నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 9:10PM by PIB Hyderabad
విశాఖపట్నంలో భారత్-సింగపూర్ 33వ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు (సింబెక్స్-2026) అక్టోబరు 21 ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 దాకా కొనసాగే ఈ కసరత్తులో పాల్గొనేందుకు సింగపూర్ నావికాదళ (ఆర్‌ఎస్‌ఎన్) యుద్ధ నౌక ‘ఆర్‌ఎస్‌ఎస్ సుప్రీం’ 21నే విశాఖకు చేరింది.
తొలి రోజున భారత నావికాదళ నౌకలు ‘ఐఎన్‌ఎస్ నీలగిరి’, ‘ఐఎన్‌ఎస్ కమోర్టా’ నౌకల విన్యాసాలతో ‘సింబెక్స్-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్), ఆర్‌ఎస్‌ఎన్ ఫ్లీట్ కమాండర్ సహా రెండు దేశాల నావికాదళాల ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
భారత్-సింగపూర్ నావికాదళ విన్యాసాలు (సింబెక్స్) 1994లో ‘ఎక్సర్‌సైజ్ లయన్ కింగ్’ పేరిట ప్రారంభమయ్యాయి. కాలక్రమంలో రెండు నావికాదళాల మధ్య ఓ కీలక ద్వైపాక్షిక సముద్ర సంబంధ కార్యక్రమంగా ఈ కసరత్తు ప్రాముఖ్యం సంతరించుకుంది. ఏళ్లు గడిచే కొద్దీ, ఈ విన్యాసాల పరిధి-సమ్మేళనం విస్తరించడంతోపాటు నావికాదళాల నడుమ వృత్తిగత సంబంధాలు, పరస్పర అవగాహన, కార్యాచరణ సమన్వయం మరింత బలపడ్డాయి.
ఈ విన్యాసాలను రెండు దశలలో నిర్వహిస్తారు. ఈ మేరకు అక్టోబరు 21 నుంచి 23 దాకా ‘హార్బర్ ఫేజ్’ పేరిట వృత్తిగత చర్చలు, నిపుణుల మధ్య పరిజ్ఞాన ఆదానప్రదానం, నౌకల సిబ్బంది మధ్య పరస్పర సందర్శనలు, క్రీడా కార్యక్రమాలు, ప్రణాళిక సమావేశాలు ఉంటాయి. అటుపైన అక్టోబరు 24 నుంచి 26 వరకు బంగాళాఖాతంలో రెండో దశ ‘సీ ఫేజ్’ కింద సముద్ర కార్యకలాపాలు, వ్యూహాత్మక విన్యాసాలు ఉంటాయి. ఇందులో జలాంతర్గామి నిరోధక పోరాట విన్యాసాలు, ఉపరితల-వైమానిక లక్ష్యాలను ఛేదించే విన్యాసాలు, నావికా సిబ్బంది నైపుణ్య ప్రదర్శన, యుద్ధనౌకల వ్యూహాత్మక సంచారం తదితరాలుంటాయి.
భారత్-సింగపూర్ మధ్య దీర్ఘకాలిక సముద్ర భాగస్వామ్యం, పరస్పర సహకార విస్తృతి, సముద్ర భద్రతలో ఉమ్మడి సవాళ్ల పరిష్కారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి-స్థిరత్వాలకు ప్రోత్సాహంపై సమష్టి నిబద్ధతను సింబెక్స్-2026 పునరుద్ఘాటిస్తుంది.
***