నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పీఎం–సేతు పరిధిలో సూరత్, విశాఖపట్నం క్లస్టర్ల కోసం షేర్‌హోల్డర్ అగ్రిమెంట్లపై సంతకాలు: తొమ్మిది ప్రభుత్వ ఐటీఐలను మెరుగుపరిచేందుకు రూ.440 కోట్లకు ఆమోదం
పీఎం–సేతు పరిధిలో ఐటీఐల్లో పరిశ్రమ ఆధారిత మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్న ఏఎం/ఎన్ఎస్ ఇండియా
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 1:54PM by PIB Hyderabad
భారతదేశ ఐటీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఎఎం/ఎన్ఎస్ ఇండియా)తో భాగస్వామ్యం ద్వారా గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఐటీఐలను మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం–సేతు) పథకం పరిధిలో షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్లపై (ఎస్‌హెచ్ఏలు) సంతకాలు పూర్తయ్యాయి.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ), గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఏఎం/ఎన్ఎస్ ఇండియా మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇవి నిర్దేశించిన రెండు క్లస్టర్ల కోసం ఆ రెండు రాష్ట్రాల్లో ఆమోదించిన వ్యూహాత్మక పెట్టుబడి పథకాల (ఎస్ఐపీ) అమలుకు మార్గం సుగమం చేశాయి.
గుజరాత్‌లోని సూరత్‌లో అయిదు ప్రభుత్వ ఐటీఐలతో కూడిన క్లస్టర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నాలుగు ప్రభుత్వ ఐటీఐలతో కూడిన మరో క్లస్టర్‌కు ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఇది పీఎం–సేతు అమల్లో మరో ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. బలమైన పారిశ్రామిక భాగస్వామ్యం, అంతర్జాతీయ స్థాయి శిక్షణ వసతుల ద్వారా భారతదేశ ఐటీఐ వ్యవస్థను మార్చడమే ఈ ఒప్పందం లక్ష్యం.
ఆమోదించిన ప్రాజెక్టులను అమలు చేయడానికి పారిశ్రామిక భాగస్వామి, కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేసేందుకు అవసరమైన విధివిధానాలు ఎస్‌హెచ్ఏలపై సంతకాల చేయడం ద్వారా అధికారికంగా ఏర్పాటయ్యాయి. ఐటీఐ క్లస్టర్లను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేకమైన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీలు) ఇప్పుడు ఏర్పాటవుతాయి. వీటిలో ఏఎం/ఎన్ఎస్ ఇండియాకు 51 శాతం వాటా ఉంటుంది. భారత ప్రభుత్వానికి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి 24.5 శాతం చొప్పున భాగస్వామ్యం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ ప్రసంగించారు. ‘‘ఈ ఒప్పందాలపై సంతకాలు చేయడం మాత్రమే మన తుది లక్ష్యం కాదు. మన ఐటీఐల పరివర్తనాత్మక ప్రయాణానికి ఇదే ఆరంభం. ఇటీవల షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి పది దేశాల్లో భారత్ చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ స్కిల్స్ భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే కేంద్రాలుగా పీఎం–సేతు సంస్థలు, ఆకాంక్షాత్మక సంస్థలు ఎదగాలని ఆశిద్దాం. మౌలిక వసతులను మెరుగుపరచడమే కాకుండా నైపుణ్య రంగంలో ఆకాంక్షలను, నాణ్యతను, ఫలితాలను మెరుగుపరచడమే మన లక్ష్యం కావాలి’’ అన్నారు.
భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాల కోసం పారిశ్రామిక–విద్యాసంస్థల సహకారం
తన విద్య, సాంకేతిక భాగస్వామి అయిన న్యూ ఏజ్ మేకర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నామ్‌టెక్) సహకారంతో ఈ ప్రాజెక్టును ఏఎం/ఎన్ఎస్ ఇండియా అమలు చేస్తుంది. తయారీ నైపుణ్యానికి, పారిశ్రామిక అంశాలకు సంబంధించిన సహకారాన్ని ఏఎం/ఎన్ఎస్ అందిస్తుంది. పాఠ్యాంశాల విస్తరణ, శిక్షణ పరమైన సంస్కరణలు, బోధనా సిబ్బంది నైపుణ్యాల అభివృద్ధి, విద్యాపరమైన ఆవిష్కరణలకు నామ్‌టెక్ సహకారం అందిస్తుంది.
ప్రణాళికాబద్ధమైన చర్యలు:
-
శిక్షణ వసతులు, వర్కుషాపులు, ప్రయోగశాలల ఆధునికీకరణ
-
అత్యాధునికమైన, పారిశ్రామిక అవసరాలకు తగిన విభాగాలను, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం
-
అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న పాఠ్యాంశాలను మెరుగుపరచడం
-
బోధకుల శిక్షణ, సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడం
-
అభ్యర్థులకు ప్రత్యక్ష, ప్రయోగాత్మక శిక్షణావకాశాలను విస్తరించడం.
ఐటీఐ పట్టభద్రుల్లో శిక్షణ నాణ్యతను, ఉపాధి అవకాశాలను, పరిశ్రమ అవసరాలకు తగిన సన్నద్ధతను ఈ చర్యలు మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు.
పీఎం–సేతు పరిధిలో ప్రధాన పరిశ్రమ ఒప్పందం
సూరత్, విశాఖపట్నం క్లస్టర్లు రెండింటికీ కలిపి రూ.440 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. దీనిలో సూరత్ క్లస్టర్‌కు రూ.240 కోట్లు, విశాఖపట్నం క్లస్టర్‌కు రూ.200 కోట్లను కేటాయించారు.
ఇప్పటివరకు పీఎం–సేతు పథకం పరిధిలో ఆమోదం పొందిన అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడి హామీల్లో ఏఎం/ఎన్ఎస్ ఇండియా నేతృత్వంలోని ప్రాజెక్టులు ఒకటిగా నిలుస్తున్నాయి. ఈ పథకం పరిధిలోని తొలి 14 వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక (ఎస్ఐపీ)ల్లో ప్రతిపాదించిన మొత్తం పెట్టుబడి రూ.3,446 కోట్లకు ఆమోదం లభించింది.
పీఎం–సేతు గురించి
మొత్తం రూ.60,000 కోట్ల పెట్టుబడితో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీఎం–సేతు పథకాన్ని అమలు చేస్తోంది. బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలు, సంస్థాగత సంస్కరణల ద్వారా దేశ వృత్తి విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను మెరుగుపరరుస్తారు. అయిదు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్‌టీఐ)లను బలోపేతం చేస్తారు.






***
(రిలీజ్ ఐడి: 2322303)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8