నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 11:14PM by PIB Hyderabad
ఆర్నబ్ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా బలపడి, గంటలకు 125–135 కిమీల వేగంతో గాలులు, 150 కి.మీ. వరకు ఈదురుగాలులు అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడానికి, విమానయాన భద్రతను నిర్ధారించడానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ (ఎంవోసీఏ) సమీక్షను నిర్వహించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా (భువనేశ్వర్‌తో సహా) నుంచి బయలుదేరే, ఈ ప్రాంతాలకు వచ్చే విమాన సర్వీసులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. తుపాను గమనం ఆధారంగా హైదరాబాద్, వారణాసి, ప్రయాగరాజ్, గోరఖ్‌పూర్‌లో ఆలస్యం కావచ్చు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏఏఐ, డీజీసీఏ, బీసీఏఎస్, ఐఎండీ, ఎయిర్‌లైన్–ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలు, ఇతర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఎంవోసీఏ స్పష్టం చేసింది.
విమానాశ్రయాల పరిస్థితి
అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచి విశాఖపట్నంలో కార్యకలాపాలను నిలిపివేశారు. అక్టోబర్ 27 సాయంత్రం 7 గం.ల నుంచి విజయవాడ, రాజమండ్రిలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. అక్టోబర్ 28న ఢిల్లీ–భోగాపురం–ఢిల్లీ సర్వీసు రద్దయింది.
విమానయాన సంస్థల తాజా సమాచారం:
-
ఎయిర్ ఇండియా: ఢిల్లీ–విశాఖపట్నం–ఢిల్లీ (అక్టోబర్ 27), ఢిల్లీ–విజయవాడ–ఢిల్లీ (అక్టోబర్ 28) మార్గాల్లో ఆరు సర్వీసుల రద్దు.
-
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: రద్దయినవి 13. వీటిలో ప్రధానంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు, ఈ ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి వచ్చే విమానాలు, వారణాసి–బ్యాంకాక్, బ్యాంకాక్–విశాఖపట్నంలకు వెళ్లే విమానాలు ఉన్నాయి.
-
ఇండిగో: విశాఖపట్నంలో అన్ని విమానాలు రద్దయ్యాయి. అక్టోబర్ 27 సాయంత్రం 7 తర్వాత విజయవాడ, రాజమండ్రిలో అన్ని సర్వీసులు రద్దయ్యాయి. ఈ రద్దుల సంఖ్య తాత్కాలికం.
-
ఆకాశ ఎయిర్: ఢిల్లీ–భోగాపురం, తిరుగు ప్రయాణ సర్వీసులు (అక్టోబర్ 28) రద్దయ్యాయి. మిగతా విమానాలు నడుస్తాయని భావిస్తున్నారు.
-
అలయన్స్ ఎయిర్: ఇప్పటి వరకు ఎలాంటి రద్దులు లేకుండా సాధారణంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ప్రతికూల వాతావరణానికి సంబంధించి కార్యాచరణ మార్గదర్శకాలను పాటించాలని, ఆలస్యాలు, రద్దుల గురించి ప్రయాణికులకు తెలియజేయాలని, రీబుకింగ్, రీఫండులకు సంబంధించిన నిబంధనలు పాటించాలని విమానయాన సంస్థలకు సూచించడమైనది.
ఎయిర్పోర్టుకి బయలుదేరే ముందుకు విమానయాన సంస్థల వెబ్‌సైట్, యాప్, హెల్ప్‌లైన్ లేదా ఎస్ఎంఎస్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించడమైనది. మీ విమానం ఖరారు అయిన తర్వాతే బయలుదేరాలి. అదనపు ప్రయాణ సమయాన్ని కూడా ప్రయాణికులు పరిగణనలోకి తీసుకోవాలి. కోస్తాంధ్రప్రదేశ్, ఒడిశాల్లో నీరు నిలిచిపోయే, రహదారులు మూసివేసే అవకాశాలున్నాయి. ప్రయాణికులు, వృద్ధులు, దివ్యాంగులు, పసివారితో ఉన్న తల్లిదండ్రులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టు ఆపరేటర్లకు కార్యదర్శి సూచించారు. ఏదైనా ఫిర్యాదు పరిష్కారం కాని పక్షంలో ముందుగా విమానయాన సంస్థతో ఆ తర్వాత ఎయిర్‌సేవా పోర్టల్ లేదా యాప్ ద్వారా సమస్యను తెలియజేయాలని సూచించారు.
భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. పరిస్థితులకు అనుగుణంగా తాజా సమాచారాన్ని జారీ చేస్తామని తెలియజేసింది.
***