ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార శుద్ధి రంగంలో విస్తృత అవకాశాలు; యువత ఉద్యోగాల కోసం

ఎదురుచూసేవారుగా కాకుండా, ఉద్యోగాలు కల్పించేవారిగా మారాలి: శ్రీ చిరాగ్ పాశ్వాన్

నిఫ్టెమ్-కే ఏడో స్నాతకోత్సవంలో 260 మంది విద్యార్థులకు పట్టాలు.. ప్రతిభావంతులైన 8మందికి బంగారు పతకాలు

భారతీయ ఉత్పత్తుల నాణ్యతతోనే బ్రాండ్ ఇండియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: చిరాగ్ పాశ్వాన్

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 5:59PM by PIB Hyderabad

దేశంలో ఆహార శుద్ధి రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, ఉపాధి కల్పన, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం, అంతర్జాతీయంగా భారత్‌ ప్రాధాన్యాన్ని మరింత పెంచడంలో ఈ రంగం కీలక పాత్ర పోషించే సామర్థ్యం కలిగి ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

 

కుండ్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (నిఫ్టెమ్ - కే) ఏడో స్నాతకోత్సవంలో చిరాగ్ పాశ్వాన్ ప్రసంగించారు. పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా మిగిలిపోకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే సృజనకర్తలుగా, సమస్యలకు పరిష్కారాలు చూపే నిపుణులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

ఆహార శుద్ధి రంగంలో గత కొన్నేళ్లలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఈ రంగంలో అపారమైన అవకాశాలు అందుబాటులోకి రావాల్సి ఉందని ఆయన అన్నారు. ఆహార నాణ్యతను మెరుగుపరచడం, ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం, రైతులకు మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించడం, ఉపాధిని పెంచడం, ఆహార వృథాను అరికట్టడం వంటి పలు అంశాల్లో ఈ రంగం ఏకకాలంలో కీలకంగా నిలవగలదని పేర్కొన్నారు.

 

 

భారత్‌లో విస్తృత వ్యవసాయ రంగం, విభిన్న రకాల వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగదారుల భారీ మార్కెట్‌ దేశాన్ని ‘ప్రపంచ ఆహార కేంద్రం’గా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని శ్రీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆహార విలువ శ్రేణులను, శుద్ధి సదుపాయాలను, ఆధునిక సాంకేతికతను వ్యవసాయ క్షేత్రాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా క్షేత్రస్థాయిలోని ఉత్పత్తిదారులకు ఆహార శుద్ధి రంగం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

 

సంప్రదాయ మార్గాలకు పరిమితం కాకుండా విభిన్నంగా ఆలోచించాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఆయన.. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికతను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆహార శుద్ధి రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కొత్త ఆలోచనలు, వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే యువ ఆవిష్కర్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఆహార రంగంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీ చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఉద్ఘాటించారు. భారతీయ ఉత్పత్తి నాణ్యత ఒక సంస్థ ప్రతిష్ఠకే పరిమితం కాదని, అది అంతర్జాతీయ మార్కెట్లలో ‘బ్రాండ్ ఇండియా’కు లభించే గుర్తింపుపైనా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

 

 

ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శి అవినాష్ జోషి మాట్లాడుతూ.. ఆహార వృథాను తగ్గించడం, పోషక విలువలను పెంచడం, ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో ఆహార శుద్ధి రంగం విస్తృత పాత్ర పోషిస్తుందని వివరించారు. నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో విలువను సృష్టించగల ఆలోచనలు, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు, పరిశోధకులు కృషి చేయాలని సూచించారు.

 

నిఫ్టెమ్-కే పాలక మండలి అధ్యక్షుడు డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర మాట్లాడుతూ.. విద్యార్థులు సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యాలు వారి వ్యక్తిగత కెరీర్ అభివృద్ధికే పరిమితం కాకుండా, దేశం, సమాజ ప్రగతికి కూడా దోహదపడాలని ఆకాంక్షించారు.

 

 

ఆహార సాంకేతికత, సురక్షితమైన పోషకాహారం, సుస్థిర ఆహార శుద్ధి, ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని సాధించే దిశగా భారత్‌ ముందుకు సాగేందుకు దోహదపడే విప్లవాత్మక ఆవిష్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు. నిఫ్టెమ్-కేలో పరిశోధనలను విస్తృతం చేయడం, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, నూతన ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

 

నిఫ్టెమ్-కే డైరెక్టర్ డాక్టర్ హరీందర్ సింగ్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. విద్యా బోధన, పరిశోధన, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాల అభివృద్ధిలో సంస్థ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.

 

 

స్నాతకోత్సవంలో మొత్తం 260 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. వీరిలో 140 మంది బీటెక్‌, 78 మంది ఎంటెక్‌, 18 మంది ఎంబీఏ, 24 మంది పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. విద్యా రంగంలో ప్రతిభ, అంకితభావం కనబరిచిన ఎనిమిది మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు.

 

 

విద్యార్థులకు విద్యార్హతలు అందించడంతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ కల్పించడమే నిఫ్టెమ్-కే లక్ష్యమని డాక్టర్ ఒబెరాయ్ తెలిపారు. తద్వారా ఆహార రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సమర్థంగా స్పందించగలరని పేర్కొన్నారు.

 

భారత ఆహార రంగంలో అడుగుపెట్టేందుకు నిపుణులకు ఇదే అత్యంత అనుకూల సమయమని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. సోధి అన్నారు.

ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఆహార రంగానికి సహజంగా ఎక్కువగా ఉంటుందని డాక్టర్ సోధి అన్నారు. వినియోగదారులు ఇతర అవసరాలకు అంతగా ప్రాధాన్యం లేని వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నప్పటికీ, ఆహారం మాత్రం నిత్యావసరంగా కొనసాగుతుందని వివరించారు. 140 కోట్లకు పైగా జనాభా, మారుతున్న ఆహార వినియోగ అలవాట్ల నేపథ్యంలో ఆహార ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే రంగంలో భారత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

 

 

ఆహార పరిశ్రమలో పుట్టుకొస్తున్న అవకాశాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ అగర్వాల్ సూచించారు. ఆహార రంగ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు.

 

నిఫ్టెమ్ - కే పాత్ర విద్యాబోధనకే పరిమితం కాదని వక్తలంతా స్పష్టం చేశారు. పరిశోధన, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం మధ్య సమన్వయానికి వేదికగా నిలుస్తున్న ఈ సంస్థ.. దేశంలో ఆహార శుద్ధి రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, భవిష్యత్తు తరాలకు చెందిన ఆవిష్కర్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2321636) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Urdu