నాడు పోస్టు చేయడమైనది:
25 OCT 2026 8:27PM by PIB Hyderabad
కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియా పర్యటనను నేటి నుంచి మొదలుపెట్టారు. ఆయన భారతదేశ నౌకావాణిజ్య సంబంధిత అవసరాలను తీర్చడానికి దక్షిణ కొరియా పరిశ్రమకు ఉన్న అవకాశాలను గురించి వివరించనున్నారు. నౌకానిర్మాణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, 2047 కల్లా భారత్‌ను ప్రపంచంలో అయిదు అగ్రగామి నౌకానిర్మాణ దేశాలలో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండు దేశాలూ కలసి పనిచేస్తున్నాయి.
శ్రీ సోనోవాల్ తన పర్యటనను బుసాన్ నుంచి ఆరంభించారు. బుసాన్ కొరియా నౌకావాణిజ్య పరిశ్రమకు కూడలిగా ఉందని ఆయన అన్నారు. కొరియాలో నౌకానిర్మాణంలో నిమగ్నమైన భారతీయ వృత్తినిపుణులతో ఆయన సమావేశమయ్యారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి శ్రీ గౌరంగలాల్ దాస్ ఆహ్వానితులకు స్వాగతం పలికి, శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్, హనవా ఓషన్, హెచ్‌డీ హుండయీ, డీఎన్‌వీతో పాటు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ శిపింగ్ ప్రతినిధులను పరిచయం చేశారు.
‘‘ప్రపంచంలో అత్యాధునిక నౌకానిర్మాణ విస్తారిత అనుబంధ వ్యవస్థల్లో ఒకటైన కొరియాలో మీ ఉనికి భారత్‌కు గర్వకారణం’’ అని శ్రీ సోనోవాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ఏప్రిల్‌లో భారత్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన కాలంలో, రెండు దేశాలు ఆమోదించిన ప్రాథమిక ప్రణాళిక కేవలం ఒక లాంఛనపూర్వక ఒప్పందం కాదని, అంతకు మించిందిగా దానిని స్వీకరించవలసిందంటూ మంత్రి వారికి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాథమిక ప్రణాళికను ‘వాయేజెస్’గా వ్యవహరిస్తున్నారు. దీనిలో నౌకానిర్మాణం, నౌకాయానం, నౌకావాణిజ్య సంబంధిత ఆధునిక రవాణా వ్యవస్థ భాగంగా ఉన్నాయి.
‘‘మీరు వాయేజెస్‌ను ఒక ప్రభుత్వ ప్రాథమిక ప్రణాళికగా మాత్రమే కాకుండా, మీ వృత్తిపరమైన అభివృద్ధితో పాటు భారత నౌకావాణిజ్య భవిష్యత్తుకు దోహదం చేసే ఒక వేదికగా కూడా చూడాలి’’ అని శ్రీ సోనోవాల్ అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘మారిటైమ్ ఇండియా విజన్-2030’, ‘మారిటైం అమృత్ కాల్ విజన్-2047’లలో భాగంగా నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు, తయారీ, ఆధునిక రవాణా వ్యవస్థలలో ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగే కేంద్రంగా మారడం భారత్ లక్ష్యమని శ్రీ సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని, 2025 సెప్టెంబర్‌లో విధానపరమైన అనేక ప్రోత్సాహక చర్యలకు భారత మంత్రిమండలి ఆమోదం తెలిపిందని శ్రీ సోనోవాల్ గుర్తు చేశారు.
భారత్‌కు చాలా నౌకానిర్మాణ సంస్థలు, నౌకావాణిజ్య ఇంజినీర్లు, నౌకాదళ వాస్తుశిల్పులు, డిజైనర్లు, వెల్డర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లతో పాటు సాంకేతిక నిపుణుల అవసరం ఉందని శ్రీ సోనోవాల్ అన్నారు. వృత్తినిపుణులు కొరియాలో సంపాదించిన అనుభవాన్ని స్వదేశానికి తీసుకురావడమో, లేదా కొరియాలో కార్యకలాపాలను కొనసాగిస్తూనే భారతీయ కంపెనీలకు సాయపడటమో చేయాల్సిందిగా ఆయన కోరారు.
‘‘మీరు రెండు దేశాల్లోని మీ మీ నెట్‌వర్కుల మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించాలి’’ అని శ్రీ సోనోవాల్ అన్నారు. యువ భారతీయ వృత్తినిపుణులకు మార్గదర్శకత్వాన్ని అందించడంతో పాటు, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్‌లో పాలు పంచుకోవాల్సిందిగా వారిని ప్రోత్సహించారు. అలాగే భారత్‌కు, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీకి మధ్య నౌకానిర్మాణ సంబంధిత నైపుణ్య భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని కూడా సూచించారు.
షిప్‌యార్డు ఉత్పాదకతను, ప్రాజెక్టు అమలు ప్రక్రియను మెరుగుపరచడమెలా; ప్రపంచ దేశాలతో పోటీపడగలిగే నిపుణులైన సిబ్బందిని తయారు చేసుకోవడమెలా; భారతీయ, కొరియా కంపెనీలు సాంకేతిక విజ్ఞానం, తయారీ, నూతన ఆవిష్కరణల పరంగా సహకారాన్ని విస్తరించుకోవడమెలా.. ఈ మూడు అంశాలలో ఆచరణీయ సూచనలను, సలహాలను అందించవలసిందిగా శ్రీ సోనోవాల్ విజ్ఞప్తి చేశారు.
‘‘నౌకానిర్మాణం, నౌకాయానం, ఓడరేవులు, నౌకావాణిజ్య ఆధునిక రవాణా వ్యవస్థలలో కొరియాతో భాగస్వామ్యాన్ని మేం కోరుకుంటున్నాం’’ అని శ్రీ సోనోవాల్ అన్నారు.
అంతర్జాతీయ నౌకానిర్మాణ పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలు, నౌకావాణిజ్య పరిశ్రమ సంస్థలతోనూ, ఈ రంగానికి చెందిన మేధావులు, పరిశోధన సంస్థలతోనూ భేటీలు ఈ పర్యటన కార్యక్రమంలో చోటుచేసుకోనున్నాయి.
ప్రపంచ నౌకావాణిజ్య దినోత్సవం సందర్భంగా బుసాన్‌లో మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పాలుపంచుకోనున్నారు. ప్రపంచంలోని ప్రధాన నౌకావాణిజ్య దేశాల మంత్రులతో పాటు, ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ (ఐఎమ్ఓ) సెక్రటరీ-జనరల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు.

***