నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 9:10PM by PIB Hyderabad
క్రియాశీల పాలన, సకాలంలో అమలును ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐసీటీ ఆధారిత బహుళ-విధాన వేదిక 'ప్రగతి’ 54వ సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సేవా తీర్థ్‌లో జరిగింది. పథకాల అమలులో అడ్డంకులను పరిష్కరించడానికి... ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పంపిణీని మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ వేదిక ఏకతాటిపైకి తెస్తుంది.
31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ. 16 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే, ఏక్తా మాల్స్, డ్రగ్ పార్క్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని ఈ సమావేశంలో ప్రధానమంత్రి సమీక్షించారు. ఆర్థిక వృద్ధికి, ప్రజా సంక్షేమానికి కీలకమైన ఈ ప్రాజెక్టుల కాలపరిమితులు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, సమస్యల సకాల పరిష్కారంపై దృష్టి సారిస్తూ శ్రీ మోదీ సమీక్ష నిర్వహించారు.
పీఎం ఏక్తా మాల్స్‌లో స్థానిక ఉత్పత్తులకు మార్కెట్లను కల్పించాలని... చేతివృత్తుల వారి జీవనోపాధిని బలోపేతం చేయాలని... వారి వ్యాపారాల విస్తరణలో సహాయం అందించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పెరిగిన డిమాండ్... గ్రామీణ ఉత్పత్తి, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా రంగాల్లో ఉపాధిని సృష్టించగలదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ మాల్స్‌ను పర్యాటకం, స్థానిక వ్యాపారాలతో అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శులు వీటి పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలనీ, మాల్స్ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని బల్క్ డ్రగ్ పార్కుల పురోగతిని సమీక్షిస్తూ... ఈ రంగంలో స్వయం-సమృద్ధి సాధన లక్ష్యంగా క్రియాశీల ఔషధ పదార్థాలు, అవసరమైన ముడి సరుకుల దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
పథకాల అమలులో లోపాలను సరిదిద్దడానికి... అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు సకాలంలో అందేలా చూడటానికి ప్రధాన కార్యదర్శులు ప్రతి నెలా జిల్లా మేజిస్ట్రేట్లతో కలిసి పథకాలను సమీక్షించాలని ప్రధానమంత్రి కోరారు. కేటాయింపుల కంటే ఫలితాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజా వ్యయం ప్రజల జీవితాల్లో స్పష్టమైన మెరుగుదలగా పరిణమించేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఆకాంక్షాత్మక జిల్లాలు, ఆకాంక్షాత్మక మండలాల కార్యక్రమాలను ప్రస్తావిస్తూ... వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతంలో సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, స్థానిక జవాబుదారీతనం పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పరిపాలన బలోపేతం, సంక్షేమ పథకాల పంపిణీని మెరుగుపరచడం కోసం తమ ప్రభుత్వం కొనసాగిస్తున్న నిరంతర ప్రయత్నాల కారణంగానే దాదాపు 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడగలిగారని శ్రీ మోదీ తెలిపారు.
అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై సమీక్ష సందర్భంగా... ప్రయాణికుల సౌకర్యం, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పునరాభివృద్ధి చేసిన స్టేషన్లను మెట్రో, ఇతర రవాణా వ్యవస్థలతో నిరంతర అనుసంధానం ద్వారా బహుళ రవాణా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
అమలులో ఎదురయ్యే అడ్డంకులను మిషన్ మోడ్‌లో పరిష్కరించాలని ప్రధానమంత్రి సూచించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలనీ, అత్యున్నత స్థాయిలో నిశిత పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. ప్రతి స్థాయిలోనూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, చురుకైన పని సంస్కృతిని కొనసాగించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. అమలులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేయడం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి స్పష్టమైన జవాబుదారీతనాన్ని నిర్ధారించడం వంటి వాటి ఆవశ్యకతనూ ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
***