ప్రధాన మంత్రి కార్యాలయం
చెన్నైలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
11 OCT 2026 4:21PM by PIB Hyderabad
తమిళనాడు గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ ఎల్. మురుగన్ గారు, శ్రీ నైనార్ నాగేంద్రన్ గారు, నా తమిళ సోదరీసోదరులందరికీ... వణక్కం.
చెన్నైలో మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తమిళనాడు చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన రోజు. నేటి కార్యక్రమంలో పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. మేం ఇప్పటికే పూర్తయిన అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాం. కొత్త వాటికి శంకుస్థాపన చేస్తున్నాం. వీటిలో కొన్ని ప్రాజెక్టులు రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. మరికొన్ని పరిశ్రమలను, వాణిజ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవన్నీ కలిసి తమిళనాడు వ్యాప్తంగా యువతకు ఉద్యోగాలను అందిస్తాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు.
ఈ రోజు పవిత్రమైన నవరాత్రి పండగ ప్రారంభం. శివశక్తుల పవిత్ర భూమి అయిన తమిళనాడులో ఈ నవరాత్రి శుభ సందర్భంగా... ఈ కార్యక్రమానికి ముందు నేనూ జలకండేశ్వర ఆలయంలో శివ భగవానుడి ఆశీస్సులు అందుకునే అదృష్టాన్ని పొందాను. తమిళనాడులోని ఈ పుణ్యక్షేత్రం నుంచి, దేశ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు భారతరత్న జయప్రకాష్ నారాయణ్, భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్ గార్ల జయంతి. ఈ ఇరువురు మహనీయుల జీవితాలు దేశ సేవ పట్ల మరింత అంకితభావంతో పనిచేయడానికి మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ వేదిక నుంచి, ఈ ఇద్దరు మహనీయులకు నేను సగౌరవంగా నివాళులర్పిస్తున్నాను.
మిత్రులారా,
కొద్ది రోజుల కిందట, నాకు ఐఐటీ మద్రాస్‌లోని బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించే అవకాశం లభించింది. ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు ప్రజారోగ్య రంగంలో ఎన్నో కొత్త అవకాశాలను సృష్టించగలవు. ఈ సందర్శనతో పాటు, చెన్నై మెట్రోలోని మరో భాగాన్ని ప్రజలకు అంకితం చేసే అవకాశం నాకు లభించింది.
మిత్రులారా,
దేవాలయాల నుంచి మెట్రో వరకు, తమిళనాడులోని ఈ అనుభవాలు నేటి భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. భారత్ తన సాంస్కృతిక బలం నుంచి స్ఫూర్తి పొంది, శాస్త్రీయ పురోగతితో ముందుకు సాగుతూ, ఆధునిక మౌలిక సదుపాయాల ద్వారా కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. మన వారసత్వం, భవిష్యత్తుపై మన ఆకాంక్షలు కలిసి ముందుకు సాగుతున్నాయి.
మిత్రులారా,
కొన్ని రోజుల కిందటే... మీ ఆశీస్సులు, దేశ ప్రజల ప్రేమాభిమానాల కారణంగా నేను ప్రభుత్వ అధిపతిగా ఇరవై అయిదు సంవత్సరాల ముఖ్యమైన ప్రస్థానాన్ని అధిగమించాను. 2001 అక్టోబరులో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి, దేశ ప్రజలు నాకు మొదట ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఇరవై అయిదు సంవత్సరాల్లో, ప్రజాస్వామ్యంలోని రెండు బలాలపై నా విశ్వాసం నిరంతరం బలపడింది. మొదటిది - దేశ ప్రజలు. రెండోది - సహకార సమాఖ్యవాదం. రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందనే మంత్రాన్ని నేను ఎల్లప్పుడూ అనుసరిస్తూ వచ్చాను.
మిత్రులారా,
ముఖ్యమంత్రిగా, రాష్ట్రాల ఆకాంక్షలను వ్యక్తిగతంగా నేను అర్థం చేసుకున్నాను. ప్రధానమంత్రిగా నేను ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నించడమే కాకుండా... ప్రతి రాష్ట్రం తన సొంత లక్ష్యాలను సాధించేలా చూసేందుకూ అన్ని విధాలా కృషి చేశాను.
మిత్రులారా,
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు కరుణానిధి గారితో, అమ్మ జయలలిత గారితో అనేకసార్లు సంభాషించే అవకాశం లభించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... జయలలిత గారు, ఓ. పన్నీర్‌సెల్వం గారు, ఇ. పళనిస్వామి గారు, ఎం. కె. స్టాలిన్ గార్లతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ప్రభుత్వాలు మారాయి... తమిళనాడు అభివృద్ధి పట్ల, తమిళనాడు ప్రజలకు సేవ చేయడం పట్ల నా నిబద్ధత ఎప్పుడూ చెక్కుచెదరలేదు. ఈ రోజు, అదే నిబద్ధతను కొనసాగిస్తూ మేం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారితో కలిసి తమిళనాడు అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.
మిత్రులారా,
ప్రస్తుతం తమిళనాడులో పట్టణాభివృద్ధి మా ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. పట్టణీకరణ ఒక సవాలు కాదనీ, అదొక అవకాశమని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. ఇందులో ప్రజా రవాణా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రవాణా బాగున్నప్పుడు, అది ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన రవాణాను కల్పించడానికి కేవలం రహదారులను వెడల్పు చేయడం సరిపోదని మనందరికీ తెలుసు. ఆధునిక నగరాల్లో, మనకు సంపూర్ణ మౌలిక సదుపాయాలు అవసరం. గత దశాబ్ద కాలంగా మేం దేశవ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్‌లను భారీగా విస్తరించాం. 2014లో, దేశంలోని కేవలం అయిదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై అయిదు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. 2014లో, భారత మెట్రో నెట్‌వర్క్ సుమారు 250 కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ 1,100 కిలోమీటర్లను దాటింది. చెన్నై మెట్రో విస్తరణతో ఈ నెట్‌వర్క్ మరింతగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. చెన్నైలో నివసించే సాధారణ పౌరులు, ఉద్యోగులు, విద్యార్థులు, వయోవృద్ధులు అందరూ మరింత సులభంగా ప్రయాణించి... తక్కువ సమయంలో తమ ప్రయాణాలను పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని చేపట్టాం.
మిత్రులారా,
మన రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా మనం దేశాన్ని పటిష్టం చేసుకోవాలి. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. తమిళనాడు తయారీ రంగం, దాని చిన్న పరిశ్రమలు, వాటిలో పనిచేసే ప్రతి వ్యక్తి పట్ల ప్రతి భారతీయుడూ గర్వపడతాడు. 'మేక్ ఇన్ ఇండియా' లేదా 'వోకల్ ఫర్ లోకల్' వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు తమిళనాడుకూ ప్రయోజనం చేకూరుస్తున్నాయి.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలోనూ విడిభాగాల నుంచి సాంకేతికత, తుది ఉత్పత్తుల వరకు మొత్తం ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఈ ప్రయత్నాల ఫలితంగా, ఈ రోజు మనం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఉన్నాం. 2014 నుంచి మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పదకొండు రెట్లు పెరిగాయి. మన రక్షణ రంగ ఎగుమతులు యాభై రెట్లు పెరిగాయి. మన ఇంజనీరింగ్ ఎగుమతులూ కొత్త రికార్డులను నెలకొల్పాయి.
మిత్రులారా,
తయారీ రంగంలో వృద్ధి కారణంగా దేశ యువతకు లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. దేశపు తయారీ రంగ వృద్ధిలో తమిళనాడు ప్రజలు ఎంతో ప్రశంసనీయమైన సహకారాన్ని అందించారు. ఈ రోజు, మేం ఒక అధునాతన లూబ్రికెంట్ బేస్ ఆయిల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇది ఇక్కడ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు, దేశ దిగుమతులను తగ్గించడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. బలమైన తయారీ రంగాన్ని నిర్మించడానికి, మనకు మంచి రహదారులు అవసరం. ముడి పదార్థాల రవాణా కోసం మనకు రైల్వేలూ, ఓడరేవులూ అవసరం. అటువంటి మౌలిక సదుపాయాలు నిర్మించినప్పుడు, అది వివిధ స్థాయిల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
నిర్మాణం జరిగినప్పుడు, ఇంజనీర్లకు పని దొరుకుతుంది. సాంకేతిక నిపుణులకూ పని లభిస్తుంది. కార్మికులకూ పని దొరుకుతుంది. అందరికీ ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఉక్కు, పరికరాలకు సంబంధించిన కర్మాగారాలతో పాటు చిన్న కంపెనీల్లోనూ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఒక ప్రాజెక్టు పూర్తయినప్పుడు మెరుగైన అనుసంధానం పరిశ్రమలు, సేవలు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అందుకే ఈ రోజు ప్రారంభించుకుంటున్న రైలు, రహదారుల ప్రాజెక్టులు తమిళనాడు పురోగతికి అత్యంత కీలకమైనవి.
ప్రస్తుతం షిప్పింగ్ రంగం కొత్త శిఖరాలను చేరుకునేలా దేశవ్యాప్తంగా పోర్టు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. ఇందులో తమిళనాడు పాత్ర కీలకంగా ఉంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో... తూత్తుకుడిలోని వీఓసీ పోర్టును ప్రపంచ స్థాయి మెగా కంటైనర్, గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ నౌకలనూ ఇక్కడ సులభంగా నిలపవచ్చు. ఇది తమిళనాడును పరిశ్రమలు, రవాణా రంగాల కోసం ప్రపంచస్థాయి కేంద్రంగా మార్చడానికి సహాయపడుతుంది.
గత కొన్నేళ్లుగా భారతీయ ఓడరేవుల వేగం, సామర్థ్యం రెండూ మెరుగయ్యాయి. వేగం పెరగడం వల్ల, ఓడరేవుల్లో ఓడల టర్న్ఎరౌండ్ సమయం సగానికి తగ్గింది. ఫలితంగా, భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు మునుపటి కంటే వేగంగా ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నాయి.
సముద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మా దార్శనికతలో మన మత్స్యకారులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, అనేక ఇతర పథకాల ద్వారా తమిళనాడుకు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇక్కడ మత్స్య రేవులను ఆధునికీకరిస్తున్నారు. చేపల ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. కోల్డ్ చెయిన్ సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నారు. చేపలను తాజాగా ఉంచడం కోసం రవాణా వాహనాలను కొనుగోలు చేసేందుకూ సహాయం అందిస్తున్నారు.
మిత్రులారా,
మన మత్స్యకారుల కోసం చెన్నై ఫిషింగ్ హార్బర్‌ను ఆధునికీకరించడమైనా... తమిళనాడులో సీవీడ్ పార్కును అభివృద్ధి చేయడమైనా... ఈ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా మత్స్యకారులు ఇప్పుడు నిర్వహణ మూలధనాన్ని మరింత సులభంగా పొందగలుగుతున్నారు. నేడు దేశంలో చేపల ఉత్పత్తి వేగంగా పెరిగింది. గతేడాది, మన సముద్రపు ఆహార ఎగుమతులు... పరిమాణం, విలువ పరంగా ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది మన మత్స్యకారుల కుటుంబాలు, తీరప్రాంత సమాజాల్లో నివసించే ప్రజల జీవితాలను మెరుగుపరిచింది.
మిత్రులారా,
నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహించే తమిళనాడును మేం నిర్మించాలనుకుంటున్నాం. దీనికోసం కేంద్రం నుంచి ఎంతటి మద్దతు అవసరమైనా... మేం పూర్తి నిబద్ధతతో మీకు అండగా ఉంటాం. ‘అభివృద్ధి చెందిన తమిళనాడు ద్వారా అభివృద్ధి చెందిన భారత్’ సంకల్పాన్ని మనమంతా కలిసి సాకారం చేసుకుందాం. ఈ స్ఫూర్తితో, ఈ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నండ్రీ, వణక్కమ్!!!(ధన్యవాదాలు, నమస్కారం).
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2322094)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam