ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబర్ 11న చెన్నైలో పర్యటించనున్న ప్రధాని
చెన్నైలో రూ. 13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంతో పాటు జాతికి అంకితం చేయనున్న ప్రధాని
మెట్రో రైలు, రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పెట్రోలియం, విద్యా రంగాలకు చెందిన ప్రాజెక్టులు
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశలోని పూనమల్లే-వడపళని విభాగాన్ని ప్రారంభించనున్న ప్రధాని
తమిళనాడులో దాదాపు రూ. 3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని
చెన్నై ఓడరేవు, కామరాజర్ ఓడరేవు, వీ.ఓ. చిదంబరనార్ ఓడరేవులలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని
పళని, వేలూరు కంటోన్మెంట్, అంబసముద్రం, పరమకుడి, నామక్కల్‌లలో ఐదు అమృత్ స్టేషన్‌లను ప్రారంభించనున్న ప్రధాని
ఐఐటీ మద్రాస్‌లోని 'సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్'ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
చెన్నైలోని జలకండేశ్వరర్ ఆలయంలో దర్శనం, పూజలు చేయనున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2026 12:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 11న తమిళనాడులోని చెన్నైలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లే బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో ప్రయాణం, తిరుగు ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు చెన్నైలోని జలకండేశ్వరర్ ఆలయంలో ఆయన దర్శనం, పూజలు చేస్తారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్‌లోని బ్రెయిన్ సెంటర్‌ను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో రూ. 13,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
సుమారు రూ. 4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో విడతలోని పూనమల్లే-వడపళని విభాగాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ కారిడార్ ప్రత్యేకంగా 3.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం ఉంది. డ్రైవర్‌రహిత రైళ్ల నిర్వహణకు అనుకూలంగా ఉండేలా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికుల రోజువారీ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని.. చెన్నైలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ఉపనగరాలకు, నగర కేంద్రానికి మధ్య అనుసంధానతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
సుమారు రూ. 3,700 కోట్ల విలువైన కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో రోడ్డు అనుసంధానతను బలోపేతం చేయటంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ఇవి ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయటంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయి.
జాతీయ రహదారి-744లోని 36 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు వరుసల వడుగుపట్టి-తెంకువెంగానళ్లూర్ విభాగాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, పారిశ్రామిక- వాణిజ్య కేంద్రాలకు అనుసంధానతను మెరుగుపరుస్తుంది. అలాగే ప్రజలు, సరుకుల రాకపోకలను సులభతరం చేస్తుంది. దీనితో పాటు ఎన్‌హెచ్-744ఏలోని 30 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల మధురై రింగ్ రోడ్డు విభాగాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ మధురై చుట్టూ ట్రాఫిక్ కదలికలను మెరుగుపరచటంతో పాటు నగరంలో రద్దీని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఎన్‌హెచ్-83లోని నాగపట్నం-తంజావూరు విభాగంలో నాలుగు వరుసల తిరువారూర్ బైపాస్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ తిరువారూర్‌లో రోడ్డు అనుసంధానతను బలపరుస్తుంది. దీనితో పాటు పట్టణం చుట్టూ ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా సాఫీగా ట్రాఫిక్ కదలికలకు వీలు కల్పిస్తుంది.
రూ. 750 కోట్లకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించటంతో పాటు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాంతంలో రైలు అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కారైకల్-పెరాలం రైలు మార్గాన్ని జాతికి అంకితం చేస్తారు. కోయంబత్తూరు, పరిసర ప్రాంతాల్లో మూడు రైలు ఫ్లైఓవర్‌లను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఇవి రద్దీగా ఉండే లెవల్ క్రాసింగ్‌ల వద్ద రద్దీని తగ్గించటంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తాయి. ఇవి ప్రయాణికులకు రోడ్డు భద్రతను మెరుగుపరుస్తాయి. అలాగే 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద పునరాభివృద్ధి చేసిన పళని, వేలూరు కంటోన్మెంట్, అంబసముద్రం, పరమకుడి, నామక్కల్ అనే ఐదు అమృత్ స్టేషన్‌లను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తమిళనాడులో పలు ఓడరేవు సంబంధిత ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
చెన్నై ఓడరేవులో నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఒక నిల్వ కేంద్రం ( పేవ్‌డ్ స్టోరేజ్ యార్డ్), నాలుగు ఎగ్జిమ్ గోడౌన్‌లు, ఆధునికీకరించిన క్రూయిజ్ టెర్మినల్, నావికుల క్లబ్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు సరుకుల నిల్వ, నిర్వహణను మెరుగుపరుస్తాయి.. వేర్‌హౌస్ సామర్థ్యాన్ని పెంచుతాయి.. ఎక్కువ మంది క్రూయిజ్ ప్రయాణికులు ఏకకాలంలో ఎక్కడానికి, దిగడానికి వీలుగా ప్రయాణికుల సౌకర్యాలను ఆధునికీకరిస్తాయి.. సందర్శనకు వచ్చే నావికులు, సముద్రయాన సిబ్బంది కోసం ఆధునిక సంక్షేమ, వినోద, సహాయక సదుపాయాలను అందిస్తాయి. వీ.ఓ. చిదంబరనార్ ఓడరేవులో ఎనిమిది ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు కార్గో, కంటైనర్ సామర్థ్యాన్ని విస్తరిస్తాయి. ఇవి స్వచ్ఛమైన సముద్ర ఇంధన మార్పిడికి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మిస్తాయి. అంతేకాకుండా ఓడరేవుల రంగంలో కార్గో తరలింపు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. కామరాజర్ ఓడరేవులో కోల్ బెర్త్-3 ప్రాజెక్ట్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇక్కడ కంటైనర్ టెర్మినల్ మొదటి దశ, రెండో దశ కోసం కోసం చేపట్టే పూడికతీత (క్యాపిటల్ డ్రెడ్జింగ్) పనులకు శంకుస్థాపన చేస్తారు.
చెన్నైలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన మనాలీ రిఫైనరీలో గ్రూప్ II/III లూబ్ ఆయిల్ బేస్ స్టాక్స్ (ఎల్ఓబీఎస్) ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ. 1,620 కోట్ల వ్యయంతో సంవత్సరానికి 270 వేల మెట్రిక్ టన్నుల (టీఎంటీపీఏ) సామర్థ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ భారత్‌లో ప్రపంచ స్థాయి, ప్రీమియం నాణ్యత కలిగిన లూబ్రికెంట్ల తయారీ కోసం గ్రూప్ II/III లూబ్ ఆయిల్ బేస్ స్టాక్‌లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఐఐటీ మద్రాస్‌లోని 'సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్'ను (ఎస్‌జీబీసీ) ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. పిండ దశ నుంచి వృద్ధాప్యం వరకు మానవ జీవిత కాలంలో కణాల స్థాయిలో 100కి పైగా మానవ మెదడులను త్రిమితీయ (3డీ) అట్లాస్‌లుగా మ్యాప్ చేయడానికి ఉద్దేశించిన ప్రపంచ శాస్త్రీయ మిషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురైన మెదడు నుంచి సేకరించిన 1,000కి పైగా ఉల్లేఖించిన (అన్నోటేటెడ్) సూక్ష్మదర్శిని విభాగాలతో కూడిన ప్రత్యేకమైన మానవ ఇస్కీమిక్ స్ట్రోక్ అట్లాస్ 'సీ-స్ట్రోక్'ను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఈ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు కొత్త చికిత్సా మార్గాలను గుర్తించడానికి సహాయపడుతుంది.
చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సంస్థ విద్యారంగానికి అందించిన ఐదు దశాబ్దాల సేవలను, విద్యాపరమైన రాణింపు, క్రమశిక్షణ, సాంస్కృతిక విలువలు, సమగ్ర విద్య ద్వారా తరతరాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో దాని పాత్రను ఈ స్వర్ణోత్సవం తెలియజేస్తుంది. "సా విద్య యా విముక్తయే" (విముక్తిని ప్రసాదించేదే విద్య) అనే నినాదంతో నడిచే ఈ పాఠశాల సమాజానికి సార్థకమైన సేవనందించే వ్యక్తులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. కాలక్రమేణా మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతూనే ఈ సంస్థ నైతిక విలువలు, విజ్ఞానం, బాధ్యతాయుతమైన పౌరసత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2321964)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam