యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రీడా దౌత్యాన్ని, యువజనాభివృద్ధిని ముందుకు తీసుకుపోవడంలో భారత్-న్యూజిలాండ్ రగ్బీ సిరీస్ పాత్రను ప్రస్తావించిన కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్‌సే

బీహార్.. రాజ్‌గీర్‌లో చరిత్రాత్మక యూ20 సిరీస్..
క్రీడా సంబంధాలకు 100 సంవత్సరాలు ఘట్టానికి సూచిక ఇది..
అంతర్జాతీయ పోటీ, సాంస్కృతిక మార్పిడి ద్వారా యువ క్రీడాకారులను ఒక చోట సమావేశపరిచిన సిరీస్

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 8:15PM by PIB Hyderabad

‘భారత్-న్యూజిలాండ్ యూ20 రగ్బీ సిరీస్’కు ఉన్న ప్రాధాన్యాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్‌సే వివరించారు.  క్రీడా దౌత్యాన్ని బలోపేతం చేయడం, యువ క్రీడాకారులకు అంతర్జాతీయ అనుభవాన్ని అందించడం, క్రీడాభివృద్ధిలో సహకారాన్ని పెంపొందింప చేయడంలో ఈ సిరీస్కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ‘క్రీడా మాధ్యమం ద్వారా ఏకతకు 100 సంవత్సరాలు’ కార్యక్రమంలో భాగంగా, బీహార్‌లోని రాజ్‌గీర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఈ సిరీస్ భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలు ఏర్పడి  శతాబ్ద కాలం పూర్తి అయిన సందర్భానికి ప్రతీకగా నిలిచింది.
‘క్రీడా మాధ్యమం ద్వారా ఏకతకు 100 సంవత్సరాలు’ కార్యక్రమంలో భాగంగా, బీహార్‌లోని రాజ్‌గీర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నేడు చరిత్రాత్మక ‘భారత్-న్యూజిలాండ్ యూ20 రగ్బీ సిరీస్’ ముగింపు ఘట్టం ఆవిష్కృతమైంది. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాల్లో ఒక కీలక విజయ ఘట్టానికి ఈ కార్యక్రమం ఓ ప్రతీకగా నిలిచింది.


 

ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌధరీ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్‌సే, బీహార్ ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రేయసీ సింగ్, భారత్‌లో న్యూజిలాండ్ తాత్కాలిక హై కమిషనరు శ్రీ మ్యాట్ ఆయర్స్, బీహార్ రగ్బీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీహార్ విధాన మండలి సభ్యుడు శ్రీ సంజయ్ మయూఖ్‌తో పాటు రగ్బీ ఇండియా అధ్యక్షుడు శ్రీ రాహుల్ బోస్ పాల్గొన్నారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలకు 100 సంవత్సరాలు
‘క్రీడా మాధ్యమం ద్వారా ఏకతకు 100 సంవత్సరాలు’ కార్యక్రమంలో భాగంగా ఈ సిరీస్‌ను నిర్వహించారు. క్రీడలు భారత అంతర్జాతీయ సంబంధాలతో పాటు సాంస్కృతిక అనుబంధాన్ని బలపరచడంలో ఎలా కీలక పాత్రను పోషించగలవో  ఈ కార్యక్రమం చాటింది. భారత్, న్యూజిలాండ్ యువ క్రీడాకారులను ఒక చోటుకు తీసుకు వచ్చి, ఆటల తాలూకు ‘సాఫ్ట్ పవర్’ ఒక సాధికార మాధ్యమం రూపంలో ఎలా పని చేస్తుందో ఈ కార్యక్రమం రుజువు చేసింది. రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనను, మైత్రిని, దీర్ఘకాలిక సహకారాన్ని ఆటలు పెంపొందింపచేస్తాయి.
భారత్-న్యూజిలాండ్ యూ20 రగ్బీ సిరీస్ రూపంలో
యువ అథ్లెట్లకు అందుబాటులోకి వచ్చిన వేదిక
 
భారత్-న్యూజిలాండ్‌ల యూ20 పురుషులు, మహిళల జట్లను ఒక చోటుకు తీసుకువచ్చిన ఈ సిరీస్.. రగ్బీ ద్వారా పరస్పరం నేర్చుకొనేందుకు, సాంస్కృతిక ఆదాన, ప్రదానాల రూపంలో అనుసంధానమయ్యేందుకు యువ క్రీడాకారులకు ఓ అవకాశాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంయుక్త శిక్షణ సమావేశాలు, సాంస్కృతిక చర్చలు, నాలుగు అత్యంత పోటీతత్వమున్న ‘రగ్బీ సెవెన్స్’ మ్యాచులను నిర్వహించారు. వీటిలో చరిత్రలో మొదటి సారి రెండు ‘మిక్స్‌డ్-టీమ్’ మ్యాచులను కూడా నిర్వహించారు. వీటిలో రెండు దేశాలకు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారులు కలిసి ఆడారు. దీంతో ఎంతో అద్భుతమైన, రోమాంచితమైన రగ్బీని చూసే అవకాశం లభించింది. క్రీడలు ఏ రకంగా సరిహద్దులను చెరిపివేయగలవనే దానికి దీని కన్నా మెరుగైన ఉదాహరణ మరేదీ ఉండబోదు.కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్‌సే మాట్లాడుతూ,‘‘గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత్ క్రీడల మాధ్యమం ద్వారా తన అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని నిరంతరాయంగా పటిష్టపరుచుకొంటోంది. క్రీడలను ‘సాఫ్ట్ పవర్’ స్థాయికి మించి ఒక సాధికార మాధ్యమంగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. క్రీడలు సరిహద్దులను ఏ విధంగా అధిగమించి పరస్పర అవగాహనను పెంపొందింపచేయగలవో, ఏకత, మైత్రీ భావనల ద్వారా వివిధ దేశాలను సంధానించగలవనే దానికి భారత్-న్యూజిలాండ్ యూ20 రగ్బీ సిరీస్ చాలా చక్కనైన ఉదాహరణ. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య క్రీడా సంబంధాలకు 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఆటల్లో భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలను ఎలా బలోపేతం చేయగలుగుతుందో, సాంస్కృతిక చర్చను ప్రోత్సహించగలుగుతుందో, వేరు వేరు దేశాల యువత నడుమ చిరకాలిక సంబంధాలను ఏర్పరచగలుగుతుందో రుజువవుతోంది’’ అన్నారు.



బీహార్ ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రేయసీ సింగ్ మాట్లాడుతూ, ‘‘గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, గౌరవ బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌధరీ మార్గదర్శకత్వంలో క్రీడల విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడానికి, యువ అథ్లెట్లకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి బీహార్ కట్టుబడి ఉంది. ఈ ప్రత్యేక భారత్-న్యూజిలాండ్ రగ్బీ ఎక్స్‌చేంజ్‌కు ఆతిథ్యాన్నివ్వడం బీహార్‌కు గర్వకారణంగా ఉంది. ఆటలు ప్రజలను, సంస్కృతులను సన్నిహితం చేస్తాయి. ఈ సిరీస్ రెండు దేశాల యువ క్రీడాకారులకు వారి అనుభవాలను పరస్పరం పంచుకొనేందుకు, ఒకరి నుంచి మరొకరు విషయాలను నేర్చుకొనేందుకు, చిరకాలిక అనుబంధాలను ఏర్పరుచుకొనేందుకు అవకాశాలను ఇస్తుంది. దీంతో అంతర్జాతీయ క్రీడా సహకారం, సాంస్కృతిక అవగాహన ఇప్పటి కన్నా బలపడుతుంది’’ అన్నారు. రగ్బీ ఇండియా అధ్యక్షుడు శ్రీ రాహుల్ బోస్ మాట్లాడుతూ, ‘‘భారత్-న్యూజిలాండ్ యూ20 రగ్బీ సిరీస్ ఒక ఆటకు మించిన శక్తి కలది. మన దేశాల మధ్య క్రీడా సంబంధాలకు 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ యువ క్రీడాకారులను ఒక చోటుకు చేర్చడం రగ్బీకి ఉన్న గౌరవం, జట్టుస్ఫూర్తి, స్నేహం అనే విలువల ప్రత్యేకతను చాటిచెబుతున్నది. ఈ మార్పిడిలో చాలా ప్రధానమైన అంశం కూడా ఉంది. అదే.. ‘మిక్స్‌డ్ టీముల’ మధ్య జరిగిన ఆటలు. వీటిలో భారత్, న్యూజిలాండ్ క్రీడాకారులు ఒకరితో మరొకరు జతపడి, జట్టు సహచరులుగా రూపొంది ఆటలలో పాల్గొన్నారు. రాజ్‌గీర్‌లో ఏర్పడిన ఈ అనుబంధం ఇక మీదట కూడా కొనసాగుతుందని, రగ్బీ ఇండియాకు, న్యూజిలాండ్ రగ్బీకి మధ్య సహకారం భవిష్యత్తులోనూ కొనసాగేందుకు ఒక బలమైన ఆధారాన్ని నెలకొల్పుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.
న్యూజిలాండ్ నుంచి వచ్చిన ప్రతినిధి వర్గంలో యూ20 పురుషుల జట్టు ‘తామ్ తోవా’తో పాటు, యూ20 మహిళల జట్టు ‘హినే తోవా’ కూడా ఉంది. ఈ రెండు జట్లలో 24 మంది యువ మావోరీ క్రీడాకారులు ఉన్నారు. వారి పర్యటన  భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకొనే, అవగాహనను ఏర్పరుచుకొనే అవకాశాన్ని క్రీడాకారులకు అందించింది. దీంతోపాటు, తమ సంప్రదాయాలను, దృష్టికోణాలను భారతీయ సహచరులతో కలిసి పంచుకొనే అవకాశాన్ని కూడా అందించింది.



రగ్బీ అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారం బలోపేతం

ఈ సిరీస్ రగ్బీ ఇండియా, న్యూజిలాండ్ రగ్బీల మధ్య వృద్ధి చెందుతున్న సహకారాన్ని మరింత పెంపొందింపచేస్తోంది. రగ్బీ ఇండియా ఆధ్వర్యంలో న్యూజిలాండ్ రగ్బీకి చెందిన కోచింగ్ సభ్యులకు 2026 మే నెలలో భువనేశ్వర్‌.. కళింగ స్టేడియంలో ఆతిథ్యాన్ని ఇచ్చారు. దీనిలో ‘కోచింగ్ అభివృద్ధి కార్యక్రమం’లో 35 మంది భారతీయ కోచులు పాలుపంచుకున్నారు. కోచింగ్ సామర్థ్యాలను పటిష్టపరచడంతో పాటు, భారత్‌లో రగ్బీ ఇంతింతై అన్నట్లు అభివృద్ధి చెందేలా సహకారాన్ని కూడా అందించాలన్నదే ఈ కార్యక్రమం ధ్యేయం.


 

భారత్, న్యూజిలాండ్ క్రీడాసంబంధాల్లో 100 సంవత్సరాలను పూర్తి అయిన సందర్భంగా, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, యువత మధ్య చిరకాలిక బంధాన్ని ఏర్పరచడంలో క్రీడలకు ఎంతటి శక్తి ఉందో రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఈ సిరీస్ నిరూపిస్తోంది. ఇది భారత్ అంతర్జాతీయ అనుబంధంలో క్రీడల భూమిక అంతకంతకు పెరుగుతుండటాన్ని కూడా కళ్లకు కడుతోంది. అంతేకాదు, క్రీడలు వేరువేరు దేశాల మధ్య వారధి వంటి పాత్రను పోషించగలవని, ఇవి మరింత ఎక్కువ శక్తిమంతమైన అంతర్జాతీయ క్రీడా సముదాయాన్ని నిర్మించడంలో తోడ్పాటును అందించగలవని కూడా ఈ కార్యక్రమం సూచిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2329518) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी