ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గంజాయి అక్రమ రవాణా యత్నాన్ని భగ్నం చేసిన డీఆర్ఐ.. నేపాల్‌ నుంచి తరలిస్తున్న 591 కిలోల గంజాయి స్వాధీనం

నిఘా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో ఓ ట్రక్కులో రహస్య అరల్లో దాచిన 81 గంజాయి ప్యాకెట్లను కనుగొన్న అధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 8:55PM by PIB Hyderabad

సరిహద్దుల మీదుగా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కీలక చర్యల్లో భాగంగా రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్ఐ) ఉత్తరప్రదేశ్‌లో 2026 అక్టోబర్‌ 17 - 18 తేదీల్లో పక్కా నిఘా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో 591.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. నేపాల్‌ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ ట్రక్కులో ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరల్లో ఈ సరుకును దాచినట్లు ఆపరేషన్‌లో గుర్తించారు.

నేపాల్‌ నుంచి గంజాయిని తరలిస్తున్న ఓ ట్రక్కు సోనౌలి మార్గం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుందన్న కచ్చితమైన నిఘా సమాచారంతో గోరఖ్‌పూర్‌లోని డీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. లక్నో, పాట్నా, వారణాసి బృందాలతో సమన్వయం చేసుకుంటూ నిఘా చేపట్టారు. నాలుగు గంటలకు పైగా నిరంతర నిఘా అనంతరం అనుమానిత ట్రక్కును గుర్తించి, గోరఖ్‌పూర్‌ - కుషీనగర్‌ మధ్య రహదారిపై అడ్డగించారు.

ట్రక్కును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ప్రత్యేకంగా అమర్చిన రెండు రహస్య అరలు బయటపడ్డాయి. ఒకటి ఇంజిన్‌ హుడ్‌ పైన, మరొకటి డ్రైవర్‌ సీటు వెనుక ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 591.3 కిలోల బరువున్న 81 గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయితో పాటు, దాని రవాణాకు ఉపయోగించిన ట్రక్కును కూడా మాదకద్రవ్యాలు, మానసిక ప్రభావిత పదార్థాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్) - 1985 నిబంధనల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కచ్చితమైన నిఘా సమాచారంతో చర్యలు చేపట్టడం, అక్రమ రవాణాదారులు అనుసరిస్తున్న అత్యాధునిక దాచివేత పద్ధతులను గుర్తించడం ద్వారా మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయడంలో డీఆర్ఐ నిబద్ధతను ఈ భారీ స్వాధీనం చాటిచెబుతోంది. సరిహద్దుల మీదుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అనుమానిస్తున్న మార్గాలపై నిరంతర నిఘా, అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఆపరేషన్‌ స్పష్టం చేస్తోంది. 

 

****


(రిలీజ్ ఐడి: 2325348) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil