నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలు చూపే పలు ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారని కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో మద్యం సేవించినట్లు గుర్తించినప్పుడు వాహనం స్టార్ట్ కాకుండా అడ్డుకునే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత మద్యం గుర్తింపు వ్యవస్థ, నీటి వినియోగాన్ని తగ్గించే అల్ట్రాసోనిక్ వాషింగ్ మెషీన్, కంపనాల ద్వారా వీధి కుక్కలను దూరంగా ఉంచేందుకు రూపొందించిన పరికరం, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఉపయోగపడే సహాయక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. ప్రదర్శనలో ట్రాకింగ్ వాకింగ్ స్టిక్‌ను కూడా ప్రదర్శించినట్లు ఆయన పేర్కొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, విస్తృతంగా ఉపయోగపడే పరిష్కారాలను రూపొందిస్తున్నట్టు ఈ ప్రాజెక్టులు నిరూపిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విద్యార్థులు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు, మేధో సంపత్తి హక్కులను సైతం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో మొదలైన ఆవిష్కరణలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు, వాణిజ్యపరమైన విజయాలు సాధించేందుకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
దేశంలో విస్తరిస్తున్న స్టార్టప్ వ్యవస్థను ప్రస్తావిస్తూ, 2014లో సుమారు 350 - 400గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం దాదాపు 2.5 లక్షలకు చేరిందని కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో దాదాపు 60 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. నేటి యువతకు సమాచారంతో పాటు అవకాశాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అంకితభావం, కఠోర శ్రమతో గణనీయమైన విజయాలు సాధించవచ్చని ఆయన అన్నారు.
ప్రతిభావంతులైన విద్యార్థి ఆవిష్కర్తలు తమ ఉత్పత్తులను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమల భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. యువ ఆవిష్కర్తలకు పరిశ్రమలతో వ్యాపార సంబంధిత పరస్పర చర్చలకు అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా వారి ఆలోచనలపై పరిశ్రమల నుంచి అభిప్రాయాలు, సూచనలు అందడంతో పాటు, ఆ ఆవిష్కరణలను విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిభావంతమైన ఆవిష్కరణలు ప్రదర్శనలకూ, నమూనా పరికరాలకే పరిమితం కాకూడదని కేంద్ర మంత్రి అన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగే సామర్థ్యం ఉన్న విద్యార్థులకు పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశాలు కల్పించాలని, ఆచరణలో ఎదురయ్యే అవసరాలను తీర్చే పరిష్కారాలను అభివృద్ధి చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. యువ ఆవిష్కర్తలను ప్రారంభ దశలోనే సంబంధిత పరిశ్రమలతో అనుసంధానించడంతో పాటు, సాంకేతిక నిపుణుల సహకారం అందించే మార్గాలను అన్వేషించాలని భాగస్వాములకు పిలుపునిచ్చారు.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) మద్దతు పొందే డీప్‌టెక్ స్టార్టప్‌లకు గతంలో ఉన్న మూడేళ్ల కార్యకలాపాల అనుభవ నిబంధనను తొలగిస్తూ తీసుకున్న విధానపరమైన మార్పును డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించాలంటే కొత్త ఆలోచనలకు మద్దతు ఇవ్వడంతో పాటు, అంచనా వేసిన నష్టాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. విద్యార్థి ఆవిష్కర్తలను ప్రోత్సహించి, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం అవసరమని పిలుపునిచ్చారు.
విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించేందుకు, ఆలోచనలను మెరుగుపరుచుకునేందుకు, ప్రాథమిక భావన నుంచి ఆచరణాత్మక అనువర్తనం వరకు ముందుకు సాగేందుకు మార్గదర్శకత్వం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి అన్నారు. భవిష్యత్తులో నిర్వహించే ఈ కార్యక్రమంలో యువ ఆవిష్కర్తలు తమ ప్రాజెక్టులు, అనుభవాలను నేరుగా పంచుకునేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి విద్యార్థి వెంట కనీసం ఒక తల్లి/ తండ్రి లేదా సంరక్షకుడు ఉండేలా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు. పిల్లలు చేపట్టే వినూత్న ప్రాజెక్టుల స్వరూపం, వాటి ప్రాధాన్యం తల్లిదండ్రులకు కొన్నిసార్లు పూర్తిగా అర్థం కాకపోవచ్చని ఆయన అన్నారు. పిల్లలను నిరుత్సాహపరచాలనే ఉద్దేశం లేకపోయినా, ఒక ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడానికి అవసరమైన సమయాన్ని, శ్రమను తల్లిదండ్రులు తెలియకుండా అడ్డుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పిల్లలు కొత్త ప్రయోగాలు చేసేందుకు, సంప్రదాయ పద్ధతులను ప్రశ్నించేందుకు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకుల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర మంత్రి అన్నారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించడంతో పాటుతగిన మార్గదర్శకత్వం పొందాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, అవకాశాలు నిరంతరం మారుతున్న నేపథ్యంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
యువ ఆవిష్కర్తలు ఒక విజయం సాధించిన తర్వాత దానితోనే సంతృప్తి చెందకుండా, తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. తమ ఆసక్తులకు అనుగుణంగా వివిధ రంగాలను అన్వేషించాలని, సరైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రయోగాలు, ఆచరణాత్మక అనుభవాల ద్వారా తమ ఆలోచనలను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు.
శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ ఉమేశ్ వి. వాఘ్మారే మాట్లాడుతూ, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవచ్చో ఆలోచించే సామర్థ్యం యువ విద్యార్థుల్లో ఉందని ఈ ప్రదర్శన చాటిచెప్పిందన్నారు. అండమాన్ నికోబార్ దీవుల నుంచి కశ్మీర్ వరకు, మిజోరం నుంచి ముంబై వరకు దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగులకు అందుబాటులో ఉండే సదుపాయాలు, ఇంధనం, నీటి సంరక్షణ, భద్రత, వృద్ధుల దైనందిన జీవితాన్ని సులభతరం చేసే అంశాలతో సహా విభిన్న రంగాలకు చెందిన ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారని తెలిపారు.
ఇన్స్పైర్ - మానక్ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. డీఎస్టీ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ - ఇండియా సంస్థ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం, సామాజిక అవసరాల ఆధారంగా సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
2017లో ప్రారంభమైన ఇన్స్పైర్ - మానక్ పథకం కింద 2025 - 26 వరకు మొత్తం 18,27,580 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ పథకం కింద శాస్త్ర సాంకేతిక శాఖ ఇప్పటివరకు 11 జాతీయ స్థాయి ప్రదర్శనలు, ప్రాజెక్టుల పోటీలను నిర్వహించింది. వీటిలో 7,444 మంది విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు.
2023 - 24 ఆర్థిక సంవత్సరంలో 46,926 మంది, 2024 - 25లో 50,009 మంది విద్యార్థులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎంపికైన విద్యార్థులతో 12వ జాతీయ స్థాయి ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీని (ఎన్ఎల్ఈపీసీ) నిర్వహించారు. తమ ప్రాజెక్టులను జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు, నిపుణులతో ముఖాముఖి చర్చించేందుకు, వారి నుంచి మార్గదర్శకత్వం పొందడంతో పాటు నూతన విషయాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం విద్యార్థులకు వేదికగా నిలిచింది.
ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు తమ ఆలోచనలను నమూనాలుగా, ప్రాథమిక సాధ్యాసాధ్యాలను నిరూపించే ప్రోటోటైప్‌లుగా అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తారు. వర్క్‌షాప్‌లు, నిపుణులతో చర్చలు, ప్రముఖ సాంకేతిక సంస్థలతో పరస్పర సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టులను మరింత మెరుగుపరుచుకునే అవకాశాలు కల్పిస్తారు. చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించే దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం
యువ ఆవిష్కర్తలను అభినందించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం, నిరంతరం నేర్చుకోవడం కొనసాగించాలని సూచించారు. తమ ఆలోచనలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశ ఆవిష్కరణల వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
***