రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారులు, రోడ్డు రవాణా రంగంలో ఇండియా-జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూపు(జేడబ్ల్యూజీ) 12వ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 8:04PM by PIB Hyderabad

రహదారులు, రోడ్డు రవాణా రంగంపై భారత్-జపాన్ సంయుక్త కార్యవర్గం (జేడబ్ల్యూజీ) 12వ సమావేశం 2026 అక్టోబర్ 15న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. భారత ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, సంబంధిత సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహించింది.

అధునాతన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలు, టన్నెల్-బ్రిడ్జి ఇంజినీరింగ్, సుస్థిరమైన మౌలిక వసతుల అభివృద్ధి, రహదారి నిర్వహణలో నూతన, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రోడ్డు రవాణా రంగంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన వేదికను ఈ సమావేశం అందిస్తుంది. రెండు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం, ఉత్తమ పద్దతుల ఆదానప్రదానాలకు ఈ చర్చలు దోహదపడ్డాయి. అలాగే రహదారి మౌలిక వసతుల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, మరమ్మతుల్లో సహకారాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించాయి.

స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా ఈ సమావేశం జరిగింది. ఈ దార్శనికత ఆర్థిక వృద్ధికి, అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, రవాణా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, అన్ని ప్రాంతాలకూ అవకాశాలను అందించడానికి తోడ్పడుతుంది. భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, ప్రజలకు సౌకర్యాన్ని, వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేలా ప్రపంచ ప్రమాణాలతో కూడిన, సురక్షితమైన, సమర్థమైన, సుస్థిరమైన, సాంకేతిక ఆధారిత మౌలిక వసతులు, వంతెనలు, సొరంగాల అభివృద్ధికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రాధాన్యమిచ్చారు.

image.png

ప్రభుత్వ సంపూర్ణ ఆమోదంతో రైల్వే మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వశాఖ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

సాంకేతిక ప్రదర్శనలు, ప్రశ్నలు-సమాధానాలు కార్యక్రమాల్లో భారత్, జపాన్ సాంకేతిక సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. రోడ్డు మౌలిక వసతుల నాణ్యతను, సామర్థ్యాన్ని, నిర్వహణను మెరుగుపరిచే ఆవిష్కరణాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాలు, సుస్థిరమైన విధానాలకు సంబంధించిన ఆలోచనలను పంచుకొనే అవకాశాన్ని ఈ చర్చలు అందించాయి.

సాంకేతిక ఆవిష్కరణ, సుస్థిర నిర్మాణ పద్ధతులు, సాంకేతిక నైపుణ్య వినిమయం ద్వారా రోడ్డు, రవాణా మౌలిక వసతులను ముందుకు తీసుకెళ్లడంలో భారత్-జపాన్ సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2324305) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati