నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 4:47PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన భూములు, ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియకు సంబంధించి 2026 అక్టోబర్ 26న సవరణ-6, అక్టోబర్ 28న సవరణ-7లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ)జారీ చేసింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు 35 ప్లాట్ల విక్రయంపై నిషేధం ఉన్నందున, వాటిని వేలం ప్రక్రియ నుంచి ఉపసంహరించినట్లు ఎన్‌ఎల్‌ఎంసీ సవరణ-6లో ఎన్ఎల్ఎంసీ పేర్కొంది. 2026 ఆగస్టు 31న జారీ చేసిన ప్రతిపాదనల ఆహ్వాన పత్రం (ఆర్ఈపీ) ప్రకారం ఈ ప్లాట్లను విక్రయానికి ఉంచడం లేదు. తొలగించిన ప్లాట్ల వివరాలను ఈ సవరణకు జత చేసిన షెడ్యూల్‌లో పొందుపరిచారు.
సవరణ-7 ద్వారా వేలం షెడ్యూల్‌ను ఎన్ఎల్ఎంసీ సవరించింది. వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) సమర్పించేందుకు గడువును 2026 నవంబర్ 1వ తేదీ రాత్రి 8 గంటల వరకు పొడిగించింది. మిగతా అందుబాటులో ఉన్న ప్లాట్లకు నవంబర్ 3వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ-వేలం నిర్వహించనున్నారు.
ముందుగా అనుమతి తీసుకుంటే సంబంధిత స్థలాలను పరిశీలించేందుకు అవకాశం కొనసాగుతుంది. వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన బిడ్డర్లకు అంగీకార పత్రం (ఎల్ఓఏ) జారీ చేస్తారు.
సంబంధిత ఆస్తుల యాజమాన్య సంస్థల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు), ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు భూములు, ప్రధాన కార్యకలాపాలకు సంబంధం లేని ఇతర ఆస్తుల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రక్రియను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) సులభతరం చేస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్ స్థలాల ఈ-వేలం ప్రక్రియ ద్వారా ఆసక్తి కలిగిన బిడ్డర్లు అందుబాటులో ఉన్న ప్లాట్లను పారదర్శకంగా, పోటీతత్వంతో ఆన్‌లైన్ వేలంలో దక్కించుకునే అవకాశం లభిస్తుంది.
వేలంలో పాల్గొనాలనుకునే వారు వేలం నుంచి ఉపసంహరించిన ప్లాట్ల వివరాలతో కూడిన షెడ్యూల్‌తో సహా సవరణ-6ను జాగ్రత్తగా పరిశీలించాలని ఎన్‌ఎల్‌ఎంసీ సూచించింది. సవరించిన వేలం తేదీలు, గడువులను తెలిపే సవరణ-7ను కూడా పరిశీలించాలని తెలిపింది. మిగిలిన ప్లాట్ల వేలంలో పాల్గొనాలనుకునే బిడ్డర్లు సవరించిన గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన ఈఎండీని చెల్లించాలని కోరింది. పై సవరణల్లో ప్రత్యేకంగా మార్పులు చేసిన అంశాలు మినహా, వాస్తవ ప్రతిపాదనల ఆహ్వాన పత్రం (ఆర్ఎఫ్‌పీ), తదుపరి సవరణల్లో పేర్కొన్న మిగిలిన నిబంధనలు, షరతులన్నీ యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.
వేలానికి సంబంధించిన సవరణ పత్రాలు ఎన్‌ఎల్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://nlmc.dpe.gov.in/homepage/homepage.php
వేలానికి సంబంధించిన పత్రాలు, తాజా సమాచారం అధికారిక ఈ-వేలం వేదికలో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ-వేలం వేదిక: https://eauction.enivida.com/
ఎన్‌ఎల్‌ఎంసీ గురించి
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ).. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఆధ్వర్యంలో పనిచేసే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు), ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములు, భవనాల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రక్రియను ఈ సంస్థ సులభతరం చేస్తుంది. తద్వారా ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది.
***