ఆర్థిక మంత్రిత్వ శాఖ
ముంబయి విమానాశ్రయంలో బంగారం, వజ్రాల అక్రమ రవాణా ముఠాను ఛేదించిన డీఆర్‌ఐ
రూ.13.5 కోట్లకు పైగా విలువైన సుమారు 8.5 కిలోల విదేశీ బంగారం, 1,100 క్యారెట్లకు పైగా వజ్రాల స్వాధీనం.. 8 మంది అరెస్టు
భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా, దుబాయ్‌కు వజ్రాల అక్రమ ఎగుమతికి సహకరించిన విమానాశ్రయ సిబ్బంది
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 9:59PM by PIB Hyderabad
వ్యవస్థీకృత అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా నిర్వహిస్తున్న ఒక అధునాతన ద్విముఖ అక్రమ రవాణా ముఠాను డీఆర్‌ఐ ఛేదించింది. ఈ తనిఖీల్లో సుమారు రూ.12.64 కోట్ల విలువైన 8.564 కిలోల 24 క్యారెట్ల విదేశీ బంగారం, సుమారు రూ.1.09 కోట్ల విలువైన 1,168.97 క్యారెట్ల వజ్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ విమానాశ్రయ సిబ్బంది, ఆరుగురు ట్రాన్సిట్ ప్రయాణికులు, ఒక భారతీయ ప్రయాణికుడు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
2026 సెప్టెంబర్ 30న అందిన పక్కా సమాచారం మేరకు చర్యలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు.. విమానాశ్రయ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి డిపార్చర్ ప్రాంతంలో దుబాయ్ వెళ్తున్న భారతీయ ప్రయాణికుడికి వజ్రాలను అప్పగిస్తుండగా అతడిని అడ్డుకున్నారు. భారత్ నుంచి వజ్రాలను అక్రమంగా తరలించేందుకు అతడు వాటిని అప్పగిస్తున్నట్లు గుర్తించారు. వేంటనే సదరు వ్యక్తిని తనిఖీ చేయగా, విదేశీ బంగారాన్ని మైనపు రూపంలో పొడి చేసి నింపిన మూడు క్యాప్సూల్స్ అతని వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ క్యాప్సూల్స్‌ను ఒక ట్రాన్సిట్ ప్రయాణికుడు అతనికి అప్పగించినట్లు వెల్లడైంది.
తదుపరి విచారణలో బంగారాన్ని అతనికి అప్పగించిన ట్రాన్సిట్ ప్రయాణికుడి వివరాలను విమానాశ్రయ సిబ్బంది వెల్లడించాడు. దీంతో ఆ ప్రయాణికుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్, దోహా, జెడ్డా, ఫుజైరా నుంచి వేర్వేరు విమానాల్లో రానున్న మరో అయిదుగురు ట్రాన్సిట్ ప్రయాణికులు కూడా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అతనికి ఇవ్వనున్నట్లు విమానాశ్రయ సిబ్బంది వెల్లడించాడు.
ట్రాన్సిట్ ప్రాంతంలో విమానాశ్రయ సిబ్బందికి బంగారం క్యాప్సూల్స్‌ను అప్పగిస్తున్న అయిదుగురు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు రహస్య నిఘా ద్వారా అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలించిన బంగారాన్ని అప్పగించిన అనంతరం ఈ ప్రయాణికులు సింగపూర్, ఢాకా వెళ్లాల్సి ఉంది. కస్టమ్స్ చట్టం 1962లోని సంబంధిత నిబంధనల కింద మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
మొత్తంగా మైనపు రూపంలో ఉన్న 24 క్యారెట్ల విదేశీ బంగారు పొడిని కలిగి ఉన్న 23 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 8.564 కిలోలు కాగా, విలువ సుమారు రూ.12.64 కోట్లు. వీటితోపాటు మొత్తం 1,168.97 క్యారెట్ల వజ్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 132.17 క్యారెట్లు సహజ వజ్రాలు, 1,036.80 క్యారెట్లు ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.09 కోట్లు. విమానాశ్రయాల ద్వారా బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తూ, అవినీతికి పాల్పడిన విమానాశ్రయ సిబ్బంది ప్రమేయం ఉన్న అంతర్గత ముప్పును ఈ ఆపరేషన్ మరోసారి వెలుగులోకి తెచ్చింది.
ఈ దర్యాప్తు ప్రత్యేకమైన ద్విముఖ అక్రమ రవాణా విధానాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇందులో అదే విమానాశ్రయ సిబ్బంది సభ్యుడు రెండు దిశల్లోనూ అక్రమ వస్తువుల తరలింపునకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ ట్రాన్సిట్ ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని స్వీకరించి రహస్యంగా భారత్‌లోకి తరలించేందుకు సహకరించడంతో పాటు, మరోవైపు బయలుదేరే ప్రయాణికుడి ద్వారా వజ్రాలను దుబాయ్‌కు అక్రమంగా ఎగుమతి చేయడానికి కూడా సహకరిస్తున్నట్లు గుర్తించారు.
****
(రిలీజ్ ఐడి: 2318624)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7