గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో ఢిల్లీ ఎన్‌సీఆర్ వెలుపల మొదటిసారిగా విజయవాడలో ప్రారంభమైన జాతీయ సరస్ మేళా-2026

30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,500 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలను విజయవాడకు తీసుకురానున్న జాతీయ సరస్ మేళా 2026

అక్టోబర్ 15న విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 7:33PM by PIB Hyderabad

విజయవాడ, 2026 అక్టోబర్ 12: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంయుక్త నిర్వహణలో విజయవాడ నగరం భారతీయ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి, మహిళా నాయకత్వ వ్యవస్థాపనకు ఒక విశిష్ఠ వేదికగా మారనుంది. ఈ భాగస్వామ్యంతో నగరంలో మొట్టమొదటి జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభం కానుంది.

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో 2026 అక్టోబర్ 13 నుంచి 31 వరకు ఈ మేళా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) చెందిన 1,500 మందికి పైగా మహిళలు హాజరుకానున్నారు. గ్రామీణ పరిశ్రమలు, సంప్రదాయ కళలు, ప్రాంతీయ వంటకాలు, పారిశ్రామికవేత్తల విజయగాథలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అద్భుతమైన వేదికగా ఈ మేళా నిలవనుంది. ఈ వేడుకను భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. కేంద్ర వ్యవసాయ- రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు..  కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్, కేంద్ర భారీ పరిశ్రమలు- ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ విచ్చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత- సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్.. వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్.. పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఐఏఎస్ శ్రీ రోహిత్ కన్సల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరందరి భాగస్వామ్యం.. గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, మహిళా నేతృత్వంలోని పారిశ్రామికతను ప్రోత్సహించడం, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు సుస్థిరమైన మార్కెట్ అవకాశాలను సృష్టించటానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్‌ఎం), 2029 నాటికి 6 కోట్ల మంది 'లఖ్‌పతి దీదీల'ను తయారుచేయాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ మేళా రూపుదిద్దుకుంది. సరస్ ఆజీవికా గ్యాలరీ, ఈ-సరస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఈ మేళా మహిళా పారిశ్రామికవేత్తలకు తమ సంప్రదాయ హస్తకళలను ప్రదర్శించడానికి, విస్తృత మార్కెట్‌లను పొందేందుకు, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులతో అనుసంధానం కావడానికి గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల మహిళలు తమ నైపుణ్యాలను సుస్థిరమైన వ్యాపారాలుగా మలచుకోవడానికి, తమ ఆదాయాలను బలోపేతం చేసుకోవడానికి, ఆర్థిక స్వాలంబనను సాధించడానికి తోడ్పడతాయి.

జాతీయ సరస్ మేళా అక్టోబర్ 13న ప్రారంభం కానుంది. అక్టోబర్ 15న ఉదయం 11:30 గంటలకు అధికారిక ప్రారంభోత్సవం జరుగుతుంది. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లకు సమాంతరంగా ఈ కార్యక్రమం జరగనుంది. 

సందర్శకులు.. పంజాబ్‌కు చెందిన ఫుల్కారీ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పష్మీనా.. తెలంగాణకు చెందిన ఇకత్, తేలియా చేనేత వస్త్రాలు.. మిజోరంకు చెందిన పౌంచెయ్ వంటి ప్రాంతీయ కళాత్మక ఉత్పత్తులను ఇక్కడ చూడొచ్చు. వీటితో పాటు మీనాకారీ, ధోక్రా కళారూపాలు, ఇత్తడి రాగి పనులు, చెక్క కళాఖండాలు, సంప్రదాయ పెయింటింగ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా లభించే ప్రాంతీయ వంటకాలు, ఇంటి తరహా రుచులను ఆస్వాదించొచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి, కొనుగోలుదారులతో అనుసంధానం కావడానికి, ఈ-సరస్ వేదిక ద్వారా తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్లకు తీసుకెళ్లడానికి ఈ మేళా ఒక అనుసంధాన వేదికగా పనిచేస్తుంది.

సామాజిక ఆర్థిక సాధికారతను సాధించేందుకు సంస్థల భాగస్వామ్యంతో సామూహిక భాగస్వామ్యం నుంచి వ్యాపారాలు, మార్కెట్ యాక్సెస్, సుస్థిరమైన ఆదాయం వైపు పయనిస్తున్న మహిళల ప్రయాణాన్ని తెలియజేసే 'లఖ్‌పతి దీదీ పెవిలియన్' ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సందర్శకులు ఈ విజయగాథల వెనుక ఉన్న మహిళల అనుభవాలను నేరుగా తెలుసుకునే అవకాశాన్ని కూడా ఈ పెవిలియన్ కల్పిస్తుంది.

ఈ భాగస్వామ్యం ఉత్పత్తుల ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకుండా మరింత విస్తరించింది. 'నాలెడ్జ్ పెవిలియన్' ద్వారా మహిళలు బ్రాండింగ్, మార్కెటింగ్, ప్యాకేజింగ్, వ్యాపారాభివృద్ధి, మార్కెట్ విస్తరణ వంటి రంగాల్లో కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమ నిపుణులు, సంబంధిత సంస్థలతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. 'కన్వర్జెన్స్ పెవిలియన్' మహిళా పారిశ్రామికవేత్తలను వారి వ్యాపార పురోగతికి తోడ్పడే వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, సహాయక సంస్థలతో అనుసంధానిస్తుంది.

సందర్శకులు 'డెమో పెవిలియన్' వద్ద చేనేత దుస్తుల నేత, హస్తకళల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనలను స్వయంగా చూడొచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తూ గ్రామీణ భారతీయ మహిళల సామర్థ్యాన్ని, పారిశ్రామిక స్ఫూర్తిని చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించొచ్చు. జాతీయ సరస్ మేళా 2026లో ప్రతిష్ఠాత్మకంగా నిలవనున్న 16 అడుగుల ‘శక్తి - ది స్పిరిట్ ఆఫ్ లఖ్‌పతి దీదీ’ ప్రత్యేక శిల్ప కళారూపం..  భారతదేశపు సుసంపన్న హస్తకళలను కాపాడుతూ తమ నైపుణ్యాలను జీవనోపాధిగా, స్వాలంబనగా, సమృద్ధిగా మలచుకుంటున్న కోట్ల మంది మహిళల సామూహిక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రథమ జాతీయ సరస్ మేళాకు నాబార్డ్, ఎన్ఐఆర్‌డీపీఆర్ వంటి వివిధ ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలు మద్దతు అందిస్తున్నాయి. ఈ మేళాలోని ఫుడ్ కోర్ట్‌లో ఏర్పాటు చేయనున్న 50 ఆహార స్టాళ్లలో దేశవ్యాప్త రుచులు, ప్రత్యేకాహారాలు అందుబాటులో ఉంటాయి.

మొత్తంగా చెప్పాలంటే.. జాతీయ సరస్ మేళా అనేది కేవలం ఉత్పత్తులు, కళలు, వ్యాపారాల గురించి మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మహిళల సాధికారతను, నైపుణ్యం నుంచి వ్యాపారం వైపు, వ్యాపారం నుంచి మార్కెట్ వైపు, మార్కెట్ నుంచి సుస్థిరమైన జీవనోపాధి వైపు వారు సాగిస్తున్న విజయవంతమైన ప్రయాణాన్ని తెలియజేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2322598) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Telugu_Vw