నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 3:29PM by PIB Hyderabad
బొగ్గు శాఖ ఆధీనంలోని కోల్ ఇండియాకు అనుబంధ సంస్థ అయిన ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ (ఈసీఎల్) ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6’లో భాగంగా తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించింది. స్థల కవరేజీలో లక్ష్యానికి మించి 107 శాతం పురోగతిని సాధించడంతో పాటు, సుమారు 4 లక్షల చదరపు అడుగుల జాగాను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది. తుక్కును విక్రయించి, సంస్థ రూ.2.3 కోట్లు రాబట్టింది.
అక్టోబర్ 2 నుంచి 25వ తేదీ మధ్య కాలానికిగాను ప్రగతి నివేదికను ఈసీఎల్ విడుదల చేసింది. దీనిలో పేర్కొన్న ప్రకారం, మొత్తం 30 స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, 32 స్థలాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో లక్ష్యానికి మించి, 106.7 శాతం ఫలితాన్ని సాధించినట్లయింది. సంస్థ 2,08,052 చదరపు అడుగుల జాగాను పునర్వినియోగానికి అనువైందిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని, అంతకన్నా ఎక్కువగా 3,98,505 చ.అ. స్థలాన్ని పునరుద్ధరించింది. అంటే ఫలితాల సాధన 191.5 శాతంగా లెక్క తేలింది.
స్వచ్ఛతతో ముడిపడిన రెండు కొలమానాలను ఇప్పటికే అధిగమించడంతో, ఈసీఎల్ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం తుది దశలో మరిన్ని విజయాలను నమోదు చేసేందుకు సన్నద్ధమైంది. పనిప్రదేశాల్లో జోరుగా స్వచ్ఛత పరిరక్షణకు పూనుకోవడం, అదనపు స్థలం పునరుద్ధరణ, పాలనా సంస్కరణలను వేగవంతం చేయడం కోసం సంస్థ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత సామగ్రిని గుర్తించి వదిలించుకొనే క్రమంలో చెప్పుకోదగిన స్థాయిలో ఆర్థిక ప్రతిఫలాలను కూడా సంస్థ అందుకుంది. 850 మెట్రిక్ టన్నుల (ఎమ్టీ) సామానును తుక్కుగా గుర్తించిన ఈసీఎల్.. 466 ఎమ్టీ తుక్కును అమ్మింది. దీంతో సంస్థకు రూ.2,30,03,038 రాబడి వచ్చింది. ఉపయోగంలో లేని సరకును వదిలించుకుని సొమ్ము చేసుకోవడమే కాక, ఈ ప్రయత్నంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగైన రీతిలో వినియోగించుకోవడానికి, పనిప్రదేశంలో నిర్వహణను మెరుగుపరుచుకోవడానికి మార్గం సుగమం అయింది.
పాలనాపరంగా అపరిష్కృత అంశాల పరిష్కారం, రికార్డుల నిర్వహణను సరళతరం చేయడంలోనూ కీలక పురోగతిని సాధించారు. 1,200 దస్త్రాలను సమీక్షించాలని లక్ష్యంగా పెట్టుకొంటే, 1,071 దస్త్రాలను సమీక్షించడం పూర్తి చేశారు. అంటే లక్ష్యంలో 89.25 శాతం ఫలితాన్ని సాధించారు. పాతబడిన దస్త్రాలను 1,000 వరకు ఏరివేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొంటే, కాలం చెల్లిన 820 దస్త్రాలను ఏరివేయగలిగారు.
డిజిటల్ పరిపాలన విభాగాన్ని పరిశీలించినప్పుడు, సంస్థ 3,800 ఈ-ఫైళ్లను సమీక్షించాలని లక్ష్యంగా పెట్టుకొని, 3,247 ఈ-ఫైళ్ల సమీక్షను ముగించారు. అదనంగా, 3,600 ఈ-ఫైళ్లను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకొని, 2,436 ఈ-ఫైళ్లను పరిష్కరించారు. డిజిటల్ రికార్డుల క్రమబద్ధీకరణతో పాటు పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా సంస్థ నిరంతర ప్రాతిపదికన కృషి చేస్తోందని ఈ గణాంకాలు చాటుతున్నాయి.
మొత్తంమీద, ఈసీఎల్ ఎలక్ట్రానిక్ ఫైళ్లు, దస్త్రాలు కలుపుకొని 4,318 ఫైళ్లను సమీక్షించింది. 3,256 ఫైళ్లను ఏరివేయడమో లేదా మూసేయడమో చేశారు. ఇది రికార్డుల నిర్వహణ ఇదివరకటితో పోలిస్తే మరింత సమర్థం, సువ్యవస్థితం కావడానికి తోడ్పడింది.
సంస్థాగతంగా స్వచ్ఛతపై పట్టు సాధించే, వనరులను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకొనే, వివిధ విభాగాల్లో ప్రావీణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈసీఎల్ ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 మరింత జోరును అందించింది. ఆశించిన మేరకు మెరుగైన ఫలితాలను సాధించడానికి తోడ్పడే పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు సమన్వయపూర్వక చర్యల్ని తీసుకోవడంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని, ఒక నిర్ణీత పద్ధతి ప్రకారం తుక్కును వదిలించుకోవడాన్ని ఈ కార్యక్రమం వేగవంతం చేసింది.
సాధించిన విజయాల నుంచి ప్రేరణను పొందిన ఈసీఎల్ ప్రచార కార్యక్రమం ముగిసే లోపల మిగతా లక్ష్యాలను కూడా అధిగమించడంపై దృష్టిని కేంద్రీకరించింది. మరీముఖ్యంగా తుక్కు అమ్మకం, ఫైళ్ల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఫైళ్ల పరిష్కారంపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు.
సమర్థ పాలన, వనరుల బాధ్యతాయుత ఉపయోగం, పనిప్రదేశంలో స్వచ్ఛత, అధిక ఉత్పాదకత సాధన అన్న అంశాల పట్ల సంస్థ ఎంత నిబద్ధతతో ఉన్నదీ ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6’లో సాధించిన ఫలితాలు నిరూపిస్తున్నాయి.
***