నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 12:01PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్) ప్రత్యేక కార్యక్రమం-6లో నిర్దేశించిన పలు కీలక లక్ష్యాలను అధిగమించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని సంస్థ కార్యాలయాలు, ఇతర ప్రాంగణాల్లో పారిశుద్ధ్యం, పాత వస్తువుల తొలగింపు, స్థల వినియోగాన్ని మెరుగుపరచడం, రికార్డుల నిర్వహణ వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించింది.

ఈ కార్యక్రమం కింద 225 ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా... 226 ప్రాంతాల్లో పనులను ఎస్‌ఈసీఎల్ పూర్తి చేసింది. అలాగే 40 లక్షల చదరపు అడుగుల ప్రదేశాన్ని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 47 లక్షల చదరపు అడుగులకు పైగా ప్రదేశాన్ని శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 3,300 మెట్రిక్ టన్నుల పాత వస్తువులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 4,602 మెట్రిక్ టన్నుల పాత వస్తువులను తొలగించింది. వీటి విక్రయం ద్వారా సుమారు రూ.26.17 కోట్ల ఆదాయం సమకూరింది. వనరులను సమర్థంగా వినియోగించడం, పాత వస్తువులను క్రమబద్ధంగా తొలగించడం, కార్యాలయాల నిర్వహణను మెరుగుపరచడంపై సంస్థ చూపుతున్న దృష్టికి ఈ విజయాలు నిదర్శనంగా నిలిచాయి.

రికార్డుల నిర్వహణ, పెండింగ్ పనుల తగ్గింపులో గణనీయమైన పురోగతి
ప్రత్యేక ప్రచారం-6లో భాగంగా భౌతిక, ఎలక్ట్రానిక్ ఫైళ్ల నిర్వహణలో కూడా ఎస్‌ఈసీఎల్ గణనీయమైన పురోగతి సాధించింది. ఈ రెండు విభాగాల్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించింది.
500 భౌతిక ఫైళ్లను సమీక్షించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2,100 ఫైళ్లను సంస్థ సమీక్షించింది. ఇక 200 భౌతిక ఫైళ్లను తొలగించాలని నిర్దేశించుకోగా, 872 ఫైళ్లను తొలగించింది.
ఎలక్ట్రానిక్ ఫైళ్ల నిర్వహణలో 7,000 ఈ-ఫైళ్లను పరిశీలించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 14,215 ఫైళ్లను ఎస్‌ఈసీఎల్ పరిశీలించింది. 3,000 ఈ-ఫైళ్లను ముగించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 13,708 ఫైళ్లను మూసివేసింది. ఈ చర్యలతో పెండింగ్ ఫైళ్ల సంఖ్య తగ్గడంతో పాటు రికార్డుల నిర్వహణ, పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతున్నాయి.
ఈ-వ్యర్థాల నిర్వహణ.. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలు

ప్రత్యేక ప్రచారం 6లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా సేకరించడం, వేరు చేయడం, సురక్షితంగా తొలగించడంపై ఎస్‌ఈసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈ-వ్యర్థాల సేకరణ కార్యక్రమాలు చేపట్టింది.

బిలాస్‌పూర్‌లోని ఎస్‌ఈసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వినియోగం ముగిసిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించడానికి వీలుగా ప్రత్యేక ఈ-వ్యర్థాల సేకరణ బిన్‌ను ఏర్పాటు చేసింది. ఈ బిన్‌ను సైతం పనికిరాని పాత వస్తువులతోనే తయారు చేయడం విశేషం. తద్వారా ‘వ్యర్థాల నుంచి సంపద సృష్టి’ అనే భావనను ఆచరణలో చూపించింది.
బిలాస్‌పూర్‌లోని ఎస్‌ఈసీఎల్ నివాస కాలనీల్లోనూ ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నివాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలను సేకరించే కార్యక్రమాలను కూడా చేపట్టింది. సంస్థ కార్యకలాపాలు నిర్వహించే ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాలను అమలు చేసింది.
ప్రజా భాగస్వామ్యంతో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఈసీఎల్ తన కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలన్నింటిలో వివిధ పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో శుభ్రత ర్యాలీలు, శ్రమదాన కార్యక్రమాలు, వీధి నాటకాలు, పాఠశాల స్థాయి పోటీలు, అవగాహన కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్య కార్యక్రమాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన ‘స్వచ్ఛతా హి సేవా 2026’ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలకు కొనసాగింపుగా కూడా ఈ ప్రచారం సాగింది. ఇందులో భాగంగా ఎస్‌ఈసీఎల్ 55కు పైగా స్వచ్ఛత లక్ష్య ప్రాంతాల్లో (సీటీయూలు) శుభ్రత పనులు చేపట్టి, 10 లక్షల చదరపు అడుగులకు పైగా ప్రదేశాన్ని శుభ్రం చేసింది.
ప్రత్యేక ప్రచారం 6 అమలు దశను 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బిలాస్‌పూర్‌లోని ఎస్‌ఈసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛత హ్యాపీ రన్’ నిర్వహించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.
సుపరిపాలన, కార్యాలయాల సామర్థ్యం పెంపునకు చర్యలు
ప్రత్యేక ప్రచార-6ను అక్టోబర్ 2 నుంచి 31 వరకు అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ-వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, స్థలాన్ని సమర్థంగా వినియోగించడం, పాత వస్తువుల తొలగింపు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ పనుల తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా ఎస్‌ఈసీఎల్ పరిశుభ్రమైన కార్యాలయాల నిర్వహణ, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ, పరిపాలనా సామర్థ్యం, సుపరిపాలనను ప్రోత్సహిస్తోంది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఉద్యోగులు, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తోంది.
***