ఆర్థిక మంత్రిత్వ శాఖ
4.2 టన్నులకు పైగా పాపీ స్ట్రాను స్వాధీనం చేసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) ఎంపీ యూనిట్: ముగ్గురి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
11 OCT 2026 10:48PM by PIB Hyderabad
మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా మధ్యప్రదేశ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) యూనిట్ గత వారంలో రెండు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది. ఫలితంగా 4,209.80 కిలోల పాపీ స్ట్రాను స్వాధీనం చేసుకుంది. దీనితో పాటు రెండు వాహనాలను, కవర్ కార్గోగా ఉపయోగించిన 100 బస్తాల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం–1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం ముగ్గురిని అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్నవి:
-
స్వాధీనం చేసుకొన్న మొత్తం పాపీ స్ట్రా: 4,209.80 కేజీలు
-
స్వాధీనం చేసుకొన్న వాహనాలు: 02 (ఒక టాటా ట్రక్కు, ఒక కంటెయినర్ ట్రక్కు)
-
కవర్ కార్గోగా ఉపయోగించిన గోధుమ బస్తాలు: 100
-
అదుపులోకి తీసుకున్న వ్యక్తులు: 03
సీబీఎన్ నీమచ్ అధికారులు 05.10.2026న అందిన నిర్దిష్ట సమాచారం మేరకు ఉదయ్‌పూర్–చిత్తోర్‌గఢ్ జాతీయ రహదారిపై హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక కంటైనర్ ట్రక్కును అడ్డగించారు. వాహనాన్ని తనిఖీ చేయగా, వివిధ రంగుల్లో ఉన్న 39 ప్లాస్టిక్ సంచుల కింద దాచి ఉంచిన 929.08 కిలోల పాపీ స్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ముక్కలు చేసిన పాపీ స్ట్రా, ముక్కలు చేయని పాపీ స్ట్రా (యూపీఎస్), పాపీ స్ట్రా పొడి ఉన్నాయి. వాహనాన్ని, నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎన్‌డీపీఎస్ చట్టం–1985లో సంబంధిత నిబంధనల ప్రకారం ఒకరిని అరెస్టు చేశారు.


సీజ్ చేసిన నిషేధిత మత్తుపదార్థాలు, కంటెయినర్ ట్రక్కు
నిర్దిష్ట సమాచారం మేరకు 09.10.2026న మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో, గాంధీసాగర్–భాన్‌పురా రహదారిపై రాజస్థాన్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక టాటా ట్రక్కును సీబీఎన్ అధికారులు అడ్డగించారు. గరోత్‌లోని సీబీఎన్ కార్యాలయంలో ఈ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 100 గోధుమ బస్తాల కింద దాచి ఉంచిన 3,280.72 కిలోల పాపీ స్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. పాపీ స్ట్రా, ట్రక్కు, గోధుమ బస్తాలను జప్తు చేశారు. అలాగే ట్రక్కులో ఉన్న ఇద్దరిని ఎన్డీపీఎస్ చట్టం–1985లోని నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.


టాటా ట్రక్కుతో సహా సీజ్ చేసిన నిషేధిత మత్తుపదార్థాలు
రెండు కేసుల్లోనూ, అక్రమంగా తరలిస్తున్న మత్తుపదార్థాల మూలాలను, వాటిని అందుకోవాల్సిన వ్యక్తులు, ఈ అక్రమ రవాణాలో భాగస్వాములైన ఇతర వ్యక్తులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
‘‘డ్రగ్స్ లేదా ఔషధాల సురక్షిత వినియోగాన్ని, దుర్వినియోగాన్ని నివారించడం’’, ‘‘నషా ముక్త భారత్’’ లక్ష్యాల సాధనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) కట్టుబడి ఉంది. అలాగే మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా, దారి మళ్లింపు, దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిఘా ఆధారిత అమలు, నివారణ అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2322099)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10