బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు లభ్యత నుంచి ఇంధన భద్రత దిశగా: విద్యుత్ రంగానికి బొగ్గు , సరాఫరాను బలోపేతం చేస్తున్న సీఐఎల్
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 2:15PM by PIB Hyderabad
భారత్ విద్యుత్ రంగానికి బొగ్గు అంత్యంత కీలకమైనది. గనుల తవ్వకం నుంచి రవాణా, విద్యుత్ ఉత్పత్తి, వినియోగదారులకు విద్యుత్ చేరే వరకు మొత్తం వ్యవస్థలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సరఫరా వ్యవస్థలో బొగ్గులో దాదాపు అయిదింట నాలుగు వంతుల (80 శాతం) భాగాన్ని విద్యుత్ రంగానికే సరఫరా చేసే కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కీలక స్థానంలో ఉంది.
ఇటీవల సీఐఎల్ పనితీరుతో బొగ్గుసరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026-27లో బొగ్గు రవాణా, ముఖ్యంగా విద్యుత్ రంగానికి సరఫరా గణనీయంగా మెరుగుపడింది. బొగ్గు రవాణా సామర్థ్యం పెరగడం, ఉత్పత్తి, రవాణాల మధ్య మెరుగైన సమన్వయం, గనుల వద్ద ఇప్పటికే ఉన్న బొగ్గు నిల్వలను వినియోగించడం ఇందుకు దోహదపడ్డాయి.
ఈ గణాంకాలే వాస్తవాన్ని చెబుతున్నాయి.
బొగ్గు సరఫరాలో వేగం పెరుగుదల
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సీఐఎల్ మొత్తం 384.2 మిలియన్ టన్నుల(ఎంటీ) బొగ్గును సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సరఫరా చేసిన 357 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 27.2 మిలియన్ టన్నులు లేదా 7.6 శాతం అధికం.
రెండో త్రైమాసికంలో ఈ సరఫరా మరింత పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సీఐఎల్ బొగ్గు సరఫరా 186.04 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇదే గత ఏడాది రెండో త్రైమాసికంలో 166.04 మిలియన్ టన్నులుగా ఉంది. ఈసారి 12.05 శాతం వృద్ధి నమోదైంది. దీంతో బొగ్గు సరఫరా పెరుగుదల ఒక్క నెలకే పరిమితం కాకుండా, త్రైమాసికం మొత్తం మరింత స్పష్టంగా కనిపించింది.
సెప్టెంబర్‌లో బొగ్గు సరఫరా మరిత మెరుగైన ఫలితాలను అందించింది. ఆ నెలలో సీఐఎల్ మొత్తం బొగ్గు సరఫరా 61.20 మిలియన్ టన్నులకు పెరిగింది. 2025 సెప్టెంబర్‌లో ఇది 54.40 మిలియన్ టన్నులుగా ఉంది. దీంతో ఈసారి బొగ్గు సరఫరాలో 12.5 శాతం వృద్ధి నమోదైంది.
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో గనుల వద్ద ఉన్న బొగ్గు నిల్వల్లో సీఐఎల్ 63 మిలియన్ టన్నులను సరఫరా చేసింది. దీంతో బొగ్గు సరఫరా పెరగడానికి ప్రస్తుత ఉత్పత్తి మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉన్న బొగ్గు నిల్వలను మెరుగ్గా వినియోగించుకోవడం కూడా దోహదపడిందని అర్థమవుతోంది.
సరఫరా వ్యూహంలో విద్యుత్ రంగానికి కీలక స్థానం
విద్యుత్ రంగం కోణంలో ఈ గణాంకాలను చూస్తే వాటి ప్రాధాన్యం మరింత స్పష్టంగా తెలుస్తుంది.
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో విద్యుత్ రంగానికి సీఐఎల్ సరఫరా చేసిన బొగ్గు పరిమాణం 302.8 మిలియన్ టన్నులుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 285.4 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఈసారి 17.4 మిలియన్ టన్నులు లేదా 6.1 శాతం పెరుగుదల కనిపించింది.
మొత్తం మీద 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సీఐఎల్ సరఫరా చేసిన మొత్తం బొగ్గులో దాదాపు 79 శాతం విద్యుత్ రంగానికే చేరింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాకే సీఐఎల్ పంపిణీ వ్యూహంలో అత్యధిక ప్రాధాన్యం ఉందని ఇది మరోసారి స్పష్టం చేస్తోంది.
రెండో త్రైమాసికం (క్యూ2)లో నమోదైన పనితీరు ఎంతో ప్రత్యేకమైనది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగానికి 148.20 మిలియన్ టన్నుల బొగ్గును సీఐఎల్ సరఫరా చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 133.50 మిలియన్ టన్నులు సరఫరా చేయగా.. ఈసారి 11 శాతం వృద్ధి నమోదైంది.
బొగ్గు సరఫరాలో మెరుగుదల అన్ని స్థాయిల్లో కనిపిస్తోంది. మొత్తం బొగ్గు సరఫరా పెరగడంతో పాటు, విద్యుత్ కేంద్రాలకు చేరుతున్న బొగ్గు పరిమాణం కూడా పెరుగుతోంది.
సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండుకు అనుగుణంగా బొగ్గు సరఫరా
2026 సెప్టెంబర్ సీఐఎల్‌కు అత్యంత మెరుగైన నెలగా నిలిచింది.
విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా 2025 సెప్టెంబర్‌లో 44.20 మిలియన్ టన్నులు ఉండగా.. 2026 సెప్టెంబర్‌లో 48.90 మిలియన్ టన్నులకు పెరిగింది. దాదాపు 4.70 మిలియన్ టన్నులు లేదా 10.63 శాతం పెరిగింది. ఇదే సమయంలో సీఐఎల్ మొత్తం బొగ్గు సరఫరా 6.80 మిలియన్ టన్నులతో 12.5 శాతం పెరిగింది.
రోజువారీ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో రవాణా కోసం సీఐఎల్ చేస్తున్న నిరంతర కృషి ఎలాంటిదో తెలుస్తుంది. 2026 సెప్టెంబర్‌లో విద్యుత్ రంగానికి సీఐఎల్ పంపించిన మొత్తం బొగ్గు సుమారు 48.99 మిలియన్ టన్నులుగా ఉంది. రోజుకు సగటున సుమారు 1.63 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసింది. నెలలో తొలి ఏడు రోజుల్లో రోజువారీ సగటు సుమారు 1.51 మిలియన్ టన్నులుగా ఉండగా.. చివరి ఏడు రోజుల్లో ఇది 1.59 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే నెల చివరి దశలో రోజువారీ బొగ్గు సరఫరా సామర్థ్యం సుమారు 5 శాతం మెరుగైంది.
సెప్టెంబర్ 28 నుంచి నమోదైన గణాంకాలను పరిశీలిస్తే రోజువారీ బొగ్గు సరఫరా కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో విద్యుత్ రంగానికి రోజువారీ బొగ్గు సరఫరా వరుసగా 1.74, 1.79, 1.71 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఇదే వేగాన్ని అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో వరుసగా 1.75, 1.87, 1.81 మిలియన్ టన్నుల బొగ్గును విద్యుత్ రంగానికి సరఫరా చేసింది.
దీంతో వర్షాకాలం ముగింపు దశలోనూ, వర్షాకాలం అనంతరం కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలోనూ సీఐఎల్ రోజువారీగా భారీ స్థాయిలో బొగ్గు సరఫరాను కొనసాగించగలిగిందని గణాంకాలు వివరిస్తున్నాయి.
విద్యుత్ ఉత్పత్తిలోనూ కనిపిస్తున్న బొగ్గు సరఫరా మెరుగుదల
బొగ్గు సరఫరా వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అంతిమంగా అది విద్యుత్ ఉత్పత్తికి ఎంతవరకు తోడ్పడుతుందన్నదే ముఖ్యమైన ప్రమాణం.
అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి గణాంకాలు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశీయ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడినట్లు చూపిస్తున్నాయి.
2026-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 582.5 బిలియన్ యూనిట్లతో (బీయూ) పోలిస్తే.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 640.05 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇది సుమారు 57.5 బిలియన్ యూనిట్లు లేదా 9.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
బొగ్గు గని నుంచి విద్యుత్ కేంద్రం వరకు: మరింత వేగంగా స్పందిస్తున్న సరఫరా వ్యవస్థ
సీఐఎల్ బొగ్గు పంపిణీ వ్యవస్థ క్రమంగా పరిణామం చెందుతోంది. గతంలో ప్రధానంగా నిర్దేశిత సరఫరా వ్యవస్థపై ఆధారపడిన ఈ విధానం ఇప్పుడు మరింత విస్తృతంగా, అవసరాలకు అనుగుణంగా స్పందించే వ్యవస్థగా అభివృద్ధి చెందింది.
విద్యుత్ రంగానికి అవసరమైన బొగ్గును ప్రధానంగా ఇంధన సరఫరా ఒప్పందాలు, అనుసంధాన విధానాల ద్వారా అందిస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పడే అదనపు అవసరాలను ఇతర మార్కెట్ ఆధారిత మార్గాల ద్వారా కూడా తీర్చే అవకాశం ఉంది. అదే విధంగా అనుసంధాన వ్యవస్థను క్రమబద్ధీకరించడం, డిజిటల్ వ్యవస్థలు, వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వేదికలు, మెరుగైన రవాణా సౌకర్యాలు వంటి చర్యలు బొగ్గు సరఫరాలో మరింత సౌలభ్యం, సామర్థ్యాన్ని పెంచాయి.
దీంతో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, గనుల నుంచి బొగ్గు తరలింపు, వినియోగదారుల అవసరాలను విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమైన అంశాలుగా పరిగణిస్తూ మొత్తం సరఫరా వ్యవస్థను సమగ్రంగా నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుత పనితీరు గనుల వద్ద తగినంత బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో కూడా తెలుపుతుంది.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గనుల వద్ద ఉన్న బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండటం వల్ల వర్షాకాలం తర్వాత బొగ్గు ఉత్పత్తిని క్రమంగా పెంచుతున్నప్పటికీ వినియోగదారులకు అవసరమైన బొగ్గు సరఫరాను నిరంతరంగా కొనసాగించేందుకు సీఐఎల్‌కు తోడ్పడ్డాయి.
ముందున్న లక్ష్యం.. అధిక సరఫరా నుంచి హామీతో కూడిన సరఫరా దిశగా
2026-27 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు సరఫరాలో సాధించిన మెరుగుదల ఆశాజనకంగా ఉంది. అయితే కేవలం ఎక్కువ మొత్తంలో బొగ్గును సరఫరా చేయడమే సీఐఎల్ లక్ష్యం కాదు.
వినియోగదారులకు బొగ్గును నిరంతరంగా, ముందుగా అంచనా వేసే విధంగా, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ అందించడమే అసలు లక్ష్యం.
ఈ మార్పును సాధించేందుకు సీఐఎల్ ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ), వేగవంతమైన లోడింగ్ వ్యవస్థలు, డిజిటల్ పర్యవేక్షణ వంటి సదుపాయాలపై నిరంతరం పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం సీఐఎల్ వద్ద ఉన్న 46 సీహెచ్‌పీ సైలోల (బొగ్గు నిర్వహణ కేంద్రాలు) ద్వారా యాంత్రీకృత విధానంలో 432 మిలియన్ టన్నుల బొగ్గును గనుల నుంచి వేగంగా తరలించే సామర్థ్యం ఉంది. త్వరలో ప్రారంభం కానున్న కొత్త గనుల్లో మరిన్ని సీహెచ్‌పీ సైలోలను ఏర్పాటు చేసేందుకు సీఐఎల్ యోచిస్తోంది.
ఇంధన భద్రతకు బొగ్గు సరఫరా కీలక సాధనం
సీఐఎల్ విజయాన్ని కేవలం ఎంత బొగ్గు ఉత్పత్తి చేసిందనే దానితో మాత్రమే అంచనా వేయడం లేదు. ఉత్పత్తి చేసిన బొగ్గు వినియోగదారులకు ఎంత విశ్వసనీయంగా చేరుతోంది, విద్యుత్ ఉత్పత్తికి ఎంత సమర్థంగా ఉపయోగపడుతోంది, దేశ ఇంధన అవసరాలకు అనుగుణంగా మొత్తం బొగ్గు సరఫరా వ్యవస్థ ఎంత వేగంగా స్పందిస్తోంది అనే అంశాలు కూడా ప్రస్తుతం కీలకంగా మారాయి.
వర్షాకాలం తర్వాత బొగ్గు ఉత్పత్తిని పెంచడం, బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాలను విస్తరించడం, విద్యుత్ రంగ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశానికి మరింత బలమైన, నమ్మకమైన ఇంధన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇప్పుడు సీఐఎల్ ముందున్న ప్రధాన లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2319265)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4