రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం
ఇండియా కెమ్-2026 14వ ఎడిషన్ ను ప్రారంభించిన రసాయనాలు, ఎరువుల కేంద్ర సహాయమంత్రి అనుప్రియా పటేల్
భారత ఆర్థికశాఖ కీలక వృద్ధి శక్తిగా రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగం: అనుప్రియా పటేల్
అక్టోబర్ 22 నుంచి 24 వరకు ముంబయిలో ఇండియా కెమ్-2026 కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 10:13PM by PIB Hyderabad
రసాయనాలు, పెట్రోకెమికల్స్ పరిశ్రమకు సంబంధించి రెండేళ్లకోసారి జరిగే ఇండియా కెమ్-2026 వేడుక 14వ ఎడిషన్‌ను రసాయనాలు, ఎరువుల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 22 నుంచి 24 వరకు ముంబయిలో జరుగుతుంది.
న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో శ్రీమతి అనుప్రియా పటేల్ మాట్లాడారు. భారత్‌ను స్వావలంబన దేశంగా మార్చేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఈ పరిశ్రమకు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి శక్తిగా రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగం మారుతుందని మంత్రి అన్నారు. 2040 నాటికి భారతదేశాన్ని బ్యాటరీ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, సెమీకండక్టర్ కెమికల్స్‌కు ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్రిటికల్ మినరల్ మిషన్, రేర్ ఎర్త్ కారిడార్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్, ఎఫ్‌డీఐ సంస్కరణలతో కీలక జాతీయ కార్యక్రమాలను అనుసంధానించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
భవ్య రసాయన పథకం గురించి మాట్లాడుతూ… ఈ పథకాన్ని కేవలం మౌలిక సదుపాయాల కార్యక్రమంగా కాక, రసాయనాలు, పెట్రోకెమికల్స్ పరిశ్రమలు ఆవిష్కరణలు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, విస్తరణకు తగిన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నంగా చూడాలని మంత్రి తెలిపారు. ఈ పథకం మార్గదర్శకాలు విడుదలైనట్లు తెలిపారు. సకాలంలో ప్రతిపాదనలను సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని పరిశ్రమ వర్గాలను కోరారు.
ఆర్ అండ్ డీపై వ్యయాన్ని పెంచాలని, నూతన సాంకేతికతలను స్వీకరించాలని పరిశ్రమలను మంత్రి కోరారు. రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా ప్రకటించాలని, శాస్త్ర, సాంకేతికత మంత్రిత్వశాఖను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. దీనివల్ల సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ గల రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ స్కీమ్ (ఆర్‌డీఐ) ద్వారా ఈ రంగానికి లబ్ది చేకూరుతుంది. 2040 నాటికి భారత రసాయన రంగాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమం సందర్బంగా రసాయనాలు, పెట్రోకెమికల్స్ శాఖ (డీసీపీసీ) కార్యదర్శి శ్రీ తేజ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ... భారతదేశ ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి రసాయన రంగమే కీలకమని పేర్కొన్నారు.
ఈ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ... భవ్య రసాయన్ పథకం రూపంలో ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు లక్ష్యం త్వరలో సాకారం అవుతుందని డీసీపీసీ కార్యదర్శి తెలిపారు. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునేలా ఈ పార్కుల్లో వినియోగానికి సిద్ధంగా ఉండే మౌలిక సదుపాయాలు, ఇతర అధునాతన వసతులు ఉంటాయని చెప్పారు. రసాయన రంగం వృద్ధి, ఆవిష్కరణ, ప్రపంచవ్యాప్త పోటీతత్వానికి పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లో పెట్టుబడులను పెంచటం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రసాయన, పెట్రోకెమికల్ రంగాన్ని కలుపుతూ దిగుమతి ప్రత్యామ్నాయ వ్యూహాలపై డీపీఐఐటీతో కలిసి ఈ శాఖ పనిచేస్తోందని తెలిపారు.
రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ దీపాంకర్ అరోన్ ఇండియా కెమ్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. 14వ ఎడిషన్‌కు చేరుకున్న ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం... ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు వృద్ధి దిశగా కలిసి పనిచేసేలా బీటుబీ భాగస్వామ్యాలను సులభతరం చేయటమేనని తెలిపారు.
ఫిక్కీ నేషనల్ పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్ కమిటీ ఛైర్మన్, హెచ్‌పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీ, సీఈఓ శ్రీ ప్రభ్ దాస్ మాట్లాడుతూ... ఉత్పత్తిని పెంచుకోవటంపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.
ఫిక్కీ కెమికల్స్ కమిటీ సహాధ్యక్షుడు, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్ ఎండీ శ్రీ ఎస్ గణేశ్ కుమార్ మాట్లాడుతూ... భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందిపుచ్చుకునేందుకు, ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రసాయన పరిశ్రమగా నిలిచే సమర్థత భారతదేశ రసాయన రంగానికి ఉన్నట్లు తెలిపారు.
రసాయనాలు, పెట్రోకెమికల్స్ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) భాగస్వామ్యంతో ఇండియా కెమ్-2026 సదస్సును నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 14వ ఎడిషన్ ద్వారా అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సును నిర్వహిస్తుంది. రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి చెందిన పరిశ్రమల అధిపతులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, అంతర్జాతీయ ప్రతినిధుల వంటి కీలక భాగస్వాములందరికీ ఇది వేదికగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో అగ్రోకెమికల్స్, పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలతో పాటు మౌలిక సదుపాయాలు, పర్యావరణ సమస్యలు, ప్రాసెస్, ప్లాంట్, యంత్రాలపై ప్రత్యేక సదస్సులు జరుగుతాయి. భారత్-యూఎస్, భారత్-ఈయూ, భారత్-రష్యా, భారత్-జపాన్ దేశాల మధ్య ప్రాంతీయ ప్రత్యేక ఫోరమ్స్ కూడా జరుగుతాయి.
"అడ్వాంటేజ్ భారత్: ఎన్ ఎమర్జింగ్ గ్లోబల్ హబ్" ఇతివృత్తంతో జరిగే ఇండియా కెమ్-2026... ప్రపంచ రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగంలో పెరుగుతున్న భారత్ సామర్థ్యాలను, విస్తరిస్తున్న అవకాశాలను ప్రతిబింబిస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2319892)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5