సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నేడు ఆర్థిక చేయూత - రేపు స్వయం సమృద్ధి
నేడు ఆర్థిక చేయూత - రేపు స్వయం సమృద్ధి
ఆర్థిక స్వావలంబన వైపు మణికళా దుర్గ ప్రయాణం
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 6:00PM by PIB Hyderabad
జీవనోపాధి కోసం సకాలంలో అందే ఆర్థిక సహాయం ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి మార్పు తీసుకురాగలదో గుంటూరుకు చెందిన శ్రీమతి మణికళా దుర్గ ప్రయాణం చాటిచెబుతోంది. ఆదాయాన్ని పెంచుకోవడం, కుటుంబ ఆర్థిక భద్రతను బలోపేతం చేసుకోవడం, మరింత గౌరవప్రదమైన జీవితం గడపడం, స్వావలంబన సాధించడం వంటి లక్ష్యాలకు ఆర్థిక సహాయం తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు సుస్థిర జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ఇటువంటి సహాయం కీలకంగా నిలుస్తుంది.
39 ఏళ్ల శ్రీమతి మణికళా దుర్గ షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) వర్గానికి చెందినవారు. గత 15 ఏళ్లుగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వ్యర్థాల సేకరణ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు చిన్నతనంలో పాఠశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో నిరక్షరాస్యురాలిగా మిగిలిపోయారు. ఇన్నాళ్లూ ఆమె జీవనోపాధి ప్రధానంగా వ్యర్థాల సేకరణపైనే ఆధారపడి ఉండేది. ఈ పని ద్వారా నెలకు సుమారు రూ.8,000 మాత్రమే ఆదాయం వచ్చేది. పరిమిత ఆదాయంతో కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు పిల్లలకు మెరుగైన అవకాశాలు కల్పించడం ఆమెకు సవాలుగా ఉండేది.
ఈ పరిస్థితుల్లో మణికళా దుర్గతో పాటు మరో ముగ్గురు సభ్యులకు నేషనల్ సఫాయి జాతీయ పారిశుధ్య కార్మికుల ఆర్థిక, అభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ)కు చెందిన స్వచ్ఛతా ఉద్యమి యోజన (ఎస్‌యూవై) కింద నవజీవన్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందింది. బహిరంగ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులకు ఉపయోగించే డీ-సిల్టింగ్ మెషీన్ (బ్యాక్‌హో బకెట్‌తో కూడిన ఎక్స్‌కవేటర్) కొనుగోలు చేసేందుకు ఈ సహాయాన్ని ముందస్తు మూలధన సబ్సిడీ రూపంలో అందించారు.ఈ బృందం చేపట్టిన ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.35,03,500. ఇందులో రూ.21,27,624 రుణం కాగా.. రూ.13,75,876 మూలధన సబ్సిడీగా ఉంది. ఈ ఆర్థిక సహాయం 2023 జూన్ 19న అందింది.
అందిన సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మణికళా దుర్గ నెలకు సుమారు రూ. 8,000 అదనపు ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించారు. ఫలితంగా గతంలో సుమారు రూ.8,000గా ఉన్న ఆమె నెలవారీ ఆదాయం ఇప్పుడు దాదాపు రూ.16,000కు చేరుకుంది. ఆదాయం రెట్టింపు కావడంతో కుటుంబ అవసరాలను తీర్చే సామర్థ్యం మెరుగుపడటంతో పాటు, మరింత స్థిరమైన, భద్రమైన రీతిలో కుటుంబాన్ని ఆదుకునే అవకాశం ఆమెకు లభించింది.
స్వచ్ఛతా ఉద్యమి యోజన (ఎస్‌యూవై) కింద అందిన ఆర్థిక సహాయం శ్రీమతి దుర్గ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, మరింత సుస్థిరమైన జీవనోపాధిని కొనసాగించే అవకాశాన్ని కల్పించింది. ఆదాయాన్ని పెంచుకునే సామర్థ్యం పెరగడంతో ఆమె ఆర్థిక భద్రత, ఆత్మవిశ్వాసం మరింత బలోపేతమయ్యాయి. అదే సమయంలో కుటుంబ సంక్షేమానికి, పిల్లల విద్య, భవిష్యత్తుకు మరింత సమర్థవంతంగా తోడ్పడే అవకాశం ఆమెకు లభించింది.
శ్రీమతి దుర్గ తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ.. “ఈ ఆర్థిక సహాయం నా ఆదాయాన్ని పెంచుకోవడానికి, నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎంతో దోహదపడింది. దీనివల్ల నాకు మరింత ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం లభించడంతో పాటు, నా పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు కృషి చేసే అవకాశం లభించింది” అని తెలిపారు.
శ్రీమతి మణికళా దుర్గ ప్రయాణం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులకు సకాలంలో అందించే ఆర్థిక సహాయం, జీవనోపాధి మద్దతు వారి ఆదాయాన్ని పెంచుకుని ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయడానికి ఎలా దోహదపడతాయో చూపిస్తోంది. సకాలంలో అందిన ఆర్థిక సహాయం ద్వారా సుస్థిర జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, కుటుంబాలను బలోపేతం చేయడం, మరింత గౌరవప్రదమైన, స్వావలంబనతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడటం సాధ్యమవుతుందని ఆమె అనుభవం చాటిచెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2320447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6