ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఏఐ ప్రతిభా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా

ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ‘ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య’ కార్యక్రమం నిర్వహించిన ఇండియాఏఐ మిషన్

ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా విద్యారంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్న ఇండియాఏఐ మిషన్

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 8:37PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియాఏఐ మిషన్... 2026 అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం (యూఈపీని) నిర్వహించింది. ఏఐపై అవగాహనను బలోపేతం చేయడం, ఏఐ వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ వ్యవస్థలో భాగస్వామ్యానికి అవసరమైన జ్ఞానం, సాధనాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యాలు.

 

మార్చి 2024లో భారత ప్రభుత్వం ఆమోదించిన 'ఇండియాఏఐ మిషన్'... ఆవిష్కరణలను ప్రోత్సహించడం, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి వీలు కల్పించడం, స్వదేశీ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఏఐ ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూడటం ద్వారా కృత్రిమ మేధ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగాలన్న భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతోంది.

 

మిషన్ కీలక స్తంభమైన ఏఐకోశ్... భారత ఏకీకృత డేటా ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. ఇది పరిశోధన, ఏఐ అప్లికేషన్ అభివృద్ధికి తోడ్పడే అధిక-నాణ్యత గల డేటాసెట్‌లు, ఏఐ మోడల్‌లు, టూల్‌కిట్‌లు, బెంచ్‌మార్క్‌లు, ఇతర కీలక వనరులను అందుబాటులో ఉంచుతుంది. ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, విద్యాసంస్థలకు ఈ జాతీయ ఏఐ అసెట్‌లను పరిచయం చేయడంతో పాటు... ఆచరణాత్మక అభ్యాసాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఇండియాఏఐ మిషన్ లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 160 మందికి పైగా విద్యార్థులు... నిపుణుల సెషన్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రయోగాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఏఐకోశ్, విస్తృతమైన ఇండియాఏఐ వ్యవస్థ గురించి వారికి అవగాహన కల్పించేలా ఈ కార్యకలాపాలను రూపొందించారు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు ఏఐకోశ్ ఎంసీపీ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్), ఏఐకోశ్ ఎస్‌డీకే (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్)లనూ పరిశీలించారు. ఇవి వినియోగదారులు సహజ భాషను ఉపయోగించి డేటాసెట్‌లు, ఏఐ మోడళ్లను కనుగొనడానికి వీలు కల్పిస్తాయి. జాతీయ ఏఐ వనరులను పొందడాన్ని సులభతరం చేయడంతో పాటు డెవలపర్లకు, డెవలపర్లు కాని వారికి ఉన్న అడ్డంకులనూ తగ్గిస్తాయి.

 

ఈ కార్యక్రమం గురించి ఇండియాఏఐ మిషన్ డైరెక్టర్ శ్రీ మహమ్మద్ వై. సఫీరుల్లా మాట్లాడుతూ, "ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న మన గౌరవ ప్రధానమంత్రి దార్శనికతతో... ఇండియాఏఐ మిషన్ ఈ నిబద్ధతను దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లకు తీసుకువెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో... మా పనికి మూలస్తంభాలైన 'ప్రజలు, ప్లానెట్, పురోగతి' అనే మూడు సూత్రాలు, భారత ఏఐ వ్యవస్థతో మమేకమవ్వడానికి సిద్ధంగా ఉన్న కొత్త తరం విద్యార్థుల ద్వారా జీవం పోసుకోవడాన్ని మేం చూస్తున్నాం. ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం ద్వారానే మేం ఆ దార్శనికతను ఒక స్పష్టమైన రూపంలోకి తీసుకువస్తున్నాం. భారత ఏఐ ప్రయాణానికి విద్యార్థులు తమ వంతు సహకారం అందించడానికి వీలుగా నిజమైన డేటాసెట్‌లు, నిజమైన మోడల్‌లు, నిజమైన అవకాశాలనూ అందిస్తున్నాం" అని అన్నారు.

 

ఈ సహకారాన్ని స్వాగతిస్తూ, ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ డాక్టర్ కె.వి. కృష్ణారావు ఇలా అన్నారు - "ఏఐకోశ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 'భారత్‌జెన్' వంటి ప్రాథమిక ప్రయత్నాల ఆధారంగా దేశం కోసం జ్ఞానాన్ని పంచుకునే ఒక శక్తిమంతమైన వ్యవస్థను మేం రూపొందిస్తున్నాం. ప్రపంచ స్థాయి ఏఐ పోటీలో ముందంజలో ఉండటానికి, దేశంలో సానుకూల అభివృద్ధిని సాధించేలా ఏఐని సమర్థంగా వినియోగించుకోవడానికి ఏఐకోశ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు అత్యంత ఆవశ్యకం."

 

ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం తదుపరి దశలో భాగంగా... ఏఐకోశ్ ఓపెన్-సోర్స్ కమ్యూనిటీ, ఏఐకోశ్‌లోని ఈ సంస్థ గురించిన సంస్థాగత ప్రొఫైల్ ద్వారా డేటాసెట్‌లను అందించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇప్పటికే ఉన్న డేటాసెట్‌లను మెరుగుపరచడానికి, ప్రజా ప్రయోజన వినియోగ సందర్భాలను పరిష్కరించే ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ ఏఐ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికీ వారిని ప్రోత్సహిస్తారు. విద్యార్థుల నేతృత్వంలోని అత్యుత్తమ కృషిని భవిష్యత్ గుర్తింపు కోసం పరిగణించవచ్చు. ఏఐ అవగాహన, డేటాసెట్ అన్వేషణ నుంచి ఆవిష్కరణలు, వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా ఒక మార్గాన్ని ఇది సృష్టిస్తుంది.

ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం... విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు భారత జాతీయ ఏఐ మౌలిక సదుపాయాలను పరిచయం చేయడం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచడానికి రూపొందించిన దేశవ్యాప్త కార్యక్రమం. ఏఐకోశ్ ప్రస్తుతం 16,000కు పైగా డేటాసెట్‌లు, 350కు పైగా ఏఐ మోడల్‌లు, 200కు పైగా వినియోగ సందర్భాలనూ కలిగి ఉంది. పరిశోధకులు, అంకురసంస్థలు, డెవలపర్‌లు, విద్యార్థులు విశ్వసనీయమైన జాతీయ వనరులను ఉపయోగించి ఏఐ పరిష్కారాలను రూపొందించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 

ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం శక్తిమంతమైన ఏఐ-సంసిద్ధత గల ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించడంలోనూ... దేశం కోసం సమ్మిళిత, బాధ్యతాయుత, ఆవిష్కరణ-ఆధారిత ఏఐ వ్యవస్థను సృష్టించాలన్న ఇండియాఏఐ మిషన్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలోనూ కీలక ముందడుగు అవుతుంది. ఏఐకోశ్ యూనివర్సిటీ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా, ఈ మిషన్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... డేటాసెట్‌లు, మోడల్‌లు, అప్లికేషన్‌లు, పరిశోధన, బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణకు దోహదపడే క్యాంపస్-స్థాయి ఏఐ కమ్యూనిటీలను ప్రోత్సహిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2319878) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English