ఆయుష్
ఆయుర్వేదం, కృత్రిమ మేధ సమన్వయంపై ఐటీఆర్‌ఏ జామ్‌నగర్‌లో ‘ఆయు-టెక్ నవోన్మేష్ 2026’ ఐటీఆర్‌ఏ జాతీయ సదస్సు
జామ్‌నగర్‌లోని ఐటీఆర్‌ఏ సదస్సులో ఆయుర్వేదంలో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం, డిజిటల్ ఆవిష్కరణలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణుల చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 9:55PM by PIB Hyderabad
జామ్‌నగర్‌లోని ఆయుర్వేద బోధన, పరిశోధన సంస్థ (ఐటీఆర్‌ఏ) ఆరో సంవత్సర స్థాపక దినోత్సవం సందర్భంగా ‘ఆయు-టెక్ నవోన్మేష్ 2026’ కార్యక్రమంలో భాగంగా ‘కృత్రిమ మేధ, ఆయుర్వేదం’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆయుర్వేదాన్ని ఆధునిక డిజిటల్ సాంకేతికతతో అనుసంధానించడం, పరిశోధనల్లో కృత్రిమ మేధ పాత్ర, ఆరోగ్య సేవల్లో దాన్ని బాధ్యతాయుతంగా వినియోగించే అవకాశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఐటీఆర్‌ఏకు చెందిన ఆయుష్ నెక్స్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ (ఏఎన్‌సీఎన్) ఛానల్‌తో మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రం డబ్ల్యూహెచ్‌ఓ-జీటీఎంసీ)లో సంప్రదాయ వైద్య పరిశోధన, డేటా, ఆవిష్కరణల విభాగం అధిపతి డాక్టర్ గీతా కృష్ణన్ మాట్లాడుతూ.. “ఆయుర్వేదాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, దాని అనువర్తనాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికి కృత్రిమ మేధకు అపారమైన సామర్థ్యం ఉంది. ఏదైనా కొత్త సాంకేతికతను స్వీకరించే ముందు ఆయుర్వేద శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలపై లోతైన అవగాహన అవసరం. ఆయుర్వేదానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, దాని పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసే సాధనంగా ఏఐ పనిచేయాలి. ఆధునిక సాంకేతికతల అవకాశాలను అన్వేషిస్తూనే ఆయుర్వేద ప్రామాణికతను కాపాడటం ఆయుర్వేద రంగానికి చెందిన ప్రతి ఒక్కరి ముఖ్యమైన బాధ్యత. సమతుల్యమైన విధానాన్ని అనుసరించడం ద్వారా ఆయుర్వేద మౌలిక సూత్రాలకు విఘాతం కలగకుండా ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చు. సంప్రదాయం, ఆవిష్కరణల మధ్య సరైన సమతుల్యతను నెలకొల్పడం మనందరి ఉమ్మడి బాధ్యత. అప్పుడే ఆయుర్వేదాన్ని అర్థవంతంగా, సమర్థవంతంగా, సుస్థిరమైన రీతిలో ముందుకు తీసుకెళ్లగలం” అని అన్నారు.
జామ్‌నగర్‌లోని ఐటీఆర్‌ఏ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ తనూజా నేసరి మాట్లాడుతూ.. ఆయుర్వేద భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు, సహకారానికి ‘ఆయు-టెక్ నవోన్మేష్ 2026’ కీలక వేదికగా నిలిచిందని తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానానికి, ఆధునిక సాంకేతికతకు మధ్య సంభాషణను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ముఖ్యమైన అవకాశాన్ని కల్పించిందన్నారు. ఆయుర్వేద పరిశోధన, విద్య, ఔషధాల అభివృద్ధి, ఆరోగ్య సేవల్లో ఏఐ వినియోగానికి ఉన్న అవకాశాలపై నైతిక, శాస్త్రీయ, ఆచరణాత్మక అంశాల పరంగా చర్చలను ముందుకు తీసుకెళ్లిందని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో డిజిటల్ ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు (డీహెచ్‌ఐ) విభాగంలో కృత్రిమ మేధ లీడ్‌గా పనిచేస్తున్న శ్రీ సమీర్ పూజారి, విజ్ఞానాన్ని పరిరక్షించడంలో ఏఐకు ఉన్న సామర్థ్యాన్ని వివరించారు. ఆరోగ్య రంగంలో ఏఐ అనువర్తనాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూపీఓ) 2018 నుంచి కొనసాగిస్తున్న అంతర్జాతీయ సహకారాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సంప్రదాయ వైద్య విధానాల విషయంలో ఏఐ వినియోగానికి సంబంధించిన నైతిక అంశాలు, డేటా గోప్యత, నియంత్రణపరమైన అడ్డంకులు సహా దానితో ముడిపడిన ప్రమాదాలు, సవాళ్లను కూడా ఆయన వివరించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఆయుష్ గ్రిడ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పనిచేస్తున్న శ్రీ నమన్ గోయల్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక భావనలు, వాటి అనువర్తనాలు, పనితీరుపై వివరించినట్లు తెలిపారు. డేటా సేకరణ, డేటా ప్రాసెసింగ్, నమూనాలకు శిక్షణ ఇవ్వడం, పరీక్షించడం, అంచనాలు రూపొందించడం వంటి కీలక ప్రక్రియలను కూడా వివరించారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, ఆయుష్ గ్రిడ్ పరిధిలోని ముఖ్యమైన డిజిటల్ సాధనాలను ప్రదర్శించారు. డిజిటల్ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో, సాంకేతికత ఆధారిత ఆయుష్ సేవలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ప్రదర్శనలో వివరించారు.
ఆయుర్వేదంలోని సమృద్ధమైన సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక డిజిటల్ సాంకేతికతతో అనుసంధానించడం, పరిశోధన, ఆవిష్కరణలు, ఆరోగ్య సేవల్లో కొత్త అవకాశాలను ప్రోత్సహించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఆయుర్వేద పండితులు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా వివిధ సెషన్లలో పాల్గొని, ఏఐను సమర్థవంతంగా, నైతికంగా, శాస్త్రీయంగా వినియోగించడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయుర్వేద ఔషధాల పరిశోధన, అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ, క్లినికల్ ట్రయల్స్, విద్యా రంగాల్లో ఏఐకు ఉన్న అనువర్తన అవకాశాలపై చర్చించారు. సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక డేటా ఆధారిత పద్ధతులతో అనుసంధానించడం, పరిశోధనలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని ప్రోత్సహించడం, సాంకేతికత ఆధారిత ఆరోగ్య సేవలను ముందుకు తీసుకెళ్లడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అంశాలవారీ సమావేశాలు-నిపుణుల భాగస్వామ్యం
కింది అంశాలపై ప్రత్యేక సమావేశాలు, నిపుణుల చర్చలు నిర్వహించారు.
· సంప్రదాయ వైద్య విధానాల్లో కృత్రిమ మేధ, డిజిటల్ విజ్ఞానం, ప్రపంచవ్యాప్త పరివర్తన
· ఆయుర్వేదంలో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం: నైతికత, శాస్త్రీయ ఆధారాలు, నూతన ఆవిష్కరణలు
· ఏఐ ఆధారిత ఆయుర్వేదం సామర్థ్యం: సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక, తెలివైన ఆరోగ్య సేవల వరకు
· ఆయుర్వేదంలో నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తుల అభివృద్ధి, బాధ్యతాయుతమైన క్లినికల్ ట్రయల్స్ కోసం కృత్రిమ మేధ వినియోగం
దేశ, విదేశాలకు చెందిన పలు ప్రముఖ సంస్థల నిపుణులు ముఖ్య ఉపన్యాసకులుగా, ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. వారిలో సావిత్రీబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ, సమాచార శాస్త్ర విభాగం ప్రొఫెసర్, అధిపతి, ప్రచురణ నైతికత కేంద్రం (సీపీఈ) సమన్వయకర్త ప్రొఫెసర్ శుభదా నాగర్‌కర్, బెంగళూరులోని అపోలో ఆయుర్వేద ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ రాజీవ్ వాసుదేవన్, ఢిల్లీ ఐఐటీలో డిజైన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమేర్ సింగ్ ఉన్నారు.
ఆయుర్వేదం, కృత్రిమ మేధ రంగాలకు చెందిన ఇతర వక్తల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ సాంకేతిక అధికారి డాక్టర్ మాకి కాజివారా, సావిత్రీబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయం ఆరోగ్య శాస్త్రాల విభాగంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆయుష్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ గిరీష్ తిల్లు, ముంబయిలోని ఆర్‌ఏ పొదార్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో రసశాస్త్రం, వికృతి విజ్ఞాన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ కాలే, స్విట్జర్లాండ్‌లోని డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య వ్యవస్థల విభాగంలో డేటా, డిజిటల్ ఆరోగ్యం, విశ్లేషణలు, ఏఐ అంశాల సీనియర్ సలహాదారు డాక్టర్ రాజేశ్వరి సింగ్ ఉన్నారు. వీరితోపాటు జోధ్‌పూర్ ఐఐటీలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మితాలి ముఖర్జీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌లో ఆరోగ్య సంరక్షణ, జీవశాస్త్ర రంగాల ప్రధాన డొమైన్ నిపుణుడు డాక్టర్ సంతోష్ దీక్షిత్, పుణేలోని సీ-డాక్ ఏఐ క్యూటీ గ్రూప్ ఆరోగ్య రంగ నిపుణుడు డాక్టర్ గణేశ్ కరైఖేడే, ఆయుర్.ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ బాలా పెసాలా పాల్గొన్నారు.
జామ్‌నగర్‌లోని ఆయుర్వేద బోధన, పరిశోధన సంస్థ ఆరో ఆరోగ్య స్థాపక దినోత్సవాన్నిఅక్టోబర్ 15, 2026న ‘ఐటీఆర్‌ఏ దినోత్సవం’గా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు, సహకార కార్యక్రమాలు, నిపుణుల ఉపన్యాసాలు, ఏఐ–ఆయుర్వేదంపై చర్చలు, సంస్థాగత గౌరవాలు, పురస్కార కార్యక్రమాలు జరిగాయి. దేశంలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ హోదా పొందిన తొలి ఆయుర్వేద సంస్థ ఐటీఆర్‌ఏ. 2020 అక్టోబర్ 15న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంస్థను జాతికి అంకితం చేశారు. గత ఆరు సంవత్సరాల్లో జాతీయ ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల గుర్తింపు మండలి (ఎన్‌ఏబీహెచ్) గుర్తింపు పొందిన 300 పడకల ఆసుపత్రి ద్వారా 22 ఓపీడీ విభాగాల్లో మొత్తం 18,47,807 మంది రోగులకు సంప్రదింపులు, చికిత్స అందించారు. ఐపీడీ విభాగంలో 27,520 మంది రోగులకు చికిత్స అందించారు. సంస్థ అధికారిక టీవీ ఛానల్ ఏఎన్‌సీఎన్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా కార్యక్రమం నిర్వహించారు. ఐటీఆర్‌ఏలో ఆయుర్వేదం, ఆయుర్వేద ఫార్మసీ, యోగా, ప్రకృతి వైద్యం కోర్సులు అందిస్తున్నారు.
బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ వినియోగం ద్వారా ఆయుర్వేదాన్ని మరింత అభివృద్ధి చేయాలనే తన నిబద్ధతను ఈ సదస్సు స్పష్టం చేసింది. సంప్రదాయం, నూతన ఆవిష్కరణలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2324797)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16