వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ బ్రూనై దారుస్సలాం ద్వైపాక్షిక వాణిజ్య-ఆర్థిక సహకారంపై సంయుక్త వాణిజ్య కమిటీ మూడో దఫా సమీక్ష

ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణ.. మార్కెట్ లభ్యత మెరుగుదల.. వాణిజ్య సంస్థల మధ్య ఆదానప్రదాన సౌలభ్యంపై కీలక చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 8:30PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలో ఇవాళ భారత్-బ్రూనై దారుస్సలాం సంయుక్త వాణిజ్య కమిటీ (జేటీసీ) మూడో సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్య-ఆర్థిక సహకారంపై సమీక్ష సహా వాణిజ్య సంబంధాల బలోపేతానికి మార్గాన్వేషణపై ఈ సందర్భంగా చర్చించారు. భారత్‌ తరఫున వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ అమిత్ వర్మ, బ్రూనై దారుస్సలాం తరఫున ఆర్థిక-వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ మే ఫాయెజా అహ్మద్ అరిఫిన్ సహాధ్యక్షత వహించారు. వారితోపాటు రెండు దేశాల సంబంధిత మంత్రిత్వ శాఖలు-విభాగాలు-సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణ, మార్కెట్ ప్రవేశ ప్రాథమ్యాల సమస్య పరిష్కారం, వాణిజ్య సంస్థల మధ్య ఆదానప్రదానాల సౌలభ్యం దిశగా సంస్థాగత యంత్రాంగాల గుర్తింపుపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఆహార భద్రతకు మద్దతు, వాణిజ్య వైవిధ్యం లక్ష్యంగా భారత్‌ నుంచి బ్రూనై దారుస్సలాం దేశానికి వ్యవసాయ- జంతు ఉత్పత్తుల ఎగుమతులను సరళీకరించడంపైనా ఉభయ పక్షాలు చర్చించాయి.

మరోవైపు  ఔషధ, ఆరోగ్య సంరక్షణ, ఇంధన రంగాలలో మరింత విస్తృతికి గల అవకాశాలపై ఉభయ పక్షాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ రెండు రంగాల్లో అధిక భాగస్వామ్యానికి వీలున్న అంశాలను గుర్తిస్తూ- నియంత్రణ సహకారం, కొనుగోళ్లు, ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానంపైనా అవకాశాలపై చర్చించారు. ఇంధన రంగానికి సంబంధించి నిరంతర పారిశ్రామికాభివృద్ధికి మద్దతు సహా సంప్రదాయ, అత్యాధునిక ఇంధన భాగస్వామ్యాలపై దృష్టి సారించారు.

పర్యాటక రంగంలో సహకారం, వాణిజ్య సమ్మేళనాలు, ప్రదర్శనలలో పాలు పంచుకోవడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలతోపాటు వాణిజ్య విస్తరణ బలోపేతం ప్రాముఖ్యాన్ని కూడా ఉభయపక్షాలు ప్రస్తావించాయి. తయారీ, మౌలిక సదుపాయాలు, సేవల రంగాల్లో పెట్టుబడి అవకాశాల గుర్తింపు దిశగా లక్షిత వాణిజ్య ప్రోత్సాహక కార్యక్రమాలు, పరస్పర వ్యాపార ప్రతినిధి బృందాలు దోహదం చేస్తాయని ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో చర్చించిన మేరకు వాణిజ్య, పెట్టుబడి లక్ష్యాల సాకారంలో భాగంగా తదుపరి చర్యల పర్యవేక్షణ కోసం సంబంధిత నోడల్ ఏజెన్సీలు, వర్కింగ్ గ్రూపుల మధ్య నిరంతర సమాచార ఆదానప్రదానాన్ని కొనసాగించడంపై రెండు పక్షాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల సంయుక్త వాణిజ్య కమిటీ తదుపరి (4వ) సమావేశాన్ని బ్రూనై దారుస్సలాంలో నిర్వహిస్తారు.

****


(రిలీజ్ ఐడి: 2323626) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी