సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రాంతీయ గుర్తింపు నుంచి ఉమ్మడి జాతీయ వారసత్వం వైపు
మధ్యప్రదేశ్ స్థానిక సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవానికి జాతీయ గుర్తింపు తెస్తున్న ప్రధానమంత్రి జ్ఞాపికలు
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 6:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి జ్ఞాపికల 8వ ఈ - వేలంలో ఉంచిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 22 జ్ఞాపికలు కేవలం కళారూపాలు, ఛాయాచిత్రాలు లేదా స్మారక వస్తువుల సమాహారంగా మాత్రమే కాక అంతకుమించి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ జ్ఞాపికలన్నీ రాష్ట్ర సజీవ సాంస్కృతిక వారసత్వానికి దృశ్యరూప ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఇవి సంప్రదాయాలను, చారిత్రక ప్రదేశాలను దేశీయ కళారూపాలతో, పర్యావరణ వారసత్వంతో, ప్రభుత్వ సంస్థలతో, భారత జాతీయ గుర్తింపు పొందిన చిహ్నాలతో అనుసంధానిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 22 మెమెంటోలు ప్రధానమంత్రి జ్ఞాపికల వెనుక ఉన్న ప్రధాన భావనను ప్రతిబింబిస్తున్నాయి. ఒక బహుమతి ఒక నిర్దిష్ట ప్రాంతం, సమాజం లేదా సంప్రదాయం నుంచి ఉద్భవించినదైనా, దాని కథ విశాలమైన జాతీయ సాంస్కృతిక జ్ఞాపకంలో భాగంగా మారవచ్చని ఇవి చాటిచెబుతున్నాయి.
ప్రాంతాలు, ప్రజలు, సంప్రదాయాల ద్వారా ఆవిష్కృతమైన రాష్ట్ర విశిష్టత
ఈ జ్ఞాపికల సమాహారం మధ్యప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తోంది. ఉజ్జయిని, ఖజురహో మొదలుకొని ఉదయగిరి, మహేశ్వర్, షాజాపూర్, నీమచ్, ఖాండ్వా, సంజయ్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న ఈ సేకరణ ఆ రాష్ట్ర బహుముఖ గుర్తింపును సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ జ్ఞాపికలలోని ముఖ్యమైన వాటిలో ఖజురహోలోని కందరీయ మహాదేవ్ ఆలయానికి చెందిన చిన్న లోహ నమూనా ఒకటి. ఇది మధ్యప్రదేశ్ లోని అత్యంత ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన ఈ ఆలయ నిర్మాణ, శిల్పకళా వైభవాన్ని ఆధునిక రూపంలో ఆవిష్కరిస్తోంది. అదేవిధంగా, ఉదయగిరి గుహల నుంచి విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ప్రతిబింబించే మరో జ్ఞాపిక, రాష్ట్ర పురాతన శిల్పకళా వారసత్వంతో వర్తమానాన్ని అనుసంధానిస్తోంది.
దేశ మేధో, సామాజిక ప్రగతికి బాటలు వేసిన ప్రముఖుల స్మారకాలను కూడా ఈ సేకరణ తనలో పదిలపరుచుకుంది. ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ న్యాయకోవిదుడు, సామాజిక సంస్కర్త డాక్టర్ హరిసింగ్ గౌర్ ప్రతిమ ఇందులో ప్రధానమైనది. మధ్యప్రదేశ్ ప్రజా జీవితంలో విద్యా వ్యవస్థ విస్తరణకు, మహోన్నత సంస్థల నిర్మాణానికి ఆయన అందించిన అసమాన సేవలకు ఈ విగ్రహం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
మహేశ్వర్ కోట, నర్మదా నదీ తీరంలోని ఘాట్ల మనోహరమైన దృశ్యంతో కూడిన ఫ్రేమ్ చేసిన ఛాయాచిత్రం మధ్యప్రదేశ్ ప్రాచీన నిర్మాణ నైపుణ్యానికి, చారిత్రక శోభకు అద్దం పడుతోంది.
సజీవంగా విలసిల్లుతున్న వారసత్వం
సాంస్కృతిక వారసత్వం గత కాలపు ప్రాచీన నిర్మాణాలు లేదా కట్టడాల పరిధికి మాత్రమే పరిమితమైనది కాదనే సత్యాన్ని ఈ సేకరణ స్పష్టం చేస్తోంది. వర్తమాన సమాజాల విశ్వాసాలు, జీవన శైలి, సజీవ కళారూపాలు, ప్రకృతి సిద్ధమైన భౌగోళిక విస్తృతుల ద్వారా అది నేటికీ నిరంతరం పునర్జీవిస్తూనే ఉంది.
దీనికి గోండ్ జీవన వృక్షం చిత్రలేఖనాలు ఒక ముఖ్యమైన నిదర్శనం. సాంప్రదాయ గోండ్ చిత్రకళా శైలిలో రూపొందిన ఈ కళారూపాలు, దేశీయ గిరిజన దృశ్య రూపాలను జాతీయ సేకరణలోకి తీసుకువస్తున్నాయి. సమాజ ఆధారిత సాంప్రదాయ కళలు కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యక్తీకరణ రూపాలను ఎలా సంతరించుకుంటున్నాయో ఇవి స్పష్టంగా నిరూపిస్తాయి.
ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి దివ్య రూపాలు, షాజాపూర్ మా రాజరాజేశ్వరి, నీమచ్ మహామాయ భద్వా మాతాజీ, అలాగే ఖాండ్వాలోని శ్రీ దాదాజీ ధూనీవాలే మందిరాలకు చెందిన చిత్రాలు, ప్రతిమలు ఈ సేకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవితంలో ఇక్కడి ఆధ్యాత్మిక సంప్రదాయాలు, పవిత్ర క్షేత్రాలు నేటికీ ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో ఇవి స్పష్టం చేస్తున్నాయి.
ప్రాంతీయ అస్తిత్వం నుంచి ఉమ్మడి జాతీయ భావన వైపు
ఈ సేకరణ కేవలం ఒక ప్రాంతీయ పరిధికి లేదా స్థానిక గుర్తింపునకు మాత్రమే పరిమితం కాలేదు. అంతకుమించి విస్తృతమైన భారతీయ సమగ్రతను, జాతీయ దృక్పథాన్ని చాటిచెప్పే దిశగా సాగింది.
అశోక చక్రం, జాతీయ చిహ్నాల సమ్మేళనంతో రూపుదిద్దుకున్న అశోక సింహతల దారు శిల్పం (వుడెన్ మోడల్), మధ్యప్రదేశ్ కు చెందిన స్థానిక హస్తకళా నైపుణ్యానికి, భారత జాతీయ అస్తిత్వ ప్రాశస్త్యానికి మధ్య ఒక విశిష్ట అనుబంధాన్ని ఏర్పరుస్తోంది. దీనితో పాటు, ప్రదర్శనలో నిలిచిన 'ఆత్మనిర్భర్ భారత్ జన సంపర్క్ మహా అభియాన్' స్మారక పోస్టర్ దేశ ప్రజా జీవితంలో చోటుచేసుకుంటున్న వర్తమాన అభివృద్ధి పరిణామాలను చాటిచెబుతోంది.
ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ - వేలం చొరవ ఈ సంస్కృతి ప్రయాణానికి ఒక ప్రజామోదయోగ్యమైన రూపాన్ని అందిస్తోంది. ఒక బహిరంగ కార్యక్రమంలో బహుకరించిన జ్ఞాపిక అనేది మొదట ఒక వ్యక్తిగత అభిమానానికి లేదా ప్రాంతీయ గుర్తింపునకు సంకేతంగా ప్రారంభమవుతుంది. అయితే ఈ - వేలం ద్వారా ఇది విశాలమైన ప్రజా బాహుళ్యంలోకి ప్రవేశించి, ఆ వస్తువుతో, అది మోసుకొచ్చే కథనంతో ప్రజలు మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ప్రతి జ్ఞాపిక తన స్థానిక స్వభావాన్ని పదిలపరుచుకుంటూనే, భారత ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఒక విస్తృత కథనంలో భాగస్వామ్యమవుతోంది.
ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ - వేలం ప్రారంభమైనప్పటి నుంచి, ప్రధానికి వివిధ సందర్భాల్లో లభించిన వేలాది బహుమతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా లభించిన నిధులను 'నమామి గంగే' కార్యక్రమానికి కేటాయిస్తున్నారు.
ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ - వేలం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతుండగా, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఈ - వేలం ప్రక్రియ గడువును 2026 అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఈ - వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు అధికారిక ఈ - వేలం పోర్టల్ https://pmmementos.gov.in లో తమ ఆన్‌లైన్ బిడ్లను సమర్పించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2321015)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5