గనుల మంత్రిత్వ శాఖ
గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సముద్రగర్భ ఖనిజ బ్లాకుల వేలంపై అవగాహన కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 8:11PM by PIB Hyderabad
సముద్ర ప్రాంతాల్లోని ఖనిజ బ్లాకుల వేలంపై కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 13న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేలానికి ఉంచిన రెండు సముద్ర గర్భ ఖనిజ బ్లాకులు, వాటికి సంబంధించిన విధానాలు, నియంత్రణ నిబంధనలు, వేలం ప్రక్రియ, ఖనిజాల అన్వేషణకు అందుబాటులో ఉన్న సహాయంపై వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు, ఇతర సంబంధిత వర్గాలకు పూర్తి అవగాహన కల్పించారు.
అండమాన్ సముద్రంలో ఉన్న సెవెల్ రైజ్01, వెస్ట్ సెవెల్ రిడ్జ్-1 అనే రెండు సముద్ర గర్భ ఖనిజ బ్లాకుల నిర్వహణ హక్కుల మంజూరు కోసం గనుల మంత్రిత్వశాఖ 2026 అక్టోబర్ 1న టెండర్ ఆహ్వాన నోటీసు (ఎన్ఐటీ) జారీ చేసింది. ఈ రెండు బ్లాకుల్లో విస్తారమైన పాలీమెటాలిక్ నాడ్యూల్స్, క్రస్ట్స్ ఉన్నాయి. వీటిని కాంపోజిట్ లైసెన్స్ మంజూరు కోసం వేలానికి ఉంచారు. సెవెల్ రైజ్-01 బ్లాక్ 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, వెస్ట్ సెవెల్ రిడ్జ్-01 బ్లాక్ 1,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీంతో వేలానికి ఉంచిన మొత్తం విస్తీర్ణం 1,632 చదరపు కిలోమీటర్లకు చేరింది.
భారత ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ఇంధన పరివర్తన, తయారీ రంగ పోటీతత్వానికి మద్దతుగా దేశ ఖనిజ సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర వివరించారు. భారత తూర్పు తీరంలో ఏర్పాటు చేస్తున్న కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కు సముద్ర ప్రాంతాల నుంచి లభించే ఖనిజాల శుద్ధికి ఎలా తోడ్పడగలదో ఆయన ప్రస్తావించారు.
గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డెర్మల్ మాట్లాడుతూ.. దేశ సముద్ర ప్రాంత ఖనిజ వనరులను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన విధానపరమైన సంస్కరణలను వివరించారు. సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, సముద్ర ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణకు మరింత కార్యాచరణ సౌలబ్యాన్ని కల్పించేందుకు నాడ్యూల్స్, క్రస్ట్లు ఉన్న బ్లాకుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు వాటి విభజన, నిర్మాణంలో మార్పులు చేసినట్లు తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో సముద్ర ఖనిజాల అన్వేషణ, వెలికితీతకు సంబంధించి ప్రాథమిక పర్యావరణ గణాంకాల సేకరణ, పర్యావరణ నిర్వహణ ప్రణాళికల మార్గదర్శకాలు, విధివిధానాల ముసాయిదాను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అభిప్రాయాల కోసం పంపించినట్లు చెప్పారు. వీటిని త్వరలోనే ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సముద్ర తీర ఖనిజ బ్లాకుల భౌగోళిక లక్షణాలు, వాటిలో ఖనిజాల లభ్యతకు ఉన్న అవకాశాలపై సమగ్ర వివరాలను భారత భూగర్భ సర్వేక్షణ సంస్థ (జీఎస్ఐ) అందించింది. లావాదేవీల సలహాదారు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్బీఐసీఏపీఎస్) వేలానికి సంబంధించిన విధానాలు, ప్రక్రియ, టెండర్ నిబంధనలు, వేలానికి అవసరమైన షరతులను వివరించింది. వేలం వేదికను నిర్వహించే ఎంఎస్టీసీ సంస్థ.. ఈ-వేలం వేదిక ద్వారా టెండర్ పత్రాలను కొనుగోలు చేయడం, బిడ్లు సమర్పించడం వంటి ప్రక్రియలను దశలవారీగా ప్రదర్శించింది.
సముద్ర గర్భ ఖనిజ బ్లాకులకు సంబంధించి కాంపోజిట్ లైసెన్స్ పొందిన వారికి అన్వేషణ ఖర్చుల్లో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే పథకాన్ని జాతీయ ఖనిజ అన్వేషణ, అభివృద్ధి ట్రస్ట్ (ఎన్ఎంఈడీటీ) ప్రవేశపెట్టింది. ఖనిజ అన్వేషణ కార్యకలాపాలకు తోడ్పడేందుకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయాన్ని ఈ ప్రదర్శనలో వివరించారు.
గనుల మంత్రిత్వ శాఖతో, సంబంధిత సంస్థల ప్రతినిధులతో ఈ బహిరంగ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు నేరుగా మాట్లాడే అవకాశాన్ని అందించింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు, ఇతర సంబంధిత వర్గాలు ఖనిజ బ్లాకులు, టెండర్ నిబంధనలు, వేలం ప్రక్రియలు, ఖనిజాల అన్వేషణకు అందించే సహాయానికి సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.
ఈ వేలం 2002 నాటి సముద్ర గర్భ ప్రాంతాల ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టానికి 2023లో చేసిన సవరణలు, సముద్ర గర్భ ప్రాంతాల ఖనిజాల (వేలం) నిబంధనలు–2024కు చేసిన సవరణల ప్రకారం నిర్వహిస్తున్నారు. సముద్ర ప్రాంతాల్లోని ఖనిజ వనరుల కేటాయింపులో పారదర్శకతను నిర్ధారించడం, క్రమబద్ధమైన అన్వేషణను ప్రోత్సహించడం, ఖనిజ వనరుల సామర్థ్యాన్ని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం ఈ వేలం విధాన ప్రధాన లక్ష్యాలు.
పాలీమెటాలిక్ నాడ్యూల్స్, క్రస్ట్లలో నికెల్, కోబాల్ట్, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి వివిధ పారిశ్రామిక అవసరాలకు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు ఇవి ఎంతో కీలకం. సముద్ర ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణను ముందుకు తీసుకెళ్లడం, దేశ ఖనిజ వనరుల నిల్వలను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ఒక భాగం. ఈ ఖనిజ బ్లాకుల్లోని వనరుల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, భవిష్యత్తులో వాటిని అభివృద్ధి చేసే అవకాశాలను అంచనా వేయడానికి క్రమబద్ధమైన అన్వేషణ ఎంతో అవసరం.
వేలం షెడ్యూల్
టెండర్ పత్రాల విక్రయం 2026 అక్టోబర్ 1న ప్రారంభమైంది. ముందస్తు బిడ్ సమావేశం నవంబర్ 4న నిర్వహించనున్నారు. సందేహాలు, ప్రశ్నలు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13. టెండర్ పత్రాలను డిసెంబర్ 21 వరకు కొనుగోలు చేయవచ్చు. బిడ్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 28, 2026.
టెండర్ ఆహ్వాన నోటీసు, వేలానికి సంబంధించిన ఇతర పత్రాలు ఎంఎస్టీసీ ఈ-వేలం వేదికలో అందుబాటులో ఉన్నాయి: https://www.mstcecommerce.com/auctionhome/mlcln/index.jsp
(రిలీజ్ ఐడి: 2323124)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13