నో యువర్ వోట్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం పరిధిలోని మేరా యువ భారత్ (మై భారత్) నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై అవగాహనను పెంపొందించడానికి, సమాచారంతో కూడిన, బాధ్యతాయుతమైన యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రచారంలో భాగంగా 10 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటు హక్కులు, పౌర బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై చర్చించడానికి విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, యూత్ ఐకాన్లు, ప్రముఖ క్రీడాకారులు, సంస్థల అధిపతులను ఈ కార్యక్రమాలు ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి.


 

26.10.2026 నుంచి 05.11.2026 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 500 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, సంస్థల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో నేరుగా సంభాషించే, వికసిత్ భారత్‌–2047 దిశగా సాగే ప్రయాణంలో ప్రజాభాగస్వామ్యంపై తమ ఆలోచనలను పంచుకొనే వేదికను తొలిసారి ఓటు వేస్తున్న వారితో సహా యువతకు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. అక్టోబర్ 28 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 27 యువ సంవాద్ కార్యక్రమాలను నిర్వహించారు. వీటిలో 5,856 మంది యువత పాల్గొన్నారు.

ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, గురుగ్రామ్, పంచకుల, రాజౌరీ, జజ్జర్‌లో ఉన్న విద్యాసంస్థల్లో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు, క్రీడాకారులు శ్రీ అర్జున్ సింగ్ నాగ్రా, శ్రీ అజిత్ యాదవ్ హాజరయ్యారు. పంచకుల, సుందర్బనిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత పాల్గొన్నారు.


 

మధ్య భారతంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన కార్యక్రమాలు ఎన్నికల అవగాహన, యువజన నాయకత్వం, బాధ్యతాయుతమైన పౌరసత్వంపై దృష్టి సారించాయి. షియోపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులతో పార్లమెంట్ సభ్యులు శ్రీ శివమంగళ్ సింగ్ తోమర్ సంభాషించారు. రాయ్‌గఢ్‌లో లోక్‌సభ ఎంపీ శ్రీ రాధేశ్యామ్ రాథియా, మై భారత్ జాయింట్ డైరెక్టర్ శ్రీ రమణ్ పటేల్ సమక్షంలో ఈ చర్చతో పాటు నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటును కూడా నిర్వహించారు.

తూర్పు భారతంలో ఫన్సిదేవాలో మై భారత్ డార్జిలింగ్ ఆధ్వర్యంలో యువ సంవాద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ) పై ప్రెజెంటేషన్, నో యువర్ వోట్‌పై చర్చలు, ఓటరు అవగాహన ప్రతిజ్ఞ, ప్రజాస్వామ్య విలువల పట్ల పౌరుల నిబద్ధతను చాటే సిగ్నేచర్ వాల్ ఉన్నాయి. ఇవే కాకుండా బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. 


 

ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో యూత్ ఐకాన్ పోర్బిందర్ కౌర్, కామన్వెల్త్, దక్షిణాసియా కరాటే స్వర్ణ పతక విజేతా జానీ మాంగ్‌ఖియా పాల్గొన్నారు.

దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు, యూత్ ఐకాన్లు, క్రీడాకారులు, ప్రముఖులు పాల్గొన్నారు.  ఎన్నికల ప్రక్రియలు, పౌర బాధ్యతలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యంపై చర్చించారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటామని హాజరైన వారందరితో ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ చేయించడంతో ఈ కార్యక్రమాలు ముగిశాయి. ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మైగవ్ భాగస్వామ్యంతో మై భారత్ నిర్వహిస్తున్న నో యువర్ వోట్ ఆన్‌లైన్ క్విజ్ పోటీల గురించి కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమం జరిగిన వేదికల వద్దే మై భారత్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడంతో పాటు, క్యూఆర్ కోడ్ ఆధారిత సజెషన్ బాక్సుల ద్వారా అభిప్రాయాలను సేకరించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2329927) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी