నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 4:05PM by PIB Hyderabad
‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6’లో భాగంగా వీధి నాటికను మహానది కోల్ ఫీల్డ్స్ (ఎమ్సీఎల్) ప్రధానకేంద్రంలో నిర్వహించారు. బొగ్గు శాఖ ఆధీనంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థయే ఎమ్సీఎల్. ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) తొలగింపు, ఈ-వేస్ట్ సమస్యను బాధ్యతాయుత పద్ధతుల్లో పరిష్కరించడం, ఇతర పర్యావరణ అంశాలపై చైతన్యాన్ని పెంపొందింపచేసే ఉద్దేశంతో వీధినాటికను నిర్వహించారు.
కార్యక్రమంలో జీఎమ్ (సివిల్/డబ్ల్యూఈఎల్- టీఏ & సీఎస్ఆర్), విభాగాల అధిపతులు, అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పని ప్రదేశంలో శుభ్రతకు, అలాగే సుస్థిర భవితకు తోడ్పాటును అందించాల్సిందిగా మానవ వనరుల విభాగం డైరెక్టర్ శ్రీమతి రేఖా పాండే ఉద్యోగులకు సూచనలు చేశారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, వేరుపరచడం, శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా పర్యావరణం విషయంలో బాధ్యతతో నడుచుకొనే పద్ధతులకు ప్రాధాన్యాన్నివ్వాలనే సందేశాన్ని వీధి నాటికతో కళ్లకు కట్టారు. ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గించుకోవడం, పునర్వినియోగం, ఉపయోగించడం మానివేసిన విద్యుత్తు పరికరాలు, ఎలక్ట్రానిక్ సామగ్రిని అధీకృత ఈ-వేస్ట్ సేకరణ/రీసైక్లింగ్ వ్యవస్థల సాయంతో వదిలించుకోవలసిన అవసరం ఉందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
ఈ నెల 2 మొదలు 31 వరకు పాటిస్తున్న ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6’ స్ఫూర్తికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది. మరీ ముఖ్యంగా ఈ-వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. అంతేకాకుండా, పర్యావరణ స్పృహను పెంపొందింప చేయడం, పని ప్రదేశాల్లో నిలకడతనంతో కూడిన పరిశుభ్రత సంబంధిత పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణ కార్య్రమాల్లో అంతా కలిసికట్టుగా పాలుపంచుకొనేటట్లు చూడటం కూడా ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6’ ప్రధానోద్దేశాలుగా ఉన్నాయని చాటారు.
ఈ విధమైన చైతన్య ప్రబోధక కార్యక్రమాల ద్వారా వ్యర్థాల నిర్వహణకు సక్రమ పద్ధతులను అనుసరించేటట్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రాబోయే కాలంలో పచ్చదనానికి ప్రాధాన్యాన్ని ఇచ్చే దృక్పథాన్ని అనుసరించేటట్లు ఎమ్సీఎల్ తన ఉద్యోగులను నిరంతరాయంగా ప్రోత్సహిస్తూవస్తోంది.
***