యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ‘‘నషా ముక్త్ యువత- నడక’’ కార్యక్రమాన్ని నిర్వహించిన మై భారత్ 150 ప్రాంతాల్లో కార్యక్రమం.. హాజరైన లక్ష మందికి పైగా యువత, పౌరులు

నాడు పోస్టు చేయడమైనది: 04 OCT 2026 11:26PM by PIB Hyderabad

‘‘నషా ముక్త్ యువత- వికసిత్ భారత్’’ (అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని చైతన్యాన్ని కలిగించడం) ఉద్యమంలో భాగంగా, మై భారత్‌తో పాటు మై భారత్ భాగస్వామ్య సంస్థలు ఈ నెల 4న దేశమంతటా 150 కన్న ఎక్కువ చోట్ల  ‘‘వాక్ ఫర్ నషా ముక్త్ యువా’’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. యువతీయువకులు, పౌరులు కలిపి  లక్ష కన్న ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో  పాలుపంచుకున్నారు.

మత్తు పదార్థాలను ఉపయోగించడానికి అలవాటు పడడం వల్ల కలిగే హానికర ఫలితాలను గురించి యువతను, సమాజాన్ని అప్రమత్తం చేయడమే కాక ఆరోగ్యప్రద, బాధ్యతాయుత, వ్యసనాలకు చోటివ్వని జీవన శైలుల పట్ల అవగాహనను పెంపొందింప చేయడం కూడా ఈ జాతీయ స్థాయి కార్యక్రమ లక్ష్యాలుగా ఉన్నాయి.    

మాదకద్రవ్యాల జోలికి పోని ఆరోగ్యకర సమాజాన్ని ఆవిష్కరించడం ప్రజలందరి బాధ్యత అనే సందేశాన్ని దేశం నలుమూలలకూ విస్తరింపచేసేందుకు యువజనులు, పౌరులు, ప్రజాప్రతినిధులతో పాటు భాగస్వామ్య సంస్థలను ఈ ‘‘వాక్ ఫర్ నషా ముక్త్ యువా’’ కార్యక్రమం ఏకతాటి మీదకు తీసుకువచ్చింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడవడం, వీధి నాటకాల ప్రదర్శన, నినాదాలు రాయడం, హెరిటేజ్ వాక్‌లో పాలుపంచుకోవడం వంటి యువజన చైతన్య ప్రబోధ కార్యకలాపాలను చేపట్టారు. మత్తు పదార్థాల సేవనంతో ముడిపడిన అపాయాల పట్ల చైతన్యాన్ని కలిగించడం కోసం బహిరంగ స్థలాలను ఎంపిక చేసుకున్నారు. కార్యక్రమాల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేటట్లుగా చొరవ తీసుకున్నారు. శరీరానికి హితకరంగా ఉండే అలవాట్లను  జీవిత విధానంలో భాగం చేసుకోవాలంటూ యువతను ప్రోత్సహించారు.

నషా ముక్త్ యువా ప్రతిన స్వీకరించడాన్ని ఒక భాగం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు తాము మత్తు పదార్థాలను ఉపయోగించబోమనీ, స్వస్థ, జాగరూక, మాదకద్రవ్యాలకు చోటు ఇవ్వని సమాజాన్ని నిర్మించడంలో తమ వంతు పాత్రను పోషిస్తామనీ వాగ్దానం చేశారు. మాదకద్రవ్యాల సేవనానికి వ్యతిరేకంగా వ్యక్తిగత స్థాయిలో పూచీపడడంతో పాటు, ఉమ్మడి చర్యలకు ముందుకు రావాలనే సందేశాన్ని కూడా ఈ ప్రతిన ద్వారా అందించారు.

జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు, కేబినెట్ మంత్రి, ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు, ఎనిమిది మంది శాసన సభ్యులు ఉన్నారు.

యువజనులు, పౌరులు, ప్రజా ప్రతినిధులతో పాటు భాగస్వామ్య సంస్థలు కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చాయి. వికసిత్ భారత్‌‌ ఆశయాన్ని సాధించడానికి యువతను మత్తు పదార్థాల వాడకానికి బానిసలు కాకుండా చూడాలన్న సమష్టి సంకల్పానికి ఈ కార్యక్రమం అద్దం పట్టింది. ఆరోగ్యప్రద, శక్తిమంత, అభివృద్ధి చెందిన భారత్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేయడానికి యువత శారీరక స్వస్థత పట్ల శ్రద్ధ వహించేటట్లు చైతన్యపరచడం ముఖ్యమన్న సందేశాన్ని ఈ కార్యక్రమంతో అందించారు.

వికసిత్ భారత్ ఉద్యమం సఫలం కావాలంటే యువత మత్తుమందుల వలలో చిక్కుకోకుండా చూడాలన్న స్థూల ఉద్దేశంతో ‘‘వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’’ను నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగ ముప్పును

ఎదుర్కొని సమర్థంగా పరిష్కరించడానికి అవగాహన కార్యక్రమాలను తరచుగా నిర్వహించడం, వాటిలో యువజనులు పాల్గొని విషయాలను గ్రహించేలా శ్రద్ధ వహించడం, ఉమ్మడి చర్యలను చేపట్టడం ద్వారా యువతీయువకుల, సమాజాల మద్దతును కూడగట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2319103) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी