నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 8:06PM by PIB Hyderabad
‘ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్’లో భాగంగా పాకిస్థాన్ వస్తువుల దిగుమతులపై నిషేధాన్ని తప్పించుకునే మరో ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భగ్నం చేశారు. 2026 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 22 వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన సుమారు 25,000 కిలోల పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దిగుమతులపై నిషేధాన్ని తప్పించుకునేందుకు ఈ విత్తనాలను దుబాయ్ మీదుగా రవాణా చేసి, అవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మూలానికి చెందినవిగా తప్పుడు ప్రకటన చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో 2026 అక్టోబర్ 22న ఇద్దరిని అరెస్టు చేశారు.
నిర్దిష్ట సమాచారం ఆధారంగా నవా శేవా ఓడరేవుకు దిగుమతి అయిన సుమారు 25,000 కిలోల విత్తనాల సరుకును డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ సరుకును యూఏఈ మూలానికి చెందిన కర్బూజా విత్తనాలుగా ప్రకటించారు. అయితే తనిఖీల్లో అవి పుచ్చకాయ విత్తనాలని, వాటి మూలం పాకిస్థాన్ అని సూచించే ఆధారాలు లభించాయి.
వస్తువుల అసలు మూల దేశాన్ని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా రవాణా మార్గాన్ని మార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తొలుత పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టు నుంచి ఒక నౌకలోని కొన్ని కంటైనర్ల ద్వారా ఈ విత్తనాలను దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టుకు తరలించారు. అక్కడ సరుకును మరో సెట్ కంటైనర్లలోకి మార్చి, వేరే నౌకలో భారత్‌కు పంపించారు. కంటైనర్లు, నౌకలను మార్చడంతోపాటు, మూల దేశం విషయంలో తప్పుడు వివరాలు ప్రకటించడం, నకిలీ దిగుమతి పత్రాలను ఉపయోగించడం ద్వారా సరుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో లభించిన కీలక పత్రాలు ఈ సరుకు పాకిస్థాన్ నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు చేరినట్లు స్పష్టంగా నిర్ధారించాయి. దీంతో సరుకు యూఏఈ మూలానికి చెందినదన్న ప్రకటన తప్పని వెల్లడైంది.
దర్యాప్తులో ఈ దిగుమతి అమల్లో ఉన్న దిగుమతి విధానానికి రెండు విధాలుగా విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. మొదటిది, 2025 మే 2న జారీ చేసిన డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ నంబర్ 06/2025-26 ప్రకారం, పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయిన లేదా పాకిస్థాన్ నుంచి ఎగుమతి చేసిన అన్ని రకాల వస్తువులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం, రవాణా మార్గంగా తరలించడం నిషేధం. రెండవది, 2024 ఏప్రిల్ 5న జారీ చేసిన డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ నంబర్ 02/2023 ప్రకారం, 2024 జూలై 1 నుంచి పుచ్చకాయ విత్తనాల దిగుమతిపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు రూ.2.02 కోట్ల మార్కెట్ విలువ కలిగిన సరుకును 1962 నాటి కస్టమ్స్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం 2026 అక్టోబర్ 14న స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దిగుమతిదారుడు గతంలో అంటే 2026 ఫిబ్రవరిలో ఇదే దుబాయ్ ఆధారిత సరఫరాదారు నుంచి 22,000 కిలోల ఖర్బూజా విత్తనాలను దిగుమతి చేసుకున్నాడు. ఆ సరుకును కూడా యూఏఈ మూలానికి చెందినదిగా ప్రకటించాడు. ఈ సరుకును కూడా మధ్యలో మరో ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి భారత్‌కు పంపినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. దీంతో ఆ సరుకు మూల దేశం గురించి ప్రకటించిన వివరాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారంలో దిగుమతిదారుడికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారిలో ఒకరు దిగుమతి-ఎగుమతి కోడ్ (ఐఈసీ) కలిగిన వ్యక్తి కుమారుడు కాగా, మరొకరు ఆయన మేనల్లుడు. ఈ అక్రమ కార్యకలాపాల్లోని వివిధ దశలను వీరు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుమారుడు దుబాయ్‌లో ఉన్న సరఫరా సంస్థకు యజమాని, డైరెక్టర్‌గా ఉండగా, అతని మేనల్లుడు భారత్‌లో దిగుమతులకు సంబంధించిన ప్రక్రియలు, దేశీయ విక్రయాలను చూసుకునేవాడు. ఈ ఇద్దరినీ 2026 అక్టోబర్ 22న అరెస్టు చేశారు.
ఈ ఆపరేషన్‌కు ముందు కూడా, భారత్ దిగుమతి నిషేధాన్ని తప్పించుకునేందుకు ఇతర దేశాల మీదుగా తరలిస్తున్న పాకిస్థాన్ మూలానికి చెందిన వస్తువులపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఇటీవల పలు కీలక చర్యలు చేపట్టారు. 2026 సెప్టెంబర్‌లో నాసిక్‌లోని అంబాద్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్‌ఎస్) వద్ద 13 కంటైనర్లలో ప్యాక్ చేసిన 362 మెట్రిక్ టన్నులకు పైగా పాకిస్థాన్ మూలానికి చెందిన ఎండు ఖర్జూరాలను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఈ సరుకును దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు మీదుగా తరలించి, దాని మూల దేశం గురించి తప్పుడు వివరాలు ప్రకటించినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల అక్టోబర్‌లో శ్రీలంకలోని కొలంబో మీదుగా అక్రమంగా తరలించిన పాకిస్థాన్ మూలానికి చెందిన పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే హిమాలయన్ రాతి ఉప్పును కూడా డీఆర్‌ఐ గుర్తించింది. నకిలీ మూల దేశ ధ్రువపత్రాలు, ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి 295 కంటైనర్లలో 7,311 మెట్రిక్ టన్నుల ఉప్పును భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడైంది.
2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయిన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం, రవాణా మార్గంగా తరలించడంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు 2025 మే 2న విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ నంబర్ 06/2025-26 జారీ చేసింది.
కస్టమ్స్ మోసాలకు పాల్పడుతున్న, దిగుమతులపై విధించిన నిషేధాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యవస్థలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు డీఆర్‌ఐ నిబద్దతతో పనిచేస్తుంది. తద్వారా భారత్ వాణిజ్య నియంత్రణ వ్యవస్థ సమగ్రతను, దేశ ఆర్థిక భద్రతను కాపాడేందుకు చర్యలు కొనసాగిస్తోంది.
***